Health tips: ఆహారం వల్లనే చాలా సమస్యలు వస్తాయి. ఈ ఆహార అలవాట్లు మానవ శరీరాన్ని చాలా వరకు ఇబ్బంది పెడుతాయి. అయితే తినే ఆహారం మాత్రమే కాదు. తినే టైమ్ కూడా మీ ఆహారాన్ని ప్రభావితం చేస్తుంది. ఎంత సేపు తింటున్నారు? ఎంత తింటున్నారు? తినే ఆహారం ఎలా ఉంది అనే అంశాలు కూడా మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకే ఆరోగ్యం పట్ల మీ ఆహార పాత్ర ఎక్కువగా ఉంటుందని గుర్తు పెట్టుకోండి.
ఆహారం గబగబా తింటారు కొందరు. దీని వల్ల అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం వంటి సమస్యలు వస్తాయి. ఇక ఇలాంటి ప్రక్రియనే ఎక్కువగా జరుగుతుంటే సమస్య మరింత పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భోజనం చేసినప్పుడు కడుపు నిండిన భావన కలగడం చాలా ముఖ్యమని గుర్తు పెట్టుకోండి. అయితే కడుపు నిండినట్టు మెదడు నుంచి జీర్ణాశయానికి సమాచారం అందటానికి సుమారుగా ఇరవై నిమిషాల సమయం పడుతుంది అంటారు నిపుణులు.
ఎక్కువగా తింటే కడుపు నిండిన భావన కలగకముందే ఎక్కువెక్కువ తినే ప్రమాదం లేకపోలేదు. దీని వల్ల బరువు పెరిగే అవకాశం ఉంటుంది. దీని వల్ల దీర్ఘకాలంలో జీర్ణకోశ సమస్యలు వస్తాయి. అధికంగా తిన్న ఆహారం జీర్ణాశయంలో ఎక్కువ సేపు ఉంటుందట. అయితే ఆహారం అరగడానికి సహాయం చేసే ఆమ్లాలు అంతసేపు జీర్ణాశయం లోపలి జిగురు పోర మీద ప్రభావం చూపుతూనే ఉంటాయట.
పదిహేను నిమిషాలు అంతకంటే ఎక్కువ సేపు భోజనం చేసే వారితో పోలిస్తే ఐదు నిమిషాల్లోనే భోజనం ముగిస్తే జీర్ణకోశ సమస్యల ముప్పు 1.7 రెట్లు ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది. ఇలాంటి వారిలో జీర్ణాశయం పెద్దగా అవడం వల్ల ఊబకాయం, ఆహారం చాలా సేపు జీర్ణాశయంలోనే ఉండటం, వికారం, వాంతులు వంటి సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉందట. జీవక్రియ మార్పు వల్ల మధుమేహం ముప్పు కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీ ఆహార అలవాట్లను కాస్త మార్చుకోవడం ఉత్తమం.