YCP High Command : ఈ ఎన్నికల్లో గెలుపు కోసం జగన్ అనేక స్ట్రాటజీలను అమలు చేశారు.ముఖ్యంగా 80 మంది వరకు టిక్కెట్లను మార్చారు. కొందరికైతే వేరే జిల్లాలకు బదిలీ చేశారు. ముఖం మారితే చాలు.. తన ముఖం చూసి ఓట్లు వేస్తారు అని భావించారు.మంత్రులకు ఎంపీలుగా పోటీ చేయించారు. ఎంపీలను ఎమ్మెల్యేలుగా పోటీ చేయించారు. మరికొన్ని చోట్ల అయితే ద్వితీయ శ్రేణి నాయకులకు సైతం సీట్లు ఇచ్చారు. 175 కు 175 సీట్లు వస్తాయని అంచనా వేశారు. వాళ్ల అంచనాలు తప్పాయి. ఆశలు నీరుగారిపోయాయి. సొంత నియోజకవర్గాల్లో గెలవలేని నేతలు.. పక్క నియోజకవర్గాల్లో గెలిచేస్తారని జగన్ భావించారు. కానీ రెట్టింపు ఓట్ల తేడాతో ఓటమి చవిచూశారు. ఇప్పుడు ఓడిపోయిన నేతలను అదే నియోజకవర్గాల్లో ఉంచాలా.. లేకుంటే సొంత నియోజకవర్గాలకు పంపించాలా.. అని తెగ తాపత్రయ పడుతున్నారు జగన్.ఈ క్రమంలో తమ ఆసక్తిని తెలపడమే తరువాయి.. సొంత నియోజకవర్గాలకు పంపించేస్తున్నారు. ఇప్పుడు మాజీ మంత్రి విడదల రజినిని అదే మాదిరిగా తన సొంత నియోజకవర్గ చిలకలూరిపేటకు పంపించేశారు. ఇక తమ పరిస్థితి ఏంటని మిగతావారు సైతం ప్రశ్నిస్తున్నారు. ఇదే అదునుగా నియోజకవర్గాలను మార్చుకునే పనిలో పడ్డారు.
* రెండు నియోజకవర్గాల్లో మార్పులు
తాజాగా వైసిపి హై కమాండ్ గుంటూరు జిల్లాలోని రెండు కీలక నియోజకవర్గాల ఇన్చార్జిలను మార్చింది. తాడికొండలో మాజీమంత్రి సుచరితను తప్పించి బాల వజ్రబాబును నియమించింది. చిలకలూరిపేటకు తిరిగి రజనీ కేక్ కేటాయించింది. ఇప్పటికే గుంటూరు జిల్లాలో కీలక నేతలు పార్టీకి గుడ్ బై చెప్పారు. కొన్ని నియోజకవర్గాల్లో సమన్వయకర్తలుగా ఉండేందుకు నేతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీంతో హై కమాండ్ చేర్పులు మార్పులు చేయక తప్పడం లేదు. మొన్నటి ఎన్నికల్లో చిలకలూరిపేటలో మనోహర్ నాయుడు పోటీ చేశాడు. గుంటూరు పశ్చిమ నుంచి పోటీ చేసిన రజిని ఓడిపోయారు. ఆమె పార్టీ మారతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో.. తిరిగి చిలకలూరిపేట బాధ్యతలు ఆమెకే అప్పగించడం విశేషం.
* గుంటూరు డిప్యూటీ మేయర్ కు తాడికొండ బాధ్యతలు
ఈ ఎన్నికల్లో తాడికొండ నుంచి పోటీ చేశారు మేకతోటి సుచరిత. ప్రత్తిపాడు కు చెందిన ఆమెను బలవంతంగానే ఈ ఎన్నికల్లో తాడికొండకు పంపించారు. భారీ ఓట్ల తేడాతో ఆమె ఓడిపోయారు. దీంతో తాడికొండలో ఉండలేనని తేల్చేశారు. దీంతో హై కమాండ్ ప్రత్యామ్నాయం చూసుకోవాల్సి వచ్చింది. గుంటూరు నగర డిప్యూటీ మేయర్ బాల వజ్ర బాబును తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించారు. ఈయన ఇటీవలే గుంటూరు నగర వైసీపీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. మొత్తానికైతే చేసిన తప్పులను సరిదిద్దుకునే పనిలో పడ్డారు జగన్.