Corona 4th Wave On India: మాయదారి కరోనా మనల్ని వదలడం లేదు. చైనాలోని వూహాన్ లో పుట్టిన ఈ వైరస్ ధాటికి రెండేళ్లు వృథాగా పోయాయి. కరోనా లాక్ డౌన్ పేరిట అందరూ అన్నీ వదిలేసి ఇంట్లోనే ఉండాల్సని పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉద్యోగ ఉపాధి కరువైంది. ఇప్పటికే దేశం రెండు బలమైన వేవ్ లను అనుభవించింది. సెకండ్ వేవ్ భారత్ లో మరణమృదంగం వినిపించింది.ఆక్సిజన్ కొరతతో ప్రాణాలు పోయాయి. శవాలతో స్మశానాలు నిండిపోయాయి. నదుల్లో కరోనా శవాలు తేలియాడాయి. ఎంతో మంది తమ ఆప్తులను కడసారి కూడా చూడకుండా వదిలేసుకున్నారు. ఎన్నో హృదయ విదారక ఘటనకు ఈ కరోనా మహమ్మారి కారణమైంది. కరోనా వ్యాక్సినేషన్ తో ఇప్పుడిప్పుడే దేశం మళ్లీ కోలుకుంది. ఇలాంటి సమయంలో చైనాలో మళ్లీ కరోనా విజృంభించడం.. మన సెకండ్ వేవ్ కంటే తీవ్రంగా అక్కడ కేసులు, మరణాలు చోటుచేసుకుంటుడడం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను భయపెడుతున్నాయి. పొరుగున ఉన్న భారత్ లోనూ మరో వేవ్ వస్తుందా? అన్న భయాలు వెంటాడుతున్నాయి.
ఈ క్రమంలోనే జనవరిలో కోవిడ్ -19 కేసుల పెరుగుదలను భారతదేశం చూడవచ్చని.. కాబట్టి రాబోయే 40 రోజులు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారిక వర్గాలు, నిపుణులు దేశ ప్రజలను హెచ్చరిస్తున్నారు. జనవరిలో భారతదేశంలో కోవిడ్19 కేసులు పెరిగే అవకాశం ఉన్నందున రాబోయే 40 రోజులు చాలా కీలకమైనవని పేర్కొన్నారు. మునుపటి వ్యాప్తి పరిణామాలను ఉటంకిస్తూ అధికారిక వర్గాలు బుధవారం దేశ ప్రజలకు ఈ కీలక సూచనలు చేశాయి. “ఇంతకుముందు, కోవిడ్-19 కొత్త వేవ్ తూర్పు ఆసియాను తాకి 30-35 రోజుల తర్వాత భారతదేశాన్ని తాకింది. ఈసారి కూడా అలానే జరగబోతోంది. ముందు చైనాలో మొదలై.. ఆ తర్వాత భారతదేశానికి కూడా పాకుతుంది. ఇది ఒక ట్రెండ్‌గా ఉంది,” అని ఒక అధికారి తెలిపారు.
అయితే ఇన్‌ఫెక్షన్ తీవ్రత తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. ఈసారి 4వ వేవ్ వచ్చినా, మరణాలు, ఆసుపత్రిలో చేరడం చాలా తక్కువగా ఉంటుందని వారు తెలిపారు.
చైనా , దక్షిణ కొరియాతో సహా కొన్ని దేశాల్లో కోవిడ్19 కేసులు పెరుగుతున్న నేపథ్యంలో, ప్రభుత్వం దేశ ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేసింది. ఏదైనా ఉపత్తు కోసం అందరూ సిద్ధం కావాలని రాష్ట్రాలు , కేంద్ర పాలిత ప్రాంతాలను కోరింది. కేసుల తాజా పెరుగుదలను ఎదుర్కోవడానికి దేశం సంసిద్ధతను అంచనా వేయడానికి ప్రధాని నరేంద్ర మోడీ , ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా సమావేశాలు నిర్వహించారు.
ప్రస్తుతం కేసుల పెరుగుదలకు ఒమిక్రాన్ సబ్-వేరియంట్ బీఎఫ్7 కారణం. ఇదే చైనాలో తాజా కేసుల పెరుగుదలకు దోహదపడుతోంది. మన దేశంలోనూ దీని ఉనికి బయటపడింది. ఈ బీఎఫ్7 సబ్‌వేరియంట్ యొక్క వ్యాప్తి అన్ని గత కరోనా వేరియంట్ ల కంటే కూడా చాలా ఎక్కువగా ఉందని.. సోకిన వ్యక్తి నుంచి గరిష్టంగా 16 మంది వ్యక్తులకు సోకుతోందని అధికారిక వర్గాలు తెలిపాయి.