kidney Stones: మన శరీరంలో కిడ్నీలు అత్యంత కీలకమైన అవయవాలు. రక్తంలోని వ్యర్థ పదార్థాలను ఫిల్టర్ చేయడం, శరీరంలో నీటి సమతుల్యతను కాపాడటం, రక్తపోటును నియంత్రించడం వంటి ముఖ్యమైన పనులను కిడ్నీలు నిర్వహిస్తాయి. అయితే మారుతున్న జీవనశైలి, తక్కువ నీరు తాగడం, అధిక ఉప్పు ఉన్న ఆహారం తీసుకోవడం వంటి కారణాలతో కిడ్నీలో రాళ్ల సమస్య పెరుగుతోంది. అందుకే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ అవసరమని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఈ అలవాట్లతో ఈ సమస్య కిడ్నీలను కాపాడుకోవచ్చని అంటున్నారు. అవేంటంటే?
కిడ్నీలో రాళ్లలో ఎక్కువ శాతం కాల్షియం ఆక్సలేట్ రాళ్లు ఉంటాయి. కాబట్టి ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలను అతిగా తీసుకోవడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. రాగులు, జీడిపప్పు, దానిమ్మ, డార్క్ చాక్లెట్, టమాటా, వేరుశనగలు, రాజ్‌గిరా వంటి ఆహారాల్లో ఆక్సలేట్ మోతాదు ఎక్కువగా ఉంటుంది. అయితే వీటిని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. కిడ్నీ రాళ్ల సమస్య ఉన్నవారు వైద్యులు లేదా డైటీషియన్ సలహా మేరకు పరిమిత మోతాదులో తీసుకోవడం మంచిది.
కిడ్నీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో నీరు అత్యంత కీలక పాత్ర పోషిస్తుంది. రోజుకు కనీసం 2.5 నుంచి 3 లీటర్ల వరకు నీరు తాగితే మూత్రం ద్వారా లవణాలు, ఖనిజాలు బయటకు వెళ్లిపోతాయి. దీంతో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా వేసవికాలంలో లేదా ఎక్కువగా చెమట పట్టే పనులు చేసే వారు ఇంకా ఎక్కువగా నీరు తీసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు.
చాలామంది కిడ్నీలో రాళ్లు వస్తాయని భయపడి కాల్షియం ఉన్న ఆహారాలను పూర్తిగా మానేస్తుంటారు. అయితే ఇది సరైన పద్ధతి కాదు. తగిన మోతాదులో కాల్షియం తీసుకోవడం వల్ల పేగుల్లోనే ఆక్సలేట్‌తో కలిసిపోయి అది శరీరంలోకి ఎక్కువగా శోషించబడకుండా సహాయపడుతుంది. దీంతో కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం తగ్గుతుంది. అందుకే పాలు, పెరుగు వంటి కాల్షియం ఉన్న ఆహారాలను వైద్యుల సూచన మేరకు తీసుకోవాలి.
అధికంగా ఉప్పు తీసుకోవడం వల్ల మూత్రంలో కాల్షియం మోతాదు పెరిగి కిడ్నీ రాళ్ల ప్రమాదం ఎక్కువవుతుంది. అలాగే చిప్స్, ఫాస్ట్ ఫుడ్, ప్యాకెట్ స్నాక్స్, ప్రాసెస్డ్ మాంసాహార పదార్థాలు, ఇన్‌స్టంట్ ఫుడ్స్‌లో సోడియం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీటిని వీలైనంత వరకు తగ్గించి తాజా, ఇంట్లో తయారుచేసిన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, తగినంత ప్రోటీన్, సరిపడా కాల్షియం ఉన్న సమతుల్య ఆహారం తీసుకోవడం కిడ్నీల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అలాగే చక్కెర అధికంగా ఉండే శీతల పానీయాలు, అధిక ప్రోటీన్ సప్లిమెంట్లను అవసరం లేకుండా తీసుకోవడం తగ్గించాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, బరువును నియంత్రణలో ఉంచడం కూడా కిడ్నీల ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది.
నడుము లేదా పక్కటెముకల కింద తీవ్రమైన నొప్పి, మూత్రంలో రక్తం కనిపించడం, మూత్రం సమయంలో మంట, తరచుగా మూత్రం రావడం, వికారం, వాంతులు వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలి. ప్రారంభ దశలోనే చికిత్స తీసుకుంటే సమస్య తీవ్రతను తగ్గించే అవకాశం ఉంటుంది.
