
దేశంలో ప్రతిరోజూ లక్షల సంఖ్యలో ప్రజలు కరోనా వ్యాక్సిన్ ను తీసుకుంటున్నారు. మరోవైపు కరోనా కేసుల సంఖ్య, మరణాల సంఖ్య అంతకంతకూ తగ్గుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలను సడలిస్తూ ఉండటం గమనార్హం. అయితే శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనంలో కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం ఉండదని తేలింది.
దేశంలో కరోనా మరణాలు తగ్గించడానికి కూడా వ్యాక్సిన్లు కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత పాజిటివ్ వచ్చిన 677 మందిలో 86 శాతం మంది డెల్టా వేరియంట్ బారిన పడినట్టు తేలింది. వీరిలో కేవలం 9.8 శాతం మంది మాత్రమే ఆస్పత్రిలో చేరగా మరణాల సంఖ్య 0.4 శాతంగా ఉంది. 482 మందిలో కరోనా లక్షణాలు కనిపించగా మిగిలిన వారిలో కరోనా లక్షణాలు కనిపించలేదు.
అయితే కరోనా లక్షణాలు కనిపించిన వాళ్లు జ్వరం, జలుబు, దగ్గు, రుచి, వాసన తెలియకపోవడం, నీళ్ల విరేచనాలు, శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారు. ఇప్పటివరకు కరోనా వ్యాక్సిన్ ను తీసుకోని వాళ్లు వ్యాక్సిన్ ను తీసుకుంటే మంచిదని చెప్పవచ్చు. కరోనా వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరేవారి సంఖ్య గణనీయంగా తగ్గుతుంది. ఇప్పటికే ఒక డోస్ వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు రెండో డోస్ వ్యాక్సిన్ ను కూడా తీసుకుంటే మంచిది.
కరోనా వ్యాక్సిన్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చినా ఆ సైడ్ ఎఫెక్ట్స్ తాత్కాలికమే అని వైద్యులు చెబుతున్నారు. కరోనా పాజిటివ్ వచ్చిన వారి నమూనాలను విశ్లేషించి శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు.