తెలంగాణలో పీసీసీ మార్పు ఖాయమని తేలడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ ఐదేళ్లు పదవీ పూర్తి చేసుకున్నారు. ఆయన స్థానంలో కొత్తవారిని నియమించేందుకు కాంగ్రెస్ అధిష్టానం చూస్తుంది. అయితే కొద్దిరోజులుగా పీసీసీ మార్పు ఉంటుందనే ప్రచారం జరుగుతున్నప్పటికీ అధిష్టానం మాత్రం సైలంట్ గా ఉంటుంది. దీంతో పీసీసీ చీఫ్ గా ఉత్తమ్ కుమార్ నే తిరిగి కొనసాగిస్తారా? లేదా కొత్తవారిని నియమిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది.
Also Read: సరిగ్గా 2వేల కేసులే.. కేసీఆర్ సార్ దాచేస్తున్నారా?
పీసీసీ మార్పు తప్పదనే సంకేతాలు ఉండటంతో పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఆశావహులు తమ లాబీయింగ్ మొదలుపెడుతున్నారు. కాంగ్రెస్ అధిష్టానం వద్ద పలుకుబడి ఉన్ననేతలతో తమ పని చేయించుకునే పనిలో పడ్డారు. దీనిలో భాగంగానే ఇటీవల పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు కర్ణాటక పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ కలుస్తారనే ప్రచారం జరుగుతోంది. డీకే శివకుమార్ కు అధిష్టానం వద్ద మంచి పరపతి ఉండటాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే పనిలో కాంగ్రెస్ నేతలు పడ్డారు. శివకుమార్ ను ప్రసన్నం చేసుకొని తెలంగాణ పీసీసీ కావాలని నేతలు ఆయన వద్ద క్యూ కడుతున్నారు.
ఇటీవలే డీకే శివకుమార్ కర్ణాటక పీసీసీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆయన ప్రమాణ స్వీకరానికి తెలంగాణకు చెందిన ముగ్గురు కీలక నేతలు హాజరయ్యారట. భవిష్యత్ అవసరాల దృష్ట్యా వీరంతా ఆయనను కలిసినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ సంస్థాగత వ్యవహారాలు చూసే కేసీ వేణుగోపాల్ తో డీకే శివకుమార్‌కు చాలా సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. దీంతో టీపీసీసీ పోస్టుపై తెలంగాణ చెందిన ఓ కాంగ్రెస్ నేత శివకుమార్ చెవిలో వేశారనే టాక్ విన్పిస్తుంది. దీంతో మిగిలిన నేతలు కూడా ఆయనతో లాబీయింగ్ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.
Also Read: ఆ మంత్రికి చెక్ పెట్టేందుకు రెడీ అవుతున్న తుమ్మల, నామా?
తెలంగాణ కాంగ్రెస్ నేతల్లో ఎక్కడా చూసిన డీకే శివకుమార్ ను కలిసిన విషయంపై చర్చ జరుగుతుందట. టీపీసీసీ పోస్టును ఆశించే వారంతా కూడా ఆయనను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారట. దీంతో టీపీసీసీ చీఫ్ వయా కర్నాటక అనే కామెంట్స్ విన్పిస్తున్నాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానం శివకుమార్ చెప్పిన వారికి టీపీసీసీ ఇస్తుందా? లేక పార్టీని అన్నివిధలా బలోపేతం చేసేవారిని ఎంపిక చేస్తుందా? అనేది చర్చనీయాంశంగా మారింది. త్వరలోనే కొత్త టీసీసీపీ చీఫ్ ఎవరనేది తేలిపోనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.