Milk to children : పిల్లలు తీసుకునే ఆహారంలో అన్ని పోషకాలు ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. దాని కోసం పిల్లలకు కృత్రిమ పోషకాహారాలు తినిపించకుండా ఎలాంటి రసాయనాలు లేని పానియాలు ఇవ్వడం మంచిది. అందుకు పాలు మంచి ఉదాహరణ అంటున్నారు నిపుణులు. దీని వల్ల పిల్లలు ఆరోగ్యంగా పెరుగుతారు. పాలు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అయితే.. పాలు తాగడానికి మాత్రమే కాకుండా.. పసుపు, తులసి, బాదం పొడి లాంటివి ఇవ్వాలి. వీటిని కలిపి ఇస్తే.. పిల్లలకు కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. చలి ,వర్షాకాలంలో పిల్లలు అంటువ్యాధుల బారిన పడుతుంటారు. దీని నుంచి వారిని రక్షించాలంటే రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. పాలలో కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను కలపాలి.
ఇంట్లో పసుపు పాలలో కలిపి తాగుతుంటారు చాలా మంది. అయితే ఇలాగే పిల్లలకు కూడా పాలు తాగించడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. పాలల్లో పసుపు వేస్తే పెరిగే పిల్లలకు కొంత పోషకాలు అందుతాయి. పసుపు పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది అంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే యాంటీ అలర్జీ గుణాలు పిల్లలకు చాలా అవసరం అవుతాయి. పసుపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు పిల్లల రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడంలో సహాయపడతాయి. బాల్యంలో ఉబ్బసం, శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న పిల్లలకు పసుపు మంచి సహాయకారిణిగా ఉంటుంది.
పాలలో అల్లం కూడా కలిపి ఇవ్వవచ్చు. అల్లం ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. అల్లం పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తుంది. అల్లంతో పాలు మరిగించడం కంటే అల్లం పొడిని కలిపితే మంచి రుచి, ప్రయోజనాలు అందుతాయి. పిల్లలను గ్యాస్ సమస్య తో బాధ పడనివ్వదు. పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరుగడానికి సహాయం చేస్తుంది. అల్లంలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు జలుబు, దగ్గు చికిత్సలో ఉపయోగపడతాయి. కొంచెం కారంగా ఉంటుంది కాబట్టి కొంచెం వేసి ఇవ్వండి.
తులసి ఆకులను పాలలో కలిపి పిల్లలకు ఇవ్వండి. దీంతో పాల నాణ్యత మెరుగు అవుతుంది. తులసిలో ఉండే ఔషధ గుణాలు పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయం చేస్తాయి అంటున్నారు నిపుణులు. తులసి ఆకులను పాలలో మరిగిస్తే దగ్గు, జలుబు, జ్వరం వంటి సమస్యల నుంచి బయటపడవచ్చు. తులసి పాలు శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తాయి.
బాదంపప్పులో రకరకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. పాలతో కలిపితే రుచి పెరుగి ఇష్టంగా తాగుతారు పిల్లలు. పిల్లలకు ఆహారం ఇవ్వడానికి బాదం పాలు మంచి ఎంపిక అంటున్నారు నిపుణులు. ఇందులో ఉండే విటమిన్లు పిల్లల చర్మ ఆరోగ్యానికి తోడ్పడతుంటాయి. బాదం పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వారి మేధస్సును అభివృద్ధి చేయడంలో సహాయం చేస్తుంది. బాదంపప్పు పొడిని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీన్ని కాస్త పాలలో కలిపి పిల్లలకు ఇస్తే వారు ఇష్టంగా తాగుతారు. వారికి ఆరోగ్యం కూడా..