Joint pains : చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు.. ఇంతకీ ఏం చేయాలి?

గతంలో చాలా సమస్యలు వయసు మీద పడిన తర్వాతనే వచ్చేవి. కానీ ప్రస్తుతం చిన్న వయసులోనే చాలా సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఇక కీళ్ల నొప్పులు అయితే కచ్చితంగా 40 సంవత్సరాలు పైబడిన తర్వాతనే వచ్చేవి. కొన్ని సార్లు 60 సంవత్సరాల తర్వాత కూడా కొందరు జింక పిల్లల్లా పరిగెత్తేవారు. కానీ ప్రస్తుతం ఇలాంటి పరిస్థితులు అసలు కనిపించడం లేదు. అయితే వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీంతో సమస్యలు పుట్టుకొస్తాయి. కానీ నేటి కాలంలో చిన్న వయసులోనే కీళ్ల నొప్పులు రావడం వల్ల ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నారు. మరి దీనికి కారణం ఏంటి అనుకుంటున్నారా?

Written By: Gopi, Updated On : October 16, 2024 12:56 pm

Joint pains at a young age.. What to do?

Follow us on

Joint pains : ప్రస్తుతం ప్రతి ఇంట్లోనూ చేతులు, కాళ్లలో నొప్పులతో బాధపడేవారు ఎక్కువ అవుతున్నారు. దీంతో మోకాళ్ల మార్పిడి శస్త్ర చికిత్సలు కూడా రోజురోజుకూ పెరుగిపోతున్నాయి. ఎముకల సమస్య ఉంటే ముందుగా చేయాల్సింది క్యాల్షియం, విటమిన్ డి మందులు తీసుకోవడం అంటున్నారు నిపుణులు.

చిన్నవయసులో నేలపై కూర్చోవడానికి ఇబ్బంది, మెట్లు ఎక్కేటప్పుడు కాళ్లలో నొప్పి వంటివి వస్తున్నాయా? అంతేకాదు బరువైన వస్తువులను ఎత్తేటప్పుడు వీపు, భుజాలు, చేతులు నొప్పి మోకాళ్లు వంచడంలో ఇబ్బంది,  వంటివి బలహీన ఎముకలను సూచించే లక్షణాలు కనిపిస్తాయి. అయితే పోషకాహారం సక్రమంగా లేకపోతే ఎముకల బలం తగ్గుతుంది అంటున్నారు నిపుణులు. క్రమంగా ఎముక క్షీణత ప్రారంభమవుతుంది. ఇవి మందులతో మాత్రమే నయం కాదు కూడా. దీంతో పాటు జీవనశైలిలో కొన్ని మార్పులు చేసుకోవాల్సిందే.

బరువును అదుపులో ఉంచుకోవడం ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అధికంగా బరువు ఉంటే నడుము, మోకాలు,  చీలమండలపై అధిక ఒత్తిడిని కలిగిస్తుంది. కావున ముందుగా బరువును అదుపులో ఉంచుకోవడం వల్ల ఈ సమస్యల నుంచి బయటపడవచ్చు. ఎక్కువ సేపు కదలకుండా కూర్చుంటే ఎముకల సమస్యలు మరింత ఎక్కువ అవుతాయి.. ఎక్కువసేపు కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల వెన్నెముకపై ఒత్తిడి పడి నొప్పి మరింత ఎక్కువ అవుతుంది. ఎందుకంటే తప్పుడు భంగిమలో ఎక్కువ సేపు కూర్చోవడం లేదా పడుకోవడం వల్ల వీపు, మెడ లేదా నిర్మాణ సమస్యలకు ఆటంకం కలుగుతుందట. ఎక్కువ సేపు హీల్స్ వేసుకోవడం వల్ల కూడా వెన్ను సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.

బరువు నియంత్రణ లేదా ఎముకల ఆరోగ్యం ఈ రెండింటికీ రెగ్యులర్ వ్యాయామం మంచిది అని సలహా ఇస్తున్నారు నిపుణులు. శరీరంలోని వివిధ కీళ్ల చుట్టూ కండరాలు బలంగా ఉండాలి. లేదంటే గాయం అయ్యే అవకాశాలు పెరుగుతాయి. కాబట్టి నడక, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి క్రమం తప్పకుండా చేయడం అవసరం.

వ్యాయామం చేసేటప్పుడు లేదా నడిచేటప్పుడు సౌకర్యంగా ఉండే బూట్లు ధరించాలి. లేదంటే ఎముకల సమస్యలు వస్తాయి. సౌకర్యవంతమైన బూట్లు ధరించకపోతే పాదాల నరాలు, లిగమెంట్లు ఒత్తిడికి గురవుతాయని వైద్యులు చెబుతున్నారు. దీనివల్ల ప్రయోజనం కంటే హాని కలిగించే అవకాశం ఎక్కువ ఉంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.