Chandipura virus : దేశంలోకి మరో మహమ్మారి… దేశ ప్రజలకు అలెర్ట్.. తొలి మరణంతో కలకలం

గుజరాత్‌లో విజృంభిస్తున్న ఈ వైరస్‌ పేరు చాందీపుర. ఈ వైరస్‌ సోకడంతో ఆ రాష్ట్రంలో తొలి మరణం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ వైరస్‌ లక్షణాలతో ఎనిమిది మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే నాలుగేళ్ల బాలిక శాంపిల్స్‌లో వైరస్‌ ఆనవాళ్లు ఉన్నట్లు పూణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ ధ్రువీకరించింది. ఇక ఇప్పటి వరకు గుజరాత్‌లో చాందీపుర వైరస్‌ అనుమానిత ఇన్‌ఫెక్షన్‌ కేసులు 14 నమోదయ్యాయి.

Written By: Raj Shekar, Updated On : July 17, 2024 10:57 pm
Follow us on

Chandipura virus : దేశాన్ని వైరస్‌లు వీడడం లేదు. కోవిడ్‌తో మొదలైన వైరస్‌ల విజృంభణ కొనసాగుతోంది. కోవిడ మూడు వేవ్‌లతో దేశంలో అనేక మంది ఇబ్బంది పడ్డారు. తర్వాత కేరళలో బర్డ్‌ఫ్లూ దడపుట్టించింది. బర్డ్‌ ఫ్లూలో కొత్త వేరియంట్‌తో మరణాలు కూడా సంభవించాయి. తర్వాత జంతువుల్లోనూ బర్డ్‌ఫ్లూ కనిపించింది. ఇలా వైరస్‌ భయాలు వెంటాడుతుండగానే తాజాగా మరో వైరస్‌ కలకలం రేపుతోంది. గుజరాత్‌లో ఇది విజృంభిస్తోంది. దీంతో తొలి మరణం కూడా సంభవించింది. ఇంతకీ ఈ వైరస్‌ ఏంటి.. ఎవరికి సోకుతుంది.. చికిత్స విధానం గురించి తెలుసుకుందాం…

చాందీపుర వైరస్‌..
గుజరాత్‌లో విజృంభిస్తున్న ఈ వైరస్‌ పేరు చాందీపుర. ఈ వైరస్‌ సోకడంతో ఆ రాష్ట్రంలో తొలి మరణం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటి వరకు ఈ వైరస్‌ లక్షణాలతో ఎనిమిది మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. అయితే నాలుగేళ్ల బాలిక శాంపిల్స్‌లో వైరస్‌ ఆనవాళ్లు ఉన్నట్లు పూణేలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ వైరాలజీ ధ్రువీకరించింది. ఇక ఇప్పటి వరకు గుజరాత్‌లో చాందీపుర వైరస్‌ అనుమానిత ఇన్‌ఫెక్షన్‌ కేసులు 14 నమోదయ్యాయి. వీరిలో 8 మంది మరణించారు. వీరందరి శాంపిల్స్‌ను ధ్రువీకరణ కోసం ఎన్‌ఐవీకి పంపినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య మంత్రి రిషికేశ్‌ పటేల్‌ వెల్లడించారు.

బాలిక శాంపిల్‌లో గుర్తింపు..
ఇక ఈ చాందీపుర వైరస్‌ను నాలుగేళ్ల బాలిక శాంపిల్‌ ఆధారంగా గుర్తించారు. అప్పటికే ఏడుగురు వైరస్‌ లక్షణాలతో మరణించారు. ఇక మరణించిన బాలిక స్వస్థలం ఆరావళిలోని మోటా కంఠారియా. ఆమె శరీరంలో చాందీపుర వైరస్‌ ఆనవాళ్లు ఉన్నట్లు తేలింది. ఈ వైరస్‌ మూలంగా రాష్ట్రంలో నమోదైన తొలి మరణం ఇదే అని సంబర్‌కాంత జిల్లా ఆరోగ్య అధికారి రాజ్‌ సుతారియా తెలిపారు. తమ జిల్లా నుంచి పంపిన మూడు శాంపిల్స్‌ నెగెటివ్‌గా తేలిందన్నారు. వీరిలో ఒకరు మృతిచెందగా ఇద్దరు కోలుకున్నట్లు తెలిపారు.

ఏడు జిల్లాల్లో అనుమానితులు..
ఇక రాష్ట్రంలోని ఏడు గ్రామాల్లో చాందీపుర వైరస్‌ అనుమానిత కేసులను గుర్తించారు. సబర్‌కాంత, ఆరావళి, మహిసాగర్, ఖేడా, మెహసనా, రాజ్‌కోట్ జిల్లాల్లో అనుమానిత కేసులు నమోదైనట్లు మంత్రి రిషికేశ్‌ పటేల్‌ తెలిపారు. ఇద్దరు రాజస్థాన్‌ నుంచి, ఒకరు మధ్యప్రదేశ్‌కు చెందిన వారికి కూడా ఈ వైరస్‌ సోకింది. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా 26 రెసిడెన్షియల్‌ జోన్‌లలో 44 వేల మందికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేసినట్లు మంత్రి తెలిపారు.

ఏంటీ చాందీపుర వైరస్‌..
ఈ వైరస్‌ సోకిన వ్యక్తిలో జ్వరం, ఫ్లూ, మెదడువాపు వంటి లక్షణాలు కనిపిస్తాయి. దోమలు, ఇతర కీటకాల ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. ఇది రాబ్డో విరిడే కుటుంబానికి చెందిన వెసిక్యులో వైరస్‌ జాతికి చెందినదిగా గుర్తించారు.