Chandrababu Naidu Delhi visit: ఏపీ సీఎం చంద్రబాబు( AP CM Chandrababu ) ఢిల్లీ బాట పట్టనున్నారు. ఈరోజు ఆయన ఢిల్లీ వెళ్ళనున్నారు. రేపు కూడా ఢిల్లీలోనే ఉంటారు. దీంతో ఆయన పర్యటనపై సర్వత్ర ఉత్కంఠ ఉంది. ఎందుకంటే ఆయన ఢిల్లీలో అడుగుపెట్టిన ప్రతిసారి ఏపీకి ప్రత్యేక కేటాయింపులు జరుగుతూ ఉంటాయి. ఈసారి కూడా ఆయన పర్యటన అనంతరం కేంద్రం నుంచి ఎటువంటి ప్రకటనలు వస్తాయి అనేది చర్చగా ఉంది. ఈరోజు సాయంత్రం ప్రత్యేక విమానంలో వెళ్ళనున్నారు చంద్రబాబు. రేపు హోంమంత్రి అమిత్ షా, నిర్మల సీతారామన్ తో పాటు ఇతర కేంద్ర మంత్రులను కలవనున్నారు. అయితే అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేస్తున్న అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించేందుకేనని తెలుస్తోంది. ఇప్పటికే మంత్రులు సత్య కుమార్ యాదవ్ తో పాటు భూపతి రాజు శ్రీనివాస్ వర్మ ప్రత్యేకంగా కలిసి ఆహ్వానం అందించారు. ప్రభుత్వ అధినేతగా చంద్రబాబు వెళ్లి ఆహ్వానించనున్నారు.
రాజకీయంగాను ప్రాధాన్యత..
అయితే చంద్రబాబు పర్యటన రాజకీయంగా కూడా చర్చకు దారితీస్తోంది. ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ ( YSR Congress ) పార్టీ నేతలకు సంబంధించి చాలా కేసులు నడుస్తున్నాయి. ప్రధానంగా మద్యం కల్తీ, ఆపై వైసీపీ హయాంలో మద్యం కుంభకోణం పై దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. తిరుమల ఘటనలకు సంబంధించిన దర్యాప్తులు కూడా కొనసాగుతున్నాయి. ఇటువంటి క్రమంలో కూటమిపరంగా అనుసరించాల్సిన వ్యూహంపై అమిత్ షా తో చంద్రబాబు చర్చిస్తారని తెలుస్తోంది. మొన్ననే ప్రధాని నరేంద్ర మోడీ ఏపీలో వైసీపీ విషయంలో కఠినంగానే ఉండాలని బిజెపి ఎంపీలకు సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సీఎం చంద్రబాబు నేరుగా హోం మంత్రి అమిత్ షాను కలుస్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ప్రజల్లో సంతృప్తి శాతం పెంచేందుకు..
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతుంది. ప్రజల్లో సంతృప్తి శాతం పెరగాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందుకు అనుగుణంగా పాలన సాగించాలని యంత్రాంగానికి ఆదేశాలు ఇచ్చారు. కలెక్టర్ల సమావేశంలో దీని పైనే ప్రధానంగా చర్చించారు చంద్రబాబు. అయితే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి అన్ని విధాల సహకారం అందిస్తోంది. ఒకవైపు అమరావతి రాజధాని నిర్మాణం తో పాటు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ప్రాధాన్యమిస్తోంది కేంద్రం. మౌలిక వసతుల కల్పనకు సంబంధించి ఏపీకి పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుంది. గత రెండుసార్లు కంటే భిన్నంగా ఈసారి కేంద్రం ఏపీ విషయంలో ఉదారంగా ఉంటుంది. దానికి కారణం లేకపోలేదు. కేంద్రంలోని ఎన్డీఏలో తెలుగుదేశం పార్టీ కీలక భాగస్వామి. అందుకే రాష్ట్రానికి ఎనలేని ప్రాధాన్యం దక్కుతోంది. అందుకే తరచూ సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ఏపీ ప్రతిపాదనలను ఢిల్లీ పెద్దల ముందు ఉంచుతున్నారు. వాటిపై వారు సానుకూల నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పుడు కూడా కీలక ప్రతిపాదనలతోనే చంద్రబాబు ఢిల్లీలో అడుగుపెట్టనున్నట్లు సమాచారం.