YCP MLAs: పిల్లిని గదిలో పెట్టి తాళం వేసి బంధిస్తే పులిగా మారుతుందంటారు. బయటపడే మార్గం కోసం అన్వేషించే క్రమంలో ఎదురుగా ఎంతటి వారు ఉన్నా దాడి చేస్తుంది. ఇప్పుడు ఏపీలో వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. గత మూడున్నరేళ్లుగా చేతిలో పదవి ఉన్నా.. ప్రజలకు ఏంచేయలేకపోయామన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో, పదవీకాలం గడువు ముగుస్తుండడంతో చాలామంది లోలోపల పడిన బాధను బయటకు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వారు చేస్తున్న కామెంట్స్ సహేతుకమైనవే కానీ.. పార్టీపై, అధినేతపై తిరుగుబాటు చేస్తున్నట్టుగా ఉన్నాయి. మద్దిశెట్టి వేణుగోపాల్, ఆనం రామనారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, రాచమల్లు ప్రసాద్ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్ తదితరులు వరుసగా చేసిన కామెంట్స్ జగన్ ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ప్రస్తుతానికి వీరు బయటపడి తమ ఆవేదనను, అధినేత వైఖరిపై మాట్లాడారు. ఇంకా ఈ జాబితాలో చాలా మంది ఉన్నారని.. ఎన్నికల సమీపంలో బహిరంగంగానే వ్యాఖ్యలు చేసే అవకాశముందని తెలియడంతో హైకమాండ్ కలవరపాటుకు గురవుతోంది. వైసీపీలో అంతర్గతంగా ఏదో జరుగుతోందన్న చర్చ అయితే నడుస్తోంది.

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ వైఫల్యాలపై మాట్లాడేవారికి ఏ విధంగా ట్రీట్ చేస్తున్నారో అందరికీ తెలిసిందే. అందుకే విపక్ష నాయకులు భయపడుతున్నారు. ఒకసారి సొంత పార్టీ ఎంపీ రఘురామరాజునే తీసుకుందాం. ఆయన్ను వెంటాడి, వేటాడి టార్చర్ పెట్టారు. అయితే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రభుత్వం, అధినేత అంటే లెక్కచేయని ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ బయటపడుతున్నారు. తమ మనసులో ఉన్న అభిప్రాయాలను బయటకు వెల్లడిస్తున్నారు. రోజుకొకరు వంతులు వేసుకున్నట్టు జగన్ పాలనపై అసహనం వ్యక్తం చేయడం ప్రారంభించారు. పింఛన్ల కోతతో చుట్టుముడుతున్న విమర్శలతో సతమతమవుతున్న సీఎం జగన్ కు.. ఇప్పుడు ఎమ్మెల్యేలు కొత్త చికాకులు తెచ్చి పెడుతున్నారు.
నేను బటన్ నొక్కుతున్నాను. మీరు ప్రజల్లోకి వెళ్లి వారి మద్దతు పొందండి అని సీఎం జగన్ చెప్పిన మాటనే చెబుతున్నారు. నిధులు లేవు. విధులు లేవు. ఎలా అని ప్రశ్నించే ఎమ్మెల్యేలపై గద్దిస్తున్నారు. బటన్ నొక్కుతుంది సీఎం జగన్.. పథకాలు ఇస్తోంది వలంటీర్లు. అటువంటప్పుడు మీ పాత్ర ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సామాజిక సమస్యల పరిష్కారానికే మీరున్నది. పథకాలు ఇవ్వడానికి సీఎం జగన్ ఉన్నారు. స్థానికంగా ఇచ్చేందుకు వలంటీర్లు ఉన్నారు. మీరు చేస్తున్నదేమిటి? గత మూడున్నరేళ్లుగా చేసిందేమిటి? అని ప్రజలు అడిగేసరికి ఎమ్మెల్యేలకు తత్వం బోధపడింది. అందులో భాగంగా వచ్చిందే ఈ ఆవేదన. పోనీ ఆనం రామనారాయణరెడ్డి తనకు మంత్రి పదవి రాలేదన్న బాధతో ప్రభుత్వంపై, అధినేత తీరుపై విమర్శలు చేశారనుకుందాం. కానీ మిగతా ఎమ్మెల్యేలు కూడా అదే బాట పట్టడం దేనికి సంకేతం? ఉపాధ్యాయులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారని ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి చెప్పుకొచ్చారు. ఆ విషయంలో గ్రామస్థాయి నాయకుడి నుంచి సీఎం వరకూ తెలిసిన విషయమే కదా. దానికి అంత కలవరపాటు ఎందుకు?

ఇప్పటికే అధికార వైసీపీ ఎమ్మెల్యేలు నిడ నీడలో ఉంటున్నారు. ప్రభుత్వ నిఘా వర్గాలు, సర్వే సంస్థల ప్రతినిధులు నీడలా వెంటాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఐ ప్యాక్ బృందంలో సభ్యులను నియోజకవర్గానికి ఒకరి చొప్పున నియమించారు. వీరు చేస్తున్న అతి ఇంతా అంతకాదు. అందర్నీ కలుపుకెళ్లాలని సూచించడంతో ఆనం రామనారాయరెడ్డికి ఎక్కడ కాలిందట. అందుకే ఆయనపై తీవ్రస్థాయిలో విరుచుకుపడినట్టు తెలిసింది. 151 మంది ఎమ్మెల్యేలను కాదని.. జగన్ 100 మంది ఉన్న ఐ ప్యాక్ బృందానికి ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఎమ్మెల్యేల ఆగ్రహానికి కారణంగా తెలుస్తోంది. గత మూడున్నరేళ్లుగా నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి పెల్లుబికడానికి ఎన్నో కారణాలున్నాయి.