Hero Vida Electric Scooter: హీరో మోటోకార్ఫ్ కంపెనీకి చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ టూ వీలర్ బ్రాండ్ ‘విడా’ భారత మార్కెట్లోకి సరికొత్త ఫ్లాగ్‌షిప్ వెహికల్ ను తీసుకొస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న 3.4 kWh మోడల్ కంటే ఇది మరింత శక్తివంతమైన పెద్ద బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. వినియోగదారులను ఇబ్బంది పెట్టే రేంజ్ యాంగ్జైటీ సమస్య నుంచి బయటపడడానికి ఇది ఉపయోగపడుతంది. ఇంతకీ ఈ స్కూటర్ ఏదంటే?
విడా బ్రాండ్ నంచి Vida VX2 Plus 4.4 kWh వేరియంట్ విడుదలయింది. ఈ కొత్త స్కూటర్‌లో అతిపెద్ద మార్పు దీని బ్యాటరీ సామర్థ్యమే. ఇందులో అమర్చిన 4.4 kWh లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ద్వారా ఏకంగా 187 కిలోమీటర్ల అద్భుతమైన రేంజ్‌ను అందిస్తుంది. రియల్ వరల్డ్ కండిషన్స్‌లో కూడా ఇది ‘ఎకో మోడ్’లో సుమారు 140 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదని కంపెనీ పేర్కొంది. అంతేకాకుండా, ఈ బ్యాటరీలు ‘రిమూవబుల్’ కావడంతో, అపార్ట్‌మెంట్లు లేదా పై అంతస్తుల్లో ఉండేవారు కూడా వీటిని సులభంగా ఇంట్లోకి తీసుకెళ్లి చార్జ్ చేసుకోవచ్చు.
సాంకేతికంగా ఈ స్కూటర్ 6 kW పీక్ పవర్, 26 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది కేవలం 3.1 సెకన్లలోనే 0 నుండి 40 కి.మీ. వేగాన్ని అందుకోగలదు. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లుగా ఉంది. ఈ స్కూటర్‌తో పాటు కంపెనీ ఇప్పుడు 1 kW ఫాస్ట్ పోర్టబుల్ చార్జర్‌ను ఉచితంగా అందిస్తోంది. దీని సహాయంతో ఇంటి వద్దే కేవలం 3 గంటల 17 నిమిషాల్లో 0 నుండి 80 శాతం వరకు బ్యాటరీని చార్జ్ చేసుకోవచ్చు. ఒకవేళ DC ఫాస్ట్ చార్జింగ్ నెట్‌వర్క్‌ను ఉపయోగిస్తే.. కేవలం 65 నిమిషాల్లోనే 80 శాతం చార్జింగ్ పూర్తవుతుంది.
ఈ స్యూటర్ లో అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి. ఇందులో 4.3 అంగుళాల కలర్ టిఎఫ్‌టి (TFT) స్క్రీన్ డిస్ ప్లేను చూడొచ్చు. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, టర్న్-బై-టర్న్ నావిగేషన్, మరియు ఓటిఏ (OTA) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్లు ఉంటాయి. ఎకో (Eco), రైడ్ (Ride), స్పోర్ట్స్ (Sport) మోడ్‌లతో పాటు అత్యవసరంగా ఓవర్‌టేక్ చేయడానికి ఉపయోగపడే ‘బూస్ట్ మోడ్’ కూడా ఉంది. రెండు భారీ బ్యాటరీలు ఉన్నప్పటికీ, దీని కింద 27.2 లీటర్ల అండర్-సీట్ బూట్ స్పేస్ లభిస్తుంది.ఇందులో కంబైన్డ్ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) తో కూడిన ఫ్రంట్ డిస్క్, రియర్ డ్రమ్ బ్రేకులు ఉన్నాయి.
భారతదేశంలో హీరో విడా VX2 ప్లస్ (4.4 kWh) ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.50,990 గా నిర్ణయించబడింది. అయితే, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో లభించే భారీ స్టేట్ సబ్సిడీలు, ఇన్‌సెంటివ్‌లతో కలిపి దీని ఎఫెక్టివ్ ఎక్స్-షోరూమ్ ధర కేవలం రూ. 1,43,990 కే లభిస్తుంది. అలాగే, వినియోగదారులు ‘బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్’ (BaaS) సబ్‌స్క్రిప్షన్ మోడల్ ద్వారా కూడా ఈ స్కూటర్‌ను మరింత తక్కువ ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చు. 2026 జూలై చివరి నాటికి దేశవ్యాప్తంగా ఉన్న షోరూమ్‌లలో ఈ స్కూటర్ డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
