https://oktelugu.com/

దెబ్బపడితే కానీ కేసీఆర్ సార్ కు నిరుద్యోగులు గుర్తుకురాలేదన్న మాట!

పుర్రకో బుద్ది అంటారు.. ఎవరికైనా అనుభవమే పాఠాలు నేర్పుతుంది. ఇప్పుడు తెలంగాణ అనే రాజ్యంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న సీఎం కేసీఆర్ సార్ కు ముందరికాళ్లకు బంధం పడింది. రెండో దఫా అంత ఈజీగా ముందుకు సాగలేమనే విషయం బోధపడింది. దుబ్బాకలో ఓటమి.. జీహెచ్ఎంసీలో హంగ్ వస్తే కానీ కేసీఆర్ సార్ ప్రగతి భవన్ విడిచి జనంలోకి రాలేకపోయారు. ఇప్పుడు పాప పరిహారం చేస్తూ ఎక్కడ తప్పు చేశామనే దానిపై దృష్టిసారించారు. తప్పులు దిద్దుకునే పనిలో పడ్డారన్న చర్చ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 14, 2020 / 09:38 AM IST
    Follow us on

    పుర్రకో బుద్ది అంటారు.. ఎవరికైనా అనుభవమే పాఠాలు నేర్పుతుంది. ఇప్పుడు తెలంగాణ అనే రాజ్యంలో అప్రతిహతంగా దూసుకుపోతున్న సీఎం కేసీఆర్ సార్ కు ముందరికాళ్లకు బంధం పడింది. రెండో దఫా అంత ఈజీగా ముందుకు సాగలేమనే విషయం బోధపడింది. దుబ్బాకలో ఓటమి.. జీహెచ్ఎంసీలో హంగ్ వస్తే కానీ కేసీఆర్ సార్ ప్రగతి భవన్ విడిచి జనంలోకి రాలేకపోయారు. ఇప్పుడు పాప పరిహారం చేస్తూ ఎక్కడ తప్పు చేశామనే దానిపై దృష్టిసారించారు. తప్పులు దిద్దుకునే పనిలో పడ్డారన్న చర్చ రాజకీయ వర్గాల్లో సాగుతోంది.

    తెలంగాణలో ఇప్పుడు సీఎం కేసీఆరే సుప్రీం. ఆయనను ఎదురించి సమ్మెకెళ్లిన ఆర్టీసీ ఉద్యోగుల పరిస్థితిని కళ్లారా చూశాం. పైగా ఉద్యోగులను సంఘాలుగా విభజించి కేసీఆర్ చాలా మందిని తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.. దీంతో ఎవరూ పోరాటానికి రాని పరిస్థితి నెలకొంది. ఎన్నికల వేళ అదును చూసి కేసీఆర్ ను దెబ్బకొట్టారు. దెబ్బకు కేసీఆర్ దిగొచ్చేలా చేశారు.

    కేసీఆర్ నిద్రలేచినప్పటి నుంచి పడుకునే వరకు ‘రైతులు రైతులు’ అని కలవరిస్తూనే ఉంటాడేమోనన్న సందేహం ఇప్పుడు అందరిలోనూ వ్యక్తమవుతోందట.. జనాభాలో 60శాతం మందికంటే ఎక్కువగా ఉన్న రైతులను పట్టించుకోవడం.. వారి కోసం సర్వం చేయడం కరెక్టే.. పెద్ద ఓటు బ్యాంకు వారే కావడంతో కేసీఆర్ మొత్తం వారికే వెచ్చిస్తున్నారు. దాన్ని ఎవరూ తప్పు పట్టడం లేదు. మరి ఇతర రంగాలను గాలికి వదిలేయడం ఎంతవరకు కరెక్ట్ అని పలువురు ప్రశ్నిస్తున్నారు.

    తెలంగాణ ఉద్యమం మొదలైంది ‘నీళ్లు, నిధులు, నియామకాల’ విషయంలో జరిగిన నష్టంపైనే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అన్ని ఉద్యోగాలు, గోదావరి-కృష్ణ జలాలను ఆంధ్రా నేతలు తన్నుకుపోతుంటే చేష్టలుడిగి చూసిన తెలంగాణ ప్రజాప్రతినిధులపై నాడు తిరగబడ్డారు కేసీఆర్. పోతిరెడ్డిపాడుపై వైఎస్ తో ఫైట్ కూడా చేశారు. నాటి తెలంగాణ మంత్రులను ఎండగట్టారు. ఇక నిధులన్నీ ఆంధ్రాకు పోతూ ‘ఒక్క రూపాయి ఇవ్వను ఏం చేసుకుంటావో చేసుకో’ అని ఉమ్మడి అసెంబ్లీలో నాటి సీఎం కిరణ్ కుమార్ రెడ్డి వికటట్టహాసం చేస్తూ ప్రస్తుతం వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ ముఖం మీదే చెప్పేసిన పరిస్థితిని చూశాం. అయినా కూడా నాడు కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు నోరు మెదపలేదు.

    సరే ఎలాగోలా తెలంగాణ వచ్చింది. కేసీఆర్ నినదించిన ‘నీళ్లు-నిధులు’ ఇప్పుడు తెలంగాణకు పుష్కలంగా వచ్చాయి. తెలంగాణలో అత్యధికంగా లాభపడ్డది ఎవరయ్యా అంటే అది రైతులే. వారికి ఉచిత విద్యుత్, రైతు బంధు కింద ఏటా 10 వేల రూపాయల పెట్టుబడి.. కాళేశ్వరం జలాలు తెచ్చి రైతులకు ఇచ్చి వారి ఇంట బంగారం పడింపచేశారు కేసీఆర్. ఈసారి వచ్చిన దిగుబడి చూసి దేశమే గర్వించింది.

    అంతా ఒకే.. నీళ్ల సమస్య కాళేశ్వరం, ఇతర కృష్ణ నదిపై చేపట్టిన ఎత్తిపోతలతో తీరిపోతోంది. మరి నిధులు.. ధనిక రాష్ట్రం తెలంగాణలో కేసీఆర్ కోరినా.. కోరకున్నా అభివృద్ధి పనులకు ఇచ్చేస్తున్నారు. మరి ఇంకేంటి లోటు అనా? ఉంది.. అతిపెద్ద లోటు.. నియామకాలు..

    నియామకాల కోసం తెలంగాణ నిరుద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. ఎంతసేపు కాళ్వేశ్వరం రైతులు, నిధుల యావలో పడి కేసీఆర్ కీలకమైన నిరుద్యోగులను గాలికొదిలేశారన్న ఆవేదన వారిలో నెలకొంది. తెలంగాణలో ఉద్యోగ నియామకాలు లేక మూడు నాలుగేళ్లవుతోంది. జోన్ల సిస్టం అంటూ కేంద్రానికి పంపి రెండు మూడేళ్లు గడుస్తోంది. దానిపై కోర్టు కేసులు.. ఇలా ఉద్యోగ ఖాళీల భర్తికి ఎన్నో సమస్యలున్నాయి. అభ్యంతరాలపై చాలామంది కోర్టుకెక్కారు. వాటన్నింటిని కేసీఆర్ పట్టించుకున్న పాపాన పోవడం లేదన్న విమర్శలున్నాయి..

    అన్నింటిని సెట్ రైట్ చేస్తున్న కేసీఆర్.. తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన తెలంగాణ నిరుద్యోగులు, యువతకు ఏం గిఫ్ట్ ఇవ్వకపోవడమే ఇప్పుడు వారిని నిరాశకు గురిచేస్తోంది. అందరికీ గిఫ్ట్ లు ఇస్తున్న కేసీఆర్.. ఉద్యోగాలు లేక అలమటిస్తున్న లక్షలమంది నిరుద్యోగులను.. వారి గోసను ఎందుకు పట్టించుకోవడం లేదన్న ఆవేదన ఉంది. అన్నీ అయిపోయాయి. ఇప్పుడు దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓటమికి, బీజేపీ గెలుపునకు మధ్యనున్నది యువత, నిరుద్యోగులే.. అందుకే వారిని శాంతపరిచే పనిలో పడ్డారు కేసీఆర్.

    సీఎం కేసీఆర్ తాజాగా నష్టనివారణ చర్యలు చేపట్టారు. తాను ఎక్కడ ఫెయిల్ అయ్యానో తెలిసి వాటిని దిద్దుకునే పనిలో పడ్డారు. నిరుద్యోగులకు తీపికబురును అందించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు త్వరలోనే నోటిఫికేషన్లు విడుదల చేయనున్నారు. దాదాపు 50వేల ఖాళీలు ఉన్నాయని తెలిసి వాటిని భర్తీ చేసేందుకు రెడీ అయ్యారు. దాదాపు ఆరేళ్లుగా ఉద్యోగాలు లేక.. టీఆర్ఎస్ పై కోపంగా ఉన్న నిరుద్యోగులను ఉద్యోగాలతో కూల్ చేసి తమవైపుకు తిప్పుకోవడానికి.. బీజేపీని ఇప్పుడే చెక్ పెట్టడానికి కేసీఆర్ రెడీ అయ్యారని తెలుస్తోంది. ఇక పోలీస్ శాఖలోనూ ఉద్యోగాల భర్తీకి కేసీఆర్ తెరతీశారు. తద్వారా తెలంగాణలో ఇప్పుడు ఉద్యోగాల జాతరను చేపట్టి వ్యతిరేకంగా ఉన్న నిరుద్యోగులను తనవైపు తిప్పుకునేందుకు కేసీఆర్ సార్ రెడీ అయ్యారు.

    -నరేశ్