
దేశంలో తినే ఆహారాన్ని కల్తీ చేసే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. లాభార్జనే లక్ష్యంగా కొంతమంది వ్యాపారులు ఈ తరహా మోసాలు చేస్తున్నారు. కల్తీ ఆహారం తినడం వల్ల కొందరు ఆరోగ్య సమస్యల బారిన పడుతుంటే మరి కొంతమంది ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతోంది. కొంతమందికి కల్తీ చేయడం వ్యాపారంగా మారడంతో మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.
ఆహారం కల్తీ చేసేవాళ్లకు జీవితఖైదు విధించేలా చట్టంలో మార్పులు చేసింది. మధ్యప్రదేశ్ హోంశాఖ మంత్రి నరోత్తమ్ మిశ్రా నిన్న మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు. కేబినెట్ ఆహారం కల్తీ చేసేవాళ్లకు జీవితఖైదు విధించేలా చట్టాల్లో మార్పు చేసిందని.. గతంలో మూడేళ్లుగా ఉన్న శిక్షను 14 సంవత్సరాలకు పెంచుతున్నామని వెల్లడించారు. మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయంపై ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.
అదే సమయంలో మంత్రివర్గం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఎక్స్ పైరీ డేట్ ముగిన వస్తువులను అమ్మేవాళ్లకు శిక్షలను మరింత కఠినతరం చేయాలని నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలకు ఆమోదం తెలపాలని రాష్ట్ర గవర్నర్ ఆనందీబెన్ పటేల్ సూచనలు చేశారు. ప్రజల ఆరోగ్యానికి హాని కలిగించే ఆహరం కల్తీని క్షమించకూడదని ఆమె తెలిపారు.
ప్రజల ఆరోగ్యంపై కల్తీ ఆహారం తీవ్ర ప్రభావం చూపుతుందని ఆనందీబెన్ పటేల్ వెల్లడించారు. ఇతర రాష్ట్రాలు సైతం కల్తీ ఆహారం విషయంలో మధ్యప్రదేశ్ తరహాలో నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.