BCG Vaccine: పెద్దలకు బీసీజీ టీకా.. ఎప్పటి నుంచంటే..

బీసీజీ వ్యాక్సిన్‌ పంపిణీని జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు నెలల్లో 60 లక్షల మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

Written By: Raj Shekar, Updated On : May 22, 2024 10:50 am

BCG Vaccine

Follow us on

BCG Vaccine: క్షయ(టీబీ) రాష్ట్రంలో చాపకింద నీరులా విస్తరిస్తోంది. క్షయ రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చి దిద్దేందుకు ప్రభుత్వం ఇటీవల జిల్లాల వారీగా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో కొన్ని జిల్లాల్లో వ్యాధి బాధితులు పెరుగుతున్నట్లు గుర్తించింది. ఈ నేపథ్యంలో వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా 18 ఏళ్లు పైబడిన వారికి బీసీజీ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. మొదటి దశలో వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న 17 జిల్లాల్లో గుర్తించిన 60 లక్షల మందికి ఒక డోసు టీకా ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

జూలై లేదా ఆగస్టులో..
బీసీజీ వ్యాక్సిన్‌ పంపిణీని జూలై చివరి వారం లేదా ఆగస్టు మొదటి వారంలో ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. మూడు నెలల్లో 60 లక్షల మందికి వ్యాక్సిన్లు పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2025 నాటికి క్షయ నిర్మూలనే లక్ష్యంగా 18 ఏళ్లు పైబడిన వారికి ఈ టీకా ఇవ్వాలని నిర్ణయించింది. జాతీయ క్షయ వ్యాధి నిర్మూలనలో భాగంగా కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ దీనిని నిర్దేశించింది. జాతీయ ఆరోగ్య మిషన్‌ ద్వారా ఇది అమలవుతుంది. ఇప్పటికే దేశంలోని 8 రాష్ట్రాల్లో తొలి విడత వ్యాక్సినేషన్‌ మొదలైంది. తాజాగా తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లో అమలు కానుంది. రాష్ట్ర క్షయ నిర్మూలన విభాగం నోడల్‌ సంస్థగా దీనిని నిర్వహిస్తుంది. టీబీ వచ్చే అవకాశం ఉందని గుర్తించిన వారికి మాత్రమే టీకా ఇవ్వనున్నారు. ఎవరెవరికి ఇవ్వాలని గుర్తించేందుకు ఆరు కేటరిగీలను నిర్దేశించుకున్నారు.

17 జిల్లాలు ఇవే..
పెద్దలకు బీసీజీ టీకాలు వేయనున్న 17 జిల్లాలు.. హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్, జగిత్యాల, జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కరీంనగర్, కామారెడ్డి, మెదక్, మహబూబాబాద్, మేడ్చల్‌ మల్కాజిగిరి, నిజామాబాద్, నాగర్‌కర్నూల్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, హనుమకొండ, యాదాద్రి భువనగిరి.

టీకా ఎవరికంటే..
– 60 ఏళ్లు పైబడిన వారందరికీ
– బీఎంఐ 18 కన్నా తక్కువ ఉన్నవారు
మద్యం తాగేవారు
ఇప్పుడు పొగతాగుతున్నవారు, గతంలో పొగ తాగినవారు
– క్షయ వ్యాదిగ్రస్తులతో సన్నిహితంగా ఉన్నవారు
– దేళ్లుగా క్షయ వ్యాధిగ్రస్తులు ఉన్న ఇంట్లోని ఇతర కుటుంబ సభ్యులకు..

ఇంటింటి సర్వే ద్వారా గుర్తింపు..
ఈ ఆరు కేటగిరీల వారిని గుర్తించేందుకు వైద్య సిబ్బంది ఇంటింటి సర్వే ద్వారా గుర్తిస్తారు. ఇందుకోసం ఇప్పటికే వైద్య సబ్బందికి వివిధ స్థాయిల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. హెచ్‌ఐవీ బాధితులు, అవయవ మార్పిడి చేసుకున్నవారు, గర్భిణులు, బాలింతలు, ఇతర వ్యాక్సిన్‌ల రియాక్షన్‌లు ఉన్నవారు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు, టీకా తీసుకోవడానికి ఇష్టపడని వారికి వ్యాక్సిన్‌ వేయరు.