ఈ మధ్య కాలంలో మోసాలు చేసేవాళ్లు కొత్త తరహా మోసాలకు తెర లేపుతున్నారు. అవతలి వ్యక్తులకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపి మోసాలకు పాల్పడుతున్నారు. ఇలా మోసాలకు సంబంధించి ప్రతిరోజూ ఎన్నో ఘటనలు వెలుగులోకి వస్తున్నా అత్యాశ వల్ల కొందరు మోసపోతూనే ఉన్నారు. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది. మోసగాళ్లు కిడ్నీ కొనుగోలు చేస్తామని చెప్పి మోసానికి పాల్పడటం గమనార్హం.
నాగోల్ ఆనంద్‌నగర్ కు చెందిన ఒక వ్యక్తి గత కొన్నేళ్లుగా ఆర్థికపరమైన కష్టాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. రోజురోజుకు అతనికి అప్పులు పెరిగిపోయాయి. పెరిగిన అప్పులను ఏ విధంగా తీర్చాలో అర్థం కాకపోవడంతో తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు పొందే ఛాన్స్ ఏమైనా ఉందేమో శోధించాడు. అదే సమయంలో అతనికి కిడ్నీని ఇవ్వడం ద్వారా భారీ మొత్తంలో డబ్బు సంపాదించుకోవచ్చనే ప్రకటన కనపడింది.
ఒక కిడ్నీ ఇవ్వడం ద్వారా మూడు కోట్ల రూపాయలు సంపాదించుకోవచ్చని ఆ ప్రకటనలో ఉంది. వెంటనే ప్రకటనలో ఉన్న నంబర్ కు వాట్సాప్ లో మెసేజ్ చేసి అతని పూర్తి వివరాలను, బ్లడ్ గ్రూప్ ను అవతలి వ్యక్తులకు పంపించాడు. అనంతరం అవతలి వ్యక్తులు రిజిస్టేషన్ ఫీజు, ఇతర ఛార్జీల పేరుతో 10,000 రూపాయల చొప్పున చెల్లించాలని ఆ వ్యక్తికి సూచించడంతో ఏకంగా 4 లక్షల రూపాయల వాళ్ల ఖాతాలలో జమ చేశాడు.
ఆ తరువాత అవతలి వ్యక్తుల వాట్సాప్ నంబర్ పని చేయకపోవడంతో మోసపోయిన వ్యక్తికి ఏం చేయాలో పాలుపోలేదు. చివరకు ఆ వ్యక్తి సైబర్ క్రైమ్ పోలీసులను సంప్రదించి ఎలా మోసపోయాడనే వివరాలను చెప్పాడు. పోలీసులు పేపర్లలో, టీవీలలో వచ్చే ప్రకటనల పట్ల అప్రమత్తంగా ఉండాలని.. అపరిచితులు ఇచ్చే ప్రకటనలను నమ్మి మోసపోవద్దని సూచిసున్నారు.