https://oktelugu.com/

Kitchen Hospital : ఆరోగ్యం: మీ వంటిల్లే ఓ వైద్యశాల

జలుబు, తలనొప్పి వంటి సాధారణ రోగాల నుంచి దీర్ఘకాల రోగాలను నయం చేసే ఔషధ గుణాలు మన వంటిల్లులోనే దొరుకుతాయి.

Written By:
  • Rocky
  • , Updated On : July 21, 2023 / 08:55 PM IST
    Follow us on

    Kitchen Hospital : ప్రకృతి ప్రసాదిత పదార్థాలన్నీ అద్భుతాలే…వాటివల్ల ఏదో ఒక ఉపయోగం ఉంటుంది. మన పెద్దలు వాటిని ఇంటి వంట దినుసుల్లో చేర్చింది ఇందుకే. కానీ అధునిక పోకడలు, నిర్లక్ష్యం, చులకన భావంతో చాలామంది వీటి వినియోగాన్ని పట్టించుకోరు. దీనివల్ల ఆరోగ్యపరంగా ఎంత నష్టపోతున్నామో తెలుసుకుంటే ఆశ్చర్యం వేస్తుంది. జలుబు, తలనొప్పి వంటి సాధారణ రోగాల నుంచి దీర్ఘకాల రోగాలను నయం చేసే ఔషధ గుణాలు మన వంటిల్లులోనే దొరుకుతాయి. ఒక్కో పదార్థానిది ఒక్కో గుణం…ఒక్కో రోగాన్ని నయం చేసే సాధనం. వాటిని తెలివిగా వినియోగించుకోవడం మన చేతుల్లోనే ఉంది. వంటింటి పదార్థాలతోనే మన పెద్దలు అద్భుత ఔషధాలు రూపొందించారంటే నమ్ముతారా? నమ్మకం కలగకుంటే ఈ కథనం చదవండి.
    ఆరోగ్యం అందుబాటులో…
    ఆరోగ్యం అనేది మన చేతిలో ఉందంటే ఆశ్చర్యం వేయొచ్చు. రోజూ ఇంట్లో జరిగి వంటకు వినియోగించే పలు పదార్థాలే అద్భుత ఔషధ గుణాలు కలిగి ఉన్నాయంటే నమ్మలేకపోవచ్చు. ఇంట్లో రుచికరమైన వంట వండితే లొట్టలు వేసుకుని తింటాం. కానీ ఆ వంట అంత అద్భుతంగా తయార య్యేందుకు ఉపయోగపడే పదార్థాలు ఏమిటి? అందులోని ఔషధ గుణాలేమిటో తెలుసుకునే ప్రయత్నం చేయం. కానీ తెలుసుకుంటే ఒక రోగం నుంచి మరో రోగంలోకి మనల్ని తీసుకువెళ్లే ఇంగ్లీష్‌ మందులకు దూరం కావచ్చును. ఆస్పత్రికి వెళ్లకుండా ఇంట్లోనే చాలా సమస్యలకు మందులు తయారు చేసుకోవచ్చు. దీనివల్ల ఆర్థిక, ఆరోగ్య లాభం రెండూ కలిసి వస్తాయి.
    పుదీనాతో అజీర్తికి చెక్‌
    అజీర్తికి పుదీనా ఆకు మంచి ఔషధం. ఇందులోని మెంథాల్‌ అనే పదార్థం యాంటీ బ్యాక్టీరియల్‌గా పని చేస్తుంది. నాలుగు పుదీనా ఆకులు నమిలితే శ్వాస తాజాగా ఉంటుంది. పుదీనా వేసుకుని తాగిన మజ్జిగ కూరలు ఎంతో కమ్మగా, రుచిగా ఉంటాయి. ఆరోగ్య నిపుణులు పుదీనాను నేచురల్‌ డైజిన్‌గా పరిగణిస్తారు. వీటి ఆకులతో టీ చేసుకుని తాగితే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడు తుంది. పుదీనా రసంలో తేనె, నిమ్మ రసం కలుపుకుని తాగితే వికారం, వాంతులు  తగ్గుతాయి. పుదీనా రసాన్ని దురదలు ఉన్న చోట రాస్తే ఉపశమనం లభిస్తుంది.
    ఆరోగ్యానికి అమ్మ వంటిది
    ఉల్లి తర్వాత అంతటి గొప్ప స్థానాన్ని నిమ్మ సొంతం. నీటిలో నిమ్మరసం కలుపుకొని సేవిస్తే కిడ్నీలో రాళ్లు ఏర్పడవు. అల్లోపతి వైద్యులు కూడా కాస్త నిమ్మరసం గొంతులో వేసుకుని పుక్కిలిస్తే గొంతు నొప్పి తగ్గుతుందంటారు. తెగిన గాయాలు, దోమ కాటు మీద నిమ్మరసం వేస్తే త్వరగా ఉపశమనం పొందవచ్చు.
    పెరుగు…ఇన్‌ఫెక్షన్‌ మాయం
    పెరుగులో ఉన్న ఎసిడో ఫిలన్‌ బ్యాక్టీరియా శరీరానికి మేలు చేస్తుంది. పొట్టలో స్థిరపడిన బ్యాక్టీరియాను, మూత్ర నాళాల్లని ఇన్‌ఫెక్షన్‌లను తరిమి కొడుతుంది. జీర్ణ క్రియ మెరుగుపడుతుంది. పెరుగు వేసుకుని తిననిదే సంపూర్ణ భోజనం కాదంటారు పెద్దలు. దీని ప్రభావం శరీరంలోని ఉష్ణోగ్రతపై పడి మనస్సు నెమ్మదించి ఉల్లాసంగా ఉండేందుకు ఉపకరిస్తుంది.
    అల్లం..
    అల్లం వేరు రూపాంతరం. చైనీయుల వైద్యంలో అల్లా నిది ప్రత్యేక పాత్ర. అల్లం శరీరంలోని చెడు కొవ్వును కరిగిస్తుంది. వేడి నీళ్లలో ముద్దగా చేసిన అల్లాన్ని కలిపి ఆ నీటిని తాగితే జీర్ణశక్తి వృద్ధి అవుతుంది. ప్రొటీన్లు, కొవ్వు పదార్థాలు త్వరగా జీర్ణమవు తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గ్యాస్‌ మంటలేకుండా చేస్తుంది. ప్రయాణ సమయంలో అల్లం ముక్కలను వాసన చూసినా, నమిలి తిన్నా తల తిరగడం, వామ్టింగ్‌ సెన్సేషన్‌ తగ్గుతుంది. మాంసాహారంలో అల్లం లేకపోతే జిహ్హకు రుచి అందదు.
    వ్యాధి నిరోధక శక్తి…తేనె
    శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే దివ్యౌషధం తేనె. అలసట, గొంతునొప్పి, దగ్గు తగ్గిస్తుంది. మంచి యాంటీబయాటిక్‌. యాంటీ సెప్టిక్‌. కాలిన బొబ్బలు, తెగిన గాయా లపై నేరుగా రాయొచ్చు. పొట్టలో అల్సర్‌లకు కారణమయ్యే బ్యాక్టీరియాను, చర్మంపై మచ్చలను తొలగిస్తుంది. తేనెను ఇతర పదార్థాలతో కలిపి ఆరగించవచ్చు.
     క్యాన్సర్‌ నివారిణి టమాటా
    టమాటలో యాంటీ ఆక్సి డెంట్‌లు, పొటాషియం, విటమిన్‌ సి, ఎ అధికంగా ఉంటాయి. ఇది ఆస్టియో పోరోసిన్‌, బ్రెస్ట్‌ క్యాన్సర్‌ రాకుండా నిరోధిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఎముకలు బలహీన పడుతున్నా, శరీరం రంగుతేలాలన్నా టమాటాలు ఎక్కువగా తినాలి.
    రక్తపోటుకు వెల్లుల్లి
    బీ, సీ విటమిన్లతోపాటు ఖనిజ లవణాలు అధికంగా ఉన్న వెల్లుల్లి ఆర్థరాయిటీస్‌, జలుబు, రక్తపోటులను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు సమృద్ధిగా ఉన్నాయి. రక్తపోటును అరికట్టడం, గుండె కవాటాలను సక్రమంగా పనిచేయడంలో కీలకంగా వ్యవహరిస్తుంది.
    జీలకర్ర..
    జీలకర్ర రెండు రకాలు (నలుపు, తెలుపు). నల్ల జీలకర్రను షాజీర అంటాం. రాత్రి భోజనం అనంతరం కాస్త జీలకర్ర నమిలి మింగితే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తుంది. మహిళల్లో వచ్చే అపసవ్య రుతుక్రమాలకు చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. జీలకర్ర రెగ్యులర్‌ డైట్‌లో చేర్చుకుంటే డయాబెటిస్‌ తగ్గుతుంది. బ్లడ్‌ షుగర్‌ లెవెల్స్‌ తగ్గుతాయి. ఆస్తమాను దూరం చేస్తుంది. వృద్ధాప్య ఛాయలు తగ్గిస్తుంది.
    గ్యాస్ట్రిక్‌ సమస్యకు దాల్చిన చెక్క ది బెస్ట్‌.
    గ్యాస్ట్రిక్‌ సమస్యతో బాధపడే వారికి దాల్చిన చెక్క దివ్వమైన ఔషధం. సంస్కృతంలో దీన్ని త్వక్‌ అంటారు. అంటే తియ్యని మాను అని అర్థం. దాల్చి చెట్టు బెరడే ఈ మసాలా దినుసు. పొడిచేసుకుని నీళ్లలో కలిపి తాగితే మంచిది. కడుపులో విషప్రభావాన్ని తగ్గిస్తుంది. శరీరంలో నిల్వవున్న అధిక నీటిని బయటకు లాగుతుంది. గ్యాస్ట్రిక్‌ సమస్య ఉన్నవారికి పొట్టనొప్పి సమస్య ఉంటుంది. అటువంటి వారు దాల్చిన పొడిని వేడి నీళ్లలో కలిపి కాసేపటి తర్వాత కొంచెం కొంచెం తాగితే లాభం కనిపిస్తుంది. గొంతు మంట ఉన్నవారు గ్లాసు నీళ్లలో పావు టీ స్పూను దాల్చిన చెక్క రసం, అర టీ స్పూన్‌ నిమ్మరసం కలిపి చల్లారిన తర్వాత బాగా పుక్కిలించాలి. ఉదర సంబంధ వ్యాధులకు దాల్చిన చెక్క మంచి ఔషధంగా పనిచేస్తుంది. దాల్చిన పొడిని నమ్మరసంలో కలిపి పేస్ట్‌గా తయారుచేసి ముఖంపై రాస్తే బ్లాక్‌ హెడ్స్‌, మొటిమలు పోతాయి. దానిమ్మ రసం, దాల్చిన చెక్క పొడి తేనెతో కలిపి తీసుకుంటే రక్తహీనత తగ్గుతుంది. శొంటిపొడి, జీలకర్ర పొడితో తీసుకుంటే విరోచనాలు తగ్గుతాయి. దాల్చిన చెక్కపొడిని నీళ్లలో కలిపి మరిగించి తేనెతో కలిపి తాగితే గాఢంగా నిద్రపడుతుంది. మూడున్నర గ్రాముల దాల్చిన చెక్క, 600 మిల్లీగ్రాముల లవంగాలు, 2 గ్రాముల శొంటి తీసుకుని లీటరు నీళ్లలో మరిగించి 50 మిల్లీమీటర్ల మోతాదులో మూడు పూటలా తీసుకుంటే వైరస్‌ కారణంగా వచ్చే జ్వరాలు నయమ వుతాయి. ముక్కుదిబ్బడం, మధుమేహానికి మంచి ఔషధంగా పనిచేస్తుంది.
    తల్లిలాంటిది ఉల్లి
    ఉల్లి చేసిన మేలు తల్లికూడా చేయదంటారు. దీన్నిబట్టి ఉల్లి ప్రత్యేకతను అర్థం చేసుకోవచ్చు. వాచిన వేళ్లకు తాజా ఉల్లిరసం పూస్తే ఉపశమనం లభిస్తుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్‌, యాంటీ ఫంగల్‌ గుణాలు ఎక్కువ. విటమిన్‌ సి కూడా అధికం. ఉల్లి రసం వేసి మరిగించిన నీటిని తాగితే  శ్వాసకోశ వ్యాధులకు ఫలితం కనిపిస్తుంది. లైంగిక ఉద్దీపణలకు ఉపయోగపడుతుంది.
    మెంతులు..
    మెంతుల్లో ఔషధ గుణాలు అధికం. వంద గ్రాముల మెంతులు, మెంతి ఆకులో 60 శాతం పిండిపదార్థం, 44 శాతం కొవ్వు, 1.1 శాతం ఖనిజ లవణాలు, 1.5 శాతం పీచు పదార్థాలు, 1.2 శాతం ఐరన్‌ ఉంటాయి. మెంతిలోని ప్రొటీన్‌లు జుట్టు రాలడాన్ని నివారిస్తాయి. నికోటిన్‌, లెసిథిన్‌ జుట్టు ఎదగడానికి దోహపడుతుంది. మధుమేహం నివారణకు దివ్యంగా పనిచేస్తుంది. రెండు చెంచాల మెంతులు దాదాపు 4 గంటలపాటు నానబెట్టి అదే నీటిలో ఉడకబెట్టాలి. ఆ నీటిని వడపోసి తేనెతో కలిపి తీసుకుంటే ఉబ్బసం, క్షయ, కాలేయం డ్యామేజీ సమస్యల నుంచి బయటపడవచ్చు.
    కరివేపాకు..
    కరివేపాకు వంటింటిలో అత్యంత ప్రధానమైనది. వంటల్లో చివరిలో వేసినా దాని ప్రాధాన్యం అనన్య సామాన్యం. కరివేపాకు జ్యూస్‌ను మజ్జిగలో కలుపుకొని డైలీ డైట్‌గా తీసుకుంటే  బ్యాడ్‌ కొలెస్ట్రాల్‌, అపరిమిత కొవ్వు తొలగిస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు యూరిన్‌, బ్లాడర్‌ సమస్యలను నివారిస్తుంది. సహజసిద్ధంగా లభించే యాంట్లీ హైపర్‌ గ్లిసమిన్‌ ప్రధాన రక్తనాళాల్లో పేరుకుపోతున్న గ్లూకోజ్‌ను కంట్రోల్‌ చేస్తుంది. కంటిచూపును మెరుగుపరుస్తుంది. వేపాకులు, కరివేపాకు ఆకులు సమపాళ్లలో నూరి ముద్దగా తయారు చేసుకోవాలి. రోజూ ఓ టీస్పూన్‌ ముద్దను అరకప్పు మజ్జిగతో తీసుకుంటే చర్మ సంబంధిత రుగ్మతలు తగ్గుముఖం పడతాయి.