హైదరాబాద్ కబ్జాల కథలు: కండ కలిగిన వాడిదే భూములోయ్‌..

ఒక్క ఎకరం.. ఒక్క గుంట భూమి దగ్గరే ఇద్దరు అన్నదమ్ముల మధ్య.. లేదా పక్కపక్క వాళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. మరి అలాంటిది ఒకటి కాదు రెండు.. వంద కాదు.. రెండొందలు అంతకన్నా కాదు.. ఏకంగా రెండు వేల ఎకరాలు సివిల్‌ వివాదాల్లో నలుగుతున్నాయి. వాటిపై కబ్జారాయుళ్ల కన్నుపడడం కామన్‌ కదా..! కోట్ల విలువ చేసే జాగా ఎక్కడ కనిపించినా కబ్జాదారులు వదిలిపెడతారా..! అందుకే.. ఈ హత్యలు.. ఈ అపహరణలు. Also Read: భార్గవ్ రామ్ కోసం […]

Written By: Srinivas, Updated On : January 8, 2021 1:07 pm
Follow us on


ఒక్క ఎకరం.. ఒక్క గుంట భూమి దగ్గరే ఇద్దరు అన్నదమ్ముల మధ్య.. లేదా పక్కపక్క వాళ్ల మధ్య గొడవలు వస్తుంటాయి. మరి అలాంటిది ఒకటి కాదు రెండు.. వంద కాదు.. రెండొందలు అంతకన్నా కాదు.. ఏకంగా రెండు వేల ఎకరాలు సివిల్‌ వివాదాల్లో నలుగుతున్నాయి. వాటిపై కబ్జారాయుళ్ల కన్నుపడడం కామన్‌ కదా..! కోట్ల విలువ చేసే జాగా ఎక్కడ కనిపించినా కబ్జాదారులు వదిలిపెడతారా..! అందుకే.. ఈ హత్యలు.. ఈ అపహరణలు.

Also Read: భార్గవ్ రామ్ కోసం వేట.. అఖిలప్రియ బెయిల్ పై ఉత్కంఠ

భూముల ధరలకు రెక్కలొచ్చే సరికి ఆయా కాలనీల్లో రాజకీయ, ఇతర అండదండలున్న వాళ్లు ఆ భూములను దక్కించుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని చేసేస్తున్నారు. తాజాగా జరిగిన మాజీ మంత్రి అఖిలప్రియ ఉదంతం కూడా అలాంటిదే. ఒకవైపు న్యాయస్థానాల్లో కేసులు నడుస్తున్నా.. క్షేత్రస్థాయిలో పెద్ద ఎత్తున విక్రయాలు కొనసాగుతూనే ఉన్నాయి.

ముఖ్యంగా రంగారెడ్డి, మేడ్చల్‌ జిల్లాల్లోని భూములపై ఈ అక్రమార్కుల కన్ను ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు ఈ వివాదస్పద భూమి కూడా అక్కడి పరిధిలోనేదే. ఈ రెండు వేల ఎకరాలపై న్యాయస్థానాల్లో (సీఎస్‌ 14/58) పేరిట వివాదాలు నడుస్తున్నాయి. ఆయా జిల్లాల్లోని హఫీజ్‌పేట సర్వే నం. 77–80, హైదర్‌‌నగర్‌‌ సర్వే నంబర్‌‌ 145,163,172, హస్మత్‌పేట 1,7,15,57, ఘన్‌సిమియాగూడ 3,4 సర్వే నంబర్లలో సీఎస్‌ 14 వివాదాలు కొనసాగుతున్నాయి. అంతేకాదు.. వీటి విలువ వింటే కళ్లు తిరగాల్సిందే. బహిరంగ మార్కెట్‌లో వీటి విలువ లక్ష కోట్ల పైమాటే. అందుకే.. అందరి దృష్టి ఈ భూములపై పడింది.

రెవెన్యూ దస్త్రాల ప్రకారం ఇవి పైగా/జాగీర్‌‌ భూములుగా ఉన్నాయి. కానీ.. ఏళ్ల తరబడి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోనే ఉన్నాయి. అవి చేతులు మారుతుండగా.. ఆక్రమణదారులు పెద్ద ఎత్తున లాభాలు ఆర్జిస్తూ వస్తున్నారు. అయితే.. కోర్టుల్లో కేసులు ఉన్నాయన్న సాకుతో అధికారులు అటువైపు చూడడం కూడా మానేశారు. దీంతో ఇదే అదనుగా కొందరు రెవెన్యూ ఆఫీసర్లు, ప్రభుత్వ పెద్దల సహకారంతో మ్యుటేషన్లు చేసుకుంటూ క్రయవిక్రయాలు చేపడుతున్నారు.

Also Read: జగన్ లేఖ.. సుప్రీ జడ్జి వివరణ.. స్పందించిన సుప్రీంకోర్టు

ఈ వివాదం ఆరు దశాబ్దాలుగా నడుస్తోంది. 1958లో ఆస్తుల పంపకాల విషయంలో నిజాం వారసుల మధ్య వివాదం మొదలైంది. హఫీజ్‌పేట భూములపై సీఎస్‌ 14/58 పేరిట సిటీ సివిల్‌ కోర్టులో వ్యాజ్యం మొదలైంది. ఆయా భూములు జాగీర్‌‌/పైగా అని ఉండడం, ప్రభుత్వం కూడా భాగస్వామిగా చేరడంతో సిటీ సివిల్‌ కోర్టు ఈ వ్యాజ్యాన్ని హైకోర్టకు ట్రాన్స్‌ఫర్‌‌ చేసింది. 1963లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వెలువడింది. ఆ భూములు ప్రైవేటు వ్యక్తులకే చెందుతాయని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే.. దీనిని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు బెంచ్‌లో అప్పీలు దాఖలు చేసింది. 13 ఏళ్ల విచారణ అనంతరం కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగానే తీర్పు వచ్చింది. దీంతో 1977–80 మధ్య కాలంలో ప్రభుత్వం ఆ భూములను ఆయా ప్రైవేటు కుటుంబాలకు అప్పగించింది. తర్వాత 1983లో రాష్ట్ర సర్కార్‌‌ మరోసారి సుప్రీం కోర్టు తలపు తట్టింది. సుదీర్ఘంగా విచారించిన అత్యున్నత న్యాయస్తానం 2002లో కేసు కొట్టేసింది. తీర్పునకు అనుగుణంగా ఆయా భూములను ఆర్‌‌వోఆర్‌‌, యూఎల్‌సీ చట్టాలకు లోబడి సంబంధిత వ్యక్తులకు అప్పగించాలని 2004 నవంబర్‌‌ 5న రంగారెడ్డి కలెక్టర్‌‌కు అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. దాని ప్రకారమే పెద్ద ఎత్తున మ్యుటేషన్లు జరిగాయి కూడా.

ఇక ఇప్పటి నుంచి అధికారులపై భూమాఫియా ఒత్తిళ్లు తేవడం ప్రారంభించింది. ఆ పీరియడ్‌లో రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌‌గా పనిచేసిన అధికారి ఒకరు ఈ భూముల్లో అక్రమ మ్యుటేషన్లు జరుగుతున్నట్లు గుర్తించారు. ఆ భూములను కాపాడే ప్రయత్నం చేశారు. కానీ.. భూ మాఫియా ప్రభుత్వంపై ఒత్తడి తేవడంతో ఆయన్ను అక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్‌‌ చేశారు. ఆ తర్వాత 2009లో రాష్ట్ర ప్రభుత్వం మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. ఏడాది విచారణ తర్వాత 2010 సెప్టెంబరులో ఆ భూములు ప్రభుత్వానికే చెందుతాయని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. రెండు నెలల అనంతరం ఆ ఆదేశాలను హైకోర్టు డివిజన్‌ బెంచ్‌ పక్కన పెట్టింది. అప్పట్నుంచి కొందరు పలుకుబడి కలిగిన పర్సన్స్‌ మ్యుటేషన్లు చేయించుకున్నారు. ఇప్పుడు అదే గొడవ చివరికి జైలు వరకూ వెళ్లేలా దారితీసింది.

Also Read: జీహెచ్ఎంసీ మేయర్ ఎన్నిక ప్రకటన.. టీఆర్ఎస్ లో గుబులు

మరోవైపు.. అధికారుల నిర్లక్ష్యం కారణంగా హైదరాబాద్‌ చుట్టూరా ఉన్న వేలాది ఎకరాలకు కబ్జాకు గురవుతూనే ఉన్నాయి. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లా పరిధిలో రెవెన్యూ యంత్రాంగం నిర్లక్ష్యం కారణంగా మాఫియా ఆగడాలకు అడ్డు లేకుండాపోయింది. అటు రాజకీయ ప్రాబల్యం.. ఇటు అధికారుల అండదండలు.. వీటికితోడు కండ బలం ఇంకే ముంది వందలాది ఎకరాలపై అలా వాలిపోతున్నారు. వెంటవెంటనే భూముల చుట్టూ కంచెలు వేసేస్తున్నారు. తొమ్మిదేళ్ల కిందట అప్పటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌‌ శేషాద్రి ఆదేశాల మేరకు జిల్లా పరిధిలోని భూములపై సర్వే చేశారు. వివిధ కేటగిరీల్లోని ప్రభుత్వానికి చెందిన 10,290 ఎకరాలు ఆక్రమణదారుల చేతుల్లో ఉన్నట్లు తేలింది. ఆ సమయంలో ఆ భూముల్లో బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించినా.. ఆయన ట్రాన్స్‌ఫర్‌‌ తర్వాత పట్టించుకునే వారు కరువయ్యారు.

మొత్తంగా హైదరాబాద్‌ చుట్టుపక్కల మరియు హైదరాబాద్‌ను అంటిపెట్టుకొని ఉన్న రంగారెడ్డి జిల్లాల్లో ఈ కబ్జాలపై ప్రభుత్వం కూడా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. కానీ.. ఈ కబ్జారాయుళ్లకు ప్రభుత్వం అండదండలు ఉన్నట్లుగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎవరి అండదండలు లేకుండా వేలాది ఎకరాలు కబ్జాలు చేసి.. ఈజీగా మ్యుటేషన్లు చేసుకునే వెసులుబాటు కూడా ఉండదు కదా. అసలు.. ఈ కబ్జా చేస్తున్నదీ రాజకీయ నేతలేనన్న ఆరోపణలు సైతం వినిపిస్తున్నాయి. మరి నిజాం సంస్థానం నుంచి వారసత్వంగా వచ్చిన ప్రభుత్వ భూములను ఇలా కబ్జారాయుళ్లకు ధారాదత్తం చేయడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. ఇప్పటికైనా అడ్డుకట్ట వేయకపోవతే భవిష్యత్తులో ప్రభుత్వ భూమి అంటూ ఉండదని ఆందోళన వ్యక్తమవుతోంది. అంతేకాదు.. కబ్జారాయుళ్లే వారి మధ్య వాళ్లకే గొడవలు పెరిగి.. చివరికి హత్యలు ఇలాంటి కిడ్నాప్‌లు కూడా పెరిగిపోయే ప్రమాదమే ఉంది.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్