
వర్షాకాలం వచ్చిందంటే చాలు దగ్గు సమస్య చాలామందిని వేధిస్తూ ఉంటుంది. అయితే కొందరికి మందులు వాడితే దగ్గు నుంచి ఉపశమనం లభిస్తుంది. కొందరికి ఎన్ని మందులు వాడినా తగ్గినట్లే తగ్గి దగ్గు సమస్య వేధిస్తూ ఉంటుంది. అయితే ఇంటి చిట్కాలు పాటించి సులభంగా దగ్గును తగ్గించుకోవచ్చు. తేనె దగ్గుకు దివ్యౌషధంలా పని చేస్తుంది. తేనెను నేరుగా కానీ గోరువెచ్చని పాలతో కలిపి తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి.
తేనె, పసుపును మిశ్రమంగా చేసుకుని తాగితే దగ్గు త్వరగా తగ్గుముఖం పడుతుంది. మన పెద్దలు గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగినా దగ్గు నుంచి త్వరగా ఉపశమనం కలుగుతుందని చెబుతున్నారు. కొందరికి దగ్గుతో పాటు నోట్లో నుంచి నంజు వస్తూ ఉంటుంది. ఈ సమస్యతో బాధ పడే వాళ్లు నీళ్లలో ఉప్పు వేసుకుని పుక్కలిస్తే దగ్గు తక్కువ సమయంలో తగ్గుముఖం పడుతుంది.
అల్లాన్ని చిన్నచిన్న ముక్కలుగా చేసి నీటిలో మరిగించి తాగినా దగ్గు త్వరగా తగ్గుతుంది. కఫంతో కూడా దగ్గుతో బాధ పడుతున్నట్లయితే మిరియాలు మంచి ఫలితాన్నిస్తాయి. పొడి చేసిన మిరియాలను పాలలో లేదా నీళ్లలో కలుపుకుని తాగితే మంచిది. అయితే పొడి దగ్గు ఉన్నప్పుడు మాత్రమే మిరియాలను వాడాలి. రోజుకు రెండు తులసి ఆకులు నమలడం, పుదీనా టీ తాగడం లాంటి చిట్కాలు పాటించి దగ్గును సులభంగా తగ్గించుకోవచ్చు.