Health Tips: మీకు ఒక గమ్మత్తు విషయం తెలుసా? అసలు మీరు తినడం కోసం బతుకుతున్నారా? బతకడం కోసం తింటున్నారా? ఇందులో చాలా తేడా ఉంటుంది. ఓ సారి ఆలోచించండి. అదే పనిగా తినడం వేరు. బతకడం కోసం తినడం వేరు కదా. అది సరే గానీ ఆకలి వేసినప్పుడు తినేవారు వేరు కానీ ఏది తోచకుండా, విసుగు (బోర్) పుట్టినప్పుడూ తినడం వేరు కదా. ఇలాంటి వారు కూడా చాలా మంది ఉంటారు. చిప్సో, జంతికలో.. ఏదో ఒకటి నోట్లో వేసి తింటారు. విసుగు పుట్టినప్పుడు మెదడు కొంత హుషారును కోరుకుంటుంది కాబట్టి తినాలి అనిపిస్తుంది చాలా మందికి సో తింటారు.
ఇలాంటప్పుడు ఏదో ఒకటి తినాలి అని చిరుతిండి వైపు దృష్టి మళ్లుతుంది. ఎప్పుడో అప్పుడంటే ఏమో గానీ తరచూ ఇలా తింటుంటే మీ పని అంతే ఇక. కేలరీలు తప్ప ఎలాంటి పోషకాలు లేని జంక్‌ఫుడ్‌తో తినడం వల్ల బరువు పెరగటం, మధుమేహం, గుండెజబ్బులు వంటి సమస్యలు వస్తాయి. అందుకే శరీరం పట్ల కాస్త జాగ్రత్త అవసరం. ఏమీ తోచనప్పుడు చిరుతిళ్ల వైపు చూడటం కన్నా ఇతర మార్గాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. మరి ఆ ప్రత్యామ్నాయాలు ఏంటో కూడా ఓ సారి చూసేయండి.
నీరు తాగటం: ఆకలి వేస్తున్నట్టు అనిపిస్తుంది కానీ దాని కారణం దాహం అవచ్చు. కాబట్టి వెంటనే చిరుతిండి తినకుండా మీ చేతిలో ఉన్నా సరే వాటిని పక్కన పెట్టి ఓ గ్లాసు నీరు తాగి చూడండి. ఇలా చేయడం వల్ల చాలా సార్లు ఆకలి ఫీల్ ఎక్కువ ఉండదు.
మనసును మళ్లించటం: విసుగు పుడితే.. మనసును దారి మళ్లించే ప్రయత్నం చేయాలి. ఇలా చేయడం వల్ల మంచి ఫలితం కనిపిస్తుంది. అటూ ఇటూ నాలుగడుగులు వేయటం, ఇష్టమైనది ఏదైనా చదవటం, స్నేహితులతో మాట్లాడటం వల్ల మీకు చాలా ప్రయోజనాలు చేకూరుతాయి. ఇలా చేయడం వల్ల పదేపదే తినడం అనే కాన్సెప్ట్ పోతుంది కదా.
ఏదైనా నమలటం: బబుల్‌గమ్, సోంపు వంటివి నోట్లో వేసుకుని నములడం వల్ల కూడా మీకు చిరుతిండి నుంచి అలవాటు తప్పుపోతుంది. అంతేకాదు, తక్కువ కేలరీలతో కడుపు నిండిన ఫీల్ వస్తుంది కాబట్టి ట్రై చేయండి.
గ్లూకోజు స్థిరంగా: రక్తంలో గ్లూకోజు మోతాదులు తగ్గినప్పుడు చిరుతిండి తినకుండా ఆగటం కష్టమే అంటున్నారు నిపుణులు. అందువల్ల పీచు, ప్రొటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులతో కూడిన సమతులాహారం తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆరోగ్యం మీ సొంతం. దీంతో రక్తంలో గ్లూకోజు మోతాదులు మరీ ఎక్కువ, తక్కువ కాకుండా బాలెన్స్ గా ఉంటూ మీ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హఠాత్తుగా చిరుతిండి తినాలనే కోరికా కూడా పోతుంది కాబట్టి టేక్ కేర్.
మనసుతో ఆలోచించి: చిరుతిండిని నోట్లో వేసుకోవటానికి ముందు కాసేపు ఆగి నిజంగా ఆకలవుతోందా? ఏమీ తోచక తినాలనిపిస్తోందా? అని ఒక్కసారి ఆలోచించండి. ఎందుకు తింటున్నామనే దాన్ని గుర్తించగలిగితే మీ సమస్యను మీరు పరిష్కరించుకోవచ్చు.
చిరు వ్యాయామం: చిన్న వ్యాయామమైనా పెద్ద మార్పు తెస్తుంది. కాసేపు నడిస్తే, లేదా ఏదైనా వ్యాయామం చేస్తే మంచి హుషారు వస్తుంది. మనసుకు సహజంగా ఉల్లాసం వస్తుంది కూడా.