Chips And Biscuits: నేటితరం పిల్లల నిత్య ఆహారంలో చిప్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, కేకులు భాగమైపోయాయి. ఏడుపు ఆపడానికైనా, మారాం తగ్గించడానికైనా తల్లిదండ్రులు చాలా సులువుగా ప్యాకెట్ ఫుడ్స్‌ను పిల్లల చేతుల్లో పెడుతున్నారు. అయితే ఈ అలవాటు పై మరోసారి ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చిందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఇలాంటి అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ అతిగా తినే పిల్లల్లో ఆస్తమా బారిన పడే ముప్పు గణనీయంగా పెరుగుతున్నట్టు తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో వెల్లడైంది. ఆ అధ్యయనం వివరాల్లోకి వెళితే..
స్పెయిన్‌కు చెందిన పరిశోధకులు 4 నుంచి 5 ఏళ్ల వయసు గల చిన్న పిల్లలను సుదీర్ఘంగా పరిశీలించారు. అధ్యయనం ప్రారంభంలోనే ఆస్తమా, శ్వాసకోశ ఇబ్బందులు లేదా ఎలాంటి అలర్జీ సమస్యలు లేని ఆరోగ్యవంతమైన పిల్లలను మాత్రమే ఈ పరిశోధన కోసం ఎంపిక చేసుకున్నారు. వారి రోజువారీ ఆహార అలవాట్లను, వారు తీసుకునే ప్రాసెస్డ్ ఫుడ్ పరిమాణాన్ని శాస్త్రవేత్తలు నిశితంగా గమనించారు.
పిల్లల బరువు, శారీరక శ్రమ, కుటుంబ నేపథ్యం వంటి ఇతరత్రా అన్ని రకాల జీవనశైలి అంశాలను క్రోడీకరించి, సర్దుబాటు చేసిన తర్వాత పరిశోధకులు ఒక దిగ్భ్రాంతికరమైన విషయాన్ని కనుగొన్నారు. అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్‌ను చాలా తక్కువగా లేదా అస్సలు తీసుకోని పిల్లలతో పోలిస్తే… వీటిని ఎక్కువగా, నిరంతరం తినే పిల్లల్లో ఆస్తమా తలెత్తే అవకాశం ఏకంగా నాలుగు రెట్లు (400%) అధికంగా ఉంటున్నట్టు పరిశోధనలో తేలింది.
సాధారణంగా ఆస్తమా రావడానికి జన్యుపరమైన కారణాలు (జీన్స్), వంశపారంపర్యత ముఖ్య కారకాలుగా భావిస్తారు. కానీ, కేవలం జన్యువులే కాకుండా మనం తీసుకునే ఆహారం, పర్యావరణం, మారిన జీవన శైలి వంటి బాహ్య అంశాలు కూడా ఈ వ్యాధి తీవ్రతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. కృత్రిమ రంగులు, ప్రిజర్వేటివ్‌లు, అధిక మోతాదులో ఉండే ఉప్పు, చక్కెరలు పిల్లల శ్వాసవ్యవస్థపై నెమ్మదిగా ప్రభావం చూపిస్తాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్యాకెట్లలో దొరికే జంక్ ఫుడ్స్ పిల్లల రోగనిరోధక శక్తిని బలహీన పరచడమే కాకుండా, శరీరంలో అంతర్గత వాపులు (inflammation) పెరగడానికి కారణమవుతాయి. ఇది క్రమంగా ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని దెబ్బతీసి అస్తమా కు దారితీస్తుంది. అందువల్ల ఇప్పటికైనా తల్లిదండ్రులు అప్రమత్తమై పిల్లలకు ప్యాకెట్ ఫుడ్స్ అలవాటును తగ్గించి… తాజా పండ్లు, కూరగాయలు, ఇంట్లో వండిన పోషకాహారాన్ని అందించడం ఎంతైనా అవసరం ఉందని వైద్య పరిశోధకులు తెలుపుతున్నారు.