ఉద్యోగులను రోడ్డున పడేసిన అధికార పత్రిక

పేరుకు అధికార పత్రిక.. ఇంతటి కరోనా-లాక్ డౌన్ లోనూ తట్టుకొని నిలబడిందని ఇన్నాళ్లు శభాష్ అనుకున్నాం.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలే తట్టుకోలేక ఉద్యోగులను వదిలించుకుంటే నమస్తే చరిష్మా చూసి అబ్బురపడ్డాం. కానీ తమ కత్తికి కూడా పదును ఉందని.. తమ ఉద్యోగుల విషయంలోనూ అదే కాఠిన్యం అని తెలంగాణలో అధికార పత్రిక నిరూపించుకుంది. నవ వసంతాల ‘నమస్తే తెలంగాణ’ సొంత ఉద్యోగులను నడి రోడ్డున పడేస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. వరంగల్ లో 10 మంది.. కరీంనగర్ లో 3.. […]

Written By: NARESH, Updated On : June 11, 2020 3:50 pm
Follow us on

పేరుకు అధికార పత్రిక.. ఇంతటి కరోనా-లాక్ డౌన్ లోనూ తట్టుకొని నిలబడిందని ఇన్నాళ్లు శభాష్ అనుకున్నాం.. ఈనాడు, ఆంధ్రజ్యోతిలే తట్టుకోలేక ఉద్యోగులను వదిలించుకుంటే నమస్తే చరిష్మా చూసి అబ్బురపడ్డాం. కానీ తమ కత్తికి కూడా పదును ఉందని.. తమ ఉద్యోగుల విషయంలోనూ అదే కాఠిన్యం అని తెలంగాణలో అధికార పత్రిక నిరూపించుకుంది. నవ వసంతాల ‘నమస్తే తెలంగాణ’ సొంత ఉద్యోగులను నడి రోడ్డున పడేస్తున్న వైనం విస్తుగొలుపుతోంది. వరంగల్ లో 10 మంది.. కరీంనగర్ లో 3.. నిజమామాద్, ఖమ్మం ఇలా ఎడిషన్లలో తీసివేతలు మొదలయ్యాయి. ఇలా సాగనంపే కార్యక్రమాలను బాగానే చేస్తోంది అధికార పార్టీ పత్రిక. పక్కరాష్ట్ర పత్రిక ‘సాక్షి’ సైతం ఉద్యోగులను తొలగించకుండా.. వారికి జీతాల్లో ఇప్పటిదాకా కోత విధించకుండా ఇంకా ఠీవీగా నిలబడింది. తెలంగాణలో ఈనాడు, జ్యోతి బాటలో నమస్తే ఉద్యోగులను రోడ్డున పడేయగా.. ఒక్కసాక్షిలో మాత్రం ఇంకా వారి ఉద్యోగులపై కనికరం చూపుతోంది. బహుషా ఏపీలో అధికారం ఆ పత్రికకు వరంగా మారిందనుకుంటా.. కానీ ఎంత పోల్చుకున్నా.. ఇన్ని వనరులు, అధికారం ఉండి కూడా నమస్తే ఇంతటి కాఠిన్యం ప్రదర్శించడంపై జర్నలిస్టు వర్గాల్లో విమర్శలు వ్యక్తమవుతున్నాయి..

సొంత ఉద్యోగులను నడి రోడ్డున పడేస్తున్నది తెలంగాణలోని అధికార పార్టీ పత్రిక. తెలంగాణకు దారి దీపం అని చాటింపు వేయించుకున్న ఆ పత్రిక ఇప్పుడు తన సొంత సంస్థలోని ఉద్యోగులను చీకట్లోకి నెడుతోంది. ‘మీడియా సంస్థల్లో ఉద్యోగుల జీతాలకు కోత పెట్టినా.. తొలగించినా తెల్ల కాగితం మీద రాసివ్వండి.. దానినే కంప్లయింట్ గా భావిస్తాం.. చర్యలు తీసుకుంటామన్న’ సీఎం కేసీఆర్… ఇప్పుడు తన నమస్తే తెలంగాణ పత్రికలోని ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నా ఉలుకుపలుకూ లేకపోవడమే జర్నలిస్టులను అమితంగా బాధిస్తోంది. మరి ఇప్పుడేం చర్యలు తీసుకుంటారన్నది కేసీఆర్ సారే సమాధానం చెప్పాలి… ఇది మానవత్వమేనా జర్నలిస్టులు ప్రశ్నిస్తున్నారు.

తెలంగాణ ఉద్యమంపై సీమాంధ్ర పత్రికలు విషం చిమ్ముతున్న సమయంలో ప్రముఖ తెలంగాణ పారిశ్రామికవేత్త సీఎల్ రాజం పదేళ్ల క్రితం నమస్తే తెలంగాణ పత్రికను ప్రజల ముందుకు తీసుకువచ్చి.. మనకు జరుగుతున్న అన్యాయాన్ని కళ్లకు కట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ ఉద్యమానికే ఊపిరిగా నిలిచింది నమస్తే తెలంగాణ పత్రిక.. సీమాంధ్ర పాలకుల నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నది. ఆర్థిక ఇబ్బందులను ధీటుగా ఎదుర్కొని నిలబడ్డది. అప్పటి ఎడిటర్ నుంచి ఆఫీస్ బాయ్ దాకా తెలంగాణ ఉద్యమంలో తాము సైతం అంటూ ముందుకు వచ్చారు. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఉన్న జీతాలతో సర్దుకొని ఉద్యమానికి గొంతుకయ్యారు.. తెలంగాణ ప్రజల ఆకాంక్ష… 2014లో నెరవేరింది. ఉద్యమ సమయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న నమస్తే తెలంగాణ సిబ్బంది.. తెలంగాణ వచ్చిన తర్వాత తమ కష్టాలు తీరాయని భావించారు.

అదే సమయంలో సీఎంగా ఎన్నికైన కేసీఆర్ ముందు చేసిన పని… నమస్తే తెలంగాణ పత్రికను వ్యవస్థాపకుడు సీఎల్ రాజం నుంచి బలవంతంగా మార్పించేశాడన్న అపప్రదను మూటకట్టుకున్నాడనే ఆరోపణలున్నాయి. ఐదేళ్లు గడిచాయి. నమస్తే తెలంగాణ పత్రిక ఫక్తు గులాబీ పత్రికగా మారిపోయింది. పెద్ద పెద్ద హెడ్డింగులతో లక్ష ఉద్యోగాల భర్తీ అంటూ వారానికోసారి నమస్తే తెలంగాణ పత్రికలో అచ్చు వేయించుకున్నారు. కేసీఆర్ ను ఇహలోక కలియుగ దైవంగా పత్రికలో కీర్తిస్తుంటారు. కరోనా కష్టకాలంలో ఏ సంస్థ కూడా ఉద్యోగులను తీసేయవద్దు.. జీతాలు కోత పెట్టద్దు అని ప్రెస్ మీట్లలో ఇదే కేసీఆర్ అంటుంటాడు. మీడియా సంస్థల్లో ఉద్యోగుల జీతాలకు కోత పెడుతున్నారని ఓ విలేకరి సీఎం కేసీఆర్ ను ప్రశ్నించగా.. నాకు దరఖాస్తు ఇవ్వండి.. అదే కంప్లయింట్ గా భావించి, చర్యలు తీసుకుంటామని చెప్పాడు. కానీ సీఎం కేసీఆర్ తన పత్రికగా భావించే నమస్తే తెలంగాణ పత్రికలోని ఉద్యోగులకు జీతాల్లో కోత పెట్టాడు. ప్రస్తుతం ఆదాయం లేదు కదా అని ఉద్యోగులు సైతం సర్దుకున్నారు. సాఫ్ట్ వేర్ సంస్థ లు, ఇతర పరిశ్రమల్లో ఉద్యోగులను తొలగించవద్దని మంత్రి కేటీఆర్ కూడా స్టేట్ మెంట్లు ఇచ్చాడు.

కానీ దాదాపు 15 రోజులుగా నమస్తే తెలంగాణ పత్రికలోని సిబ్బంది తొలగింపు కూడా మొదలు పెట్టారు. ఇప్పటి వరకు ఖమ్మం, నిజామాబాద్, వరంగల్ ఎడిషన్ల పరిధిలో పదుల సంఖ్యలో ఉద్యోగులను ముందస్తు నోటీసు లేకుండా తొలగించారు. తొలగించిన సిబ్బందిని ఆయా ఎడిషన్ కార్యాలయాలకు రానివ్వద్దంటూ సెక్యూరిటీ గదుల వద్ద నోటీసులు కూడా అంటించారు. దాదాపు తొమ్మిదేళ్లుగా పని చేస్తున్న ఉద్యోగులను తొలగించడమే కాకుండా, అసలు విషయం ఏమిటో తెలుసుకోనివ్వకుండా ఆఫీసులకు కూడా వారిని రానివ్వద్దంటూ నోటీసులు అంటించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లక్ష ఉద్యోగాల భర్తీ హామీలు ఇచ్చిన కేసీఆర్ తను హస్తగతం చేసుకున్న పత్రికలోని ఉద్యోగులను రోడ్డున పడేయడమే ఇక్కడ శోచనీయం అని చెప్పవచ్చు.