కరోనా వైరస్ విజృంభణ వల్ల కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ మార్చి నెల చివరి వారం నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను అమలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం మే నెల 31 వరకు పూర్తి ఆంక్షలతో లాక్ డౌన్ ను అమలు చేయగా ఈ సమయంలో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు పడిన ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. లాక్ డౌన్ వల్ల సూక్ష్మ, మధ్యతరహా పరిశ్రమల వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారు.
జూన్ నెల నుంచి కేంద్రం అన్ లాక్ సడలింపులను అమలు చేస్తూ ఆంక్షలను నెమ్మదిగా ఎత్తివేసింది. దాదాపు దేశంలోని అన్ని వ్యాపార, వాణిజ్య రంగాల విషయంలో ఆంక్షలు తొలగించడంతో మళ్లీ దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే గత రెండు, మూడు రోజుల నుంచి భారత్ లో మళ్లీ లాక్ డౌన్ ను అమలు చేయనున్నారంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. దీంతో దేశంలోని ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
మరోసారి లాక్ డౌన్ ను అమలు చేస్తే తమకు ఇబ్బందులు ఎదురవుతాయని పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు కామెంట్లు చేస్తున్నారు. అయితే డిసెంబర్ 1 నుంచి లాక్ డౌన్ అంటూ జోరుగా జరుగుతున్న ప్రచారం గురించి కేంద్రం స్పందించి వివరణ ఇచ్చింది. వైరల్ అవుతున్న వార్తలో ఎలాంటి నిజం లేదని ప్రకటన చేసింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వైరల్ అవుతున్న ట్వీట్ ను ఎవరో మార్ఫింగ్ చేసినట్లు పేర్కొంది.
ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమాచారాన్ని గుడ్డిగా నమ్మవద్దని… ఫేక్ వార్తలను వైరల్ చేయవద్దని.. ఇతరులకు వైరల్ అవుతున్న వార్తలను ఫార్వర్డ్ చేసేముందు నిజానిజాలు నిర్ధారించుకోవాలని సూచనలు చేసింది.