Covishield Vaccine: కోవిషీల్డ్ వ్యాక్సిన్ వల్ల మరణాలు.. తల్లిదండ్రుల న్యాయపోరాటం

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తమ పిల్లలు మరణించారని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది.

Written By: Swathi, Updated On : May 13, 2024 2:17 pm

Covishield Vaccine

Follow us on

Covishield Vaccine: కరోనా మహమ్మరి వ్యాప్తి నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ప్రజలకు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ను పంపిణీ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్న వారిలో ప్రతికూల దుష్ప్రభావాలు కనిపిస్తున్నాయన్న వార్త ప్రస్తుతం సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే ఆస్ట్రాజెనికా, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ పై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే కోవిషీల్డ్ మరణ కారకంగా మారుతుందా? వ్యాక్సిన్ తీసుకున్న వారు చనిపోయారా? అనే దానిపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న తరువాత తమ పిల్లలు మరణించారని కొందరు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అంతేకాదు న్యాయ పోరాటానికి సైతం సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే వ్యాక్సిన్ రోల్ అవుట్ లో పలు పంచుకున్న ప్రభుత్వ సంస్థలకు చెందిన అధికారులతో పాటు సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియాపై కూడా దావా వేయాలని బాధిత తల్లిదండ్రులు భావిస్తున్నారని తెలుస్తోంది.

అయితే.. ఇటీవలే కోవిడ్ టీకా కొన్ని అరుదైన సందర్భాల్లో ప్రాణాంతక థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ తో రక్తం గడ్డకట్టే పరిస్థితికి కారణంగా మారుతుందని ఆస్ట్రాజెనికా సంస్థ యూకే కోర్టులో అంగీకరించింది. ఆ తరువాతే చిన్నారులను కోల్పోయిన పలువురు తల్లిదండ్రులు కేసు వేయాలని నిర్ణయం తీసుకున్నారట. దీనికి తెలంగాణలోని హైదరాబాద్ కు చెందిన రచన గంగూ, కోయంబత్తూరుకు చెందిన వేణుగోపాలన్ గోవిందన్ నాయకత్వం వహిస్తున్నారని సమాచారం. కాగా థ్రోంబోసైటోపెనియా సిండ్రోమ్ వలన మెదడులోని రక్తనాళాల్లో లేదా ఇతర చోట్ల రక్తం గడ్డకడుతుంది. అలాగే తక్కువ ప్లేట్ లెట్ కౌంట్ ను కలిగి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.

ప్రస్తుతానికి న్యాయపోరాటం చేసేందుకు ఎనిమిది కుటుంబాలు వస్తున్నాయని తెలుస్తోంది. కానీ భవిష్యత్తులో మరికొన్ని కుటుంబాలు చేరే అవకాశాలు కూడా లేకపోలేదు. కాగా ఇప్పటికే కోవిషీల్డ్ వ్యాక్సిన్ పై దేశ వ్యాప్తంగా పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. వ్యాక్సిన్ తయారీ సంస్థతో పాటు ప్రభుత్వ సంస్థలపై చర్యలు తీసుకోవాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.