
భారత్ లో కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతోంది. అంచనాలకు అందని స్థాయిలో కరోనా కేసులు, మరణాలు నమోదవుతున్నాయి. దేశంలో దాదాపు 85 లక్షల కరోనా కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం చివరినాటికి కరోనా కేసుల సంఖ్య కోటికి చేరుకునే అవకాశం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా తగ్గుముఖం పడుతున్నా కొన్ని రాష్ట్రాల్లో మాత్రం అంచనాలకు అందని స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.
దేశంలో ప్రస్తుతం 40,000కు అటూఇటుగా కరోనా కేసులు నమోదవుతుండగా ఢిల్లీ, కేరళ రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. కేసుల సంఖ్య తగ్గుతున్న నేపథ్యంలో చాలామంది కరోనా నిబంధనలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. దీంతో కరోనా వైరస్ మళ్లీ విజృంభించే అవకాశం ఉందని.. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ప్రాణాలకే ప్రమాదమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
సీసీఎంబీ కరోనా మహమ్మారిని కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వస్తే మాత్రమే పరిస్థితుల్లో మార్పు వస్తుందని.. మనుషుల తప్పిదాల వల్ల కరోనా ఫస్ట్ వేవ్ తో పోలిస్తే సెకండ్ వేవ్ ప్రమాదకరం అని చెబుతున్నారు. కరోనా సెకండ్ వేవ్ మొదలైతే వైరస్ మరింత వేగంగా విజృంభించే అవకాశం ఉందని.. నిర్లక్ష్యం చేస్తే ప్రజలు మూల్యం చెల్లించుకోక తప్పదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
కరోనాను కట్టడి చేసే వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే వరకు వేవ్స్ ఉంటాయని.. కరోనా మళ్లీ విజృంభిస్తే కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయాల్సిన పరిస్థితి నెలకొంటుందని తెలిపారు. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా ప్రజలందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే చాలా సమయం పడుతుందని శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు.