Chinese Garlic: కొన్ని సంవత్సరాల నుంచి కల్తీ కల్తీ అనే వార్తలు ఎక్కువ వింటున్నాం. ఎలాంటి ఆహారం అయినా సరే కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. ఏ ఆహారాన్ని తినాలన్నా ఆలోచించాల్సిందే. లేదంటే ఆ తర్వాత వచ్చే ఆరోగ్య సమస్యలకు బలి అవ్వాల్సిందే. పప్పులు, ఉప్పు, పాలు, నూనె, స్వీట్లు వంటి వంటల్లో ఉపయోగించే చాలా పదార్థాలు కూడా కల్తీ అవుతున్నాయి. వెల్లుల్లికి సైతం నకిలీ మకిలీ అంటేసుకుంది. ప్రస్తుతం మార్కెట్లో విషపూరిత వెల్లుల్లి అమ్మకాలు స్వేచ్ఛగా రాజ్యమేలుతున్నాయి. ఈ వార్తలు ఇప్పుడు దుమారం రేపుతున్నాయి. నివేదికల ప్రకారం 2014లో నిషేధించిన చైనా వెల్లుల్లిని ప్రస్తుతం మన దేశంలో అక్రమంగా అమ్ముతున్నారట. ఈ వార్తలు విన్న ప్రజలు కంగుతింటున్నారు. అయితే ఈ నిషేధించిన వెల్లుల్లిలో పెద్దమొత్తంలో క్రిమి సంహారక పదార్ధాలు ఉన్నాయట. ఈ విషయాన్ని అధ్యయనం చేసిన నిపుణులే చెబుతున్నారు.
వెల్లుల్లిని ఆయుర్వేదంలో దివ్యౌషధంగా ఉపయోగిస్తుంటారు. జలుబు నుంచి రక్తపోటు వరకు అన్నింటికీ అద్భుతంగా పనిచేస్తుంది. వెల్లుల్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్, సెలేనియం ఉంటాయి. అయితే ఇప్పుడు మార్కెట్‌లోకి అక్రమంగా ప్రవేశించిన చైనీస్ వెల్లుల్లిలో విషపూరితమైన కెమికల్స్ ఉన్నాయనే నిపుణుల హెచ్చరికతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఈ వెల్లుల్లికి ఫంగస్ పట్టకుండా ఉండేందుకు చైనా మిథైల్ బ్రోమైడ్ మిక్స్ అయిన ఒక ఫంగీసైడ్‌ను వినియోగించిందని జాదవ్ పూర్ యూనివర్శిటీ ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. అంతేకాకుండా క్లోరిన్ కూడా వినియోగించారని తేలింది. దీనివల్ల వెల్లుల్లిలో ఉండే క్రిములు నాశనమవుతాయి. వెల్లుల్లి కూడా తెల్లగా తాజాగా కన్పిస్తుందని చెబుతున్నారు.
చైనా ప్రాడక్ట్స్ మాత్రమే కాదు చైనా నుంచి వచ్చే ఎలాంటి పదార్థం అయినా సరే హాని తలపెట్టేలా ఉందని కొందరి ఆవేదన. అయిత ఈ చైనీస్ వెల్లుల్లిలో కలిపే మిథైల్ బ్రోమైడ్ చాలా హానికారకమట. ఇదొక విషపూరితమైన రంగులేని గ్యాస్. దీన్ని క్రిమి సంహారక పనులకు ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఇది ఎక్కువ మోతాదులో వాడితే ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. మిథైల్ బ్రోమైడ్ కారణంగా ఊపిరితిత్తులు, కళ్లు, చర్మానికి హాని కలుగుతుంది. ఒక్కోసారి దీని వల్ల కోమాలోకి వెళ్లే అవకాశం కూడా ఉందట. అందుకే మార్కెట్‌లో లభించే వెల్లుల్లితో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. చైనా వెల్లుల్లి రెమ్మలు పరిమాణంలో పెద్దవిగా ఉంటాయి.. తొక్కలపై బ్లూ, పర్పుల్ కలర్ గీతలు కన్పిస్తాయని చెబుతున్నారు. ఇలాంటి వెల్లుల్లి కన్పిస్తే పొరపాటున కూడా తీసుకోవద్దని చెబుతున్నారు.
వెల్లుల్లి మార్కెట్లోనే అతిపెద్ద ఉత్పత్తిదారుగా చైనా ఉంది. చైనాలో పండించే వెల్లుల్లిని ఆధునిక వ్యవసాయ పద్ధతులను ఉపయోగించి పండిస్తారు. ఇందులో రసాయనాలు, పురుగుమందులు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ వ్యవసాయ పద్ధతులు చైనీస్ వెల్లుల్లి పట్ల ఆందోళనలను లేవనెత్తాయి. దీని వల్ల 2014లో భారతదేశం దాని దిగుమతిపై నిషేధించింది. అయినప్పటికీ, చైనీస్ వెల్లుల్లి చౌకగా లభిస్తుంది. ఇక ఈ చైనీస్ వెల్లుల్లి వ్యాపారులకు లాభదాయకంగా ఉందని..అక్రమ రవాణా కొనసాగుతోంది.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించేముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.