అగ్రరాజ్యం అమెరికా 21 ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీని ప్రకటించింది. తమ దేశ పౌరుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేసింది. అదే భారత దేశం కేవలం 2 ట్రిలియన్ డాలర్లు (20 లక్షల కోట్లు) మాత్రమే ప్యాకేజీ ప్రకటించింది. అదే నేరుగా భారతీయుల ఖాతాల్లో పడలేదు. పరిశ్రమలు, వివిధ రంగాలకు ఉద్దీపన ప్యాకేజీలలాగా.. బ్యాంకులు, కార్పొరేట్లకు పంచిపెట్టింది.సామాన్యుడికి మోడీ సర్కార్ నేరుగా ఇచ్చింది రూ.500 మాత్రమే. అదీ జన్ ధన్ ఖాతాల్లోనే. అగ్రరాజ్యం అమెరికా ఈ మహావిపత్తు నుంచి నేరుగా అమెరికన్లకు డబ్బులు పంచి కోలుకునే సత్తా ఉంది. జపాన్ సహా అగ్రదేశాలన్నీ ఇదే ఫార్ములా అప్లై చేశాయి. మన మోడీ సార్ మాత్రం భారతీయులకు నేరుగా డబ్బులు పంచే సాహసం చేయలేదు. దీంతో పేద, మధ్యతరగతి , వలస కూలీలకు చేతిలో చిల్లిగవ్వ లేక అష్టకష్టాలు పడుతున్నారు. మోడీ చెప్పినట్టు ఈ సమయంలో బ్యాంకుల ఎదుట క్యూలు కట్టి రుణాలు తీసుకునే పరిస్థితిలో ఎవరూ లేరు. దీంతో మున్ముందు భారతదేశం భారీ ఆర్థిక విపత్తును చవిచూడబోతోందని ఆర్థిక రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
*మోడీ ఫెయిల్యూరేనా?
మహమ్మారి వైరస్ ధాటికి భారతదేశం భారీ ఆర్థిక విపత్తులోకి జారిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మోడీ 20 లక్షల ప్యాకేజీ ఉట్టి గాలి బుడగ అని తెలిసి స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. దుర్భర దారిద్ర్యం.. ఆకలిచావులు, నిరుద్యోగం దేశంలో పెరిగిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాని మోడీ దీన్ని హ్యాండిల్ చేయలేడని నిపుణులు చెబుతున్నారు. తాజాగా ప్రస్తుత పరిస్థితుల్లో భారతదేశాన్ని ఎవరూ కాపాడలేరని ప్రఖ్యాత ఆర్థిక వేత్త, ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్ హెచ్చరించారు. ఈ మేరకు ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారత ఆర్థిక వ్యవస్థ భారీ విపత్తుకు లోనై కుప్పకూలుతుందని సంచలన వ్యాఖ్యలు చేశారు..
*రఘురాం రాజన్ చెప్తున్న వాస్తవాలు
తాజాగా రఘురాం రాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత దేశం ఎదుర్కోబోయే విపత్తు గురించి ఆందోళనగా ఉందని.. ప్రభుత్వం, ప్రతిపక్ష సలహాలు తీసుకోకుండా ప్రధాని మోడీ ఒంటిచేత్తో ఏమీ చేయలేరని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎంతో చేయాలని.. లేదంటే దేశం భారీ ఆర్థిక విపత్తులోకి కూరుకుపోతుందని రఘురాం రాజన్ స్పష్టం చేశారు. మహమ్మారి వల్ల భారత్ పెను సంక్షోభాన్ని ఎదుర్కోనుందని.. దేశంలోని నిపుణులను సంప్రదించి సూచనలు, సలహాలు తీసుకోవాలని రాజన్ సలహా ఇచ్చారు. కరోనాతో కలిగిన నష్టాన్ని భర్తీ చేయడం ఒక్కటే కాదని.. మూడు నాలుగేళ్ల కిందటి ఆర్థిక వైభవం అందుకోవడం కీలకమన్నారు. ప్రస్తుతం రాజకీయాలు చూడవద్దని.. కలిసి పనిచేయాలని మోడీకి రాజన్ హితవు పలికారు. నైపుణ్యం గల వారి సలహాలు తీసుకోవాలన్నారు.
* మోడీ 20 లక్షల కోట్లు సరిపోవు.. అది ఉత్త ప్యాకేజేనా?
ప్రధాని మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల ప్యాకేజీ ఉత్త గాలిబుడగ అని ఆర్థిక వేత్తలు ఇప్పటికే విమర్శించారు. భారత్ లో మహమ్మారి వల్ల కలిగిన నష్టంతో పోలిస్తే ఇది సరిపోదని ఆర్థిక వేత్తలంతా ముక్తకంఠంతో నినదిస్తున్నారు. కష్టాల్లో ఉన్న అన్ని రంగాలను ప్రభుత్వం ఆదుకోవాలంటున్నారు. లేదంటే ఏడాదిలోగా ఆర్థిక వ్యవస్థ మరింత భారీగా నష్టపోయే ప్రమాదముందంటున్నారు. మౌలిక ప్రాజెక్టులు, నిర్మాణ రంగంపై దృష్టిపెట్టాలని సూచిస్తున్నారు. ద్రవ్యలోటు పెరిగి, అంతర్జాతీయ పరపతి రేటింగ్ సంస్థలు దేశ పరపతి రేటింగ్ ను తగ్గిస్తాయనే ఆందోళన పక్కనపెట్టి సాయం చేయాలని సూచిస్తున్నారు.
*భారత్ లో కుప్పకూలిన రంగాలివే..
అమెరికా వలే భారత దేశంలో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించడం సాధ్యం కాదని బీజేపీ నేతలు, కేంద్రమంత్రులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఇప్పటికే మోడీసార్ పట్టించుకోకపోవడంతో ఎయిర్ లైన్స్, పర్యాటకం, మ్యాను ఫ్యాక్చరింగ్, నిర్మాణ రంగాలు భారత్ లో కుప్పకూలాయి. సంస్థలను ఆదుకునేందుకు రుణ పునర్ వ్యవస్థీకరణతోపాటు మూల ధన సాయం కూడా మోడీ ప్రభుత్వం చేయడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. .
*వలస కార్మికులను ఆదుకోని మోడీజీ?
దేశంలో హృదయవిదారకంగా మారిన బతుకులు ఎవరివైనా ఉన్నాయంటే ఖచ్చితంగా అవి వలస కార్మికులవే. వేల కిలోమీటర్లు కాలినడకన నడిచిన దైన్యం.. పట్టాలపై ప్రాణాలు పోగొట్టుకున్న దారుణాలు దేశంలో జరిగాయి. ఇప్పటికీ రవాణా సౌకర్యాలు లేక వందలాది మంది నడిచివెళుతున్నారు. వాహనాల్లో వెళుతూ ప్రమాదాల్లో బలి అవుతున్నారు. వీరి విషయంలో మోడీ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోవడం లేదన్న విమర్శలున్నాయి. లేటుగా నడిపిస్తున్న రైళ్లు బండ్లు సరిపోవడం లేదు. వారి ఆకలి కేకలు, ఆర్థిక భరోసా కల్పించడం లేదు. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయిన వీరిని మోడీ ప్రభుత్వం ఆదుకోవాలని.. వారికి నిత్యావసరాలు, షెల్టర్ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఇంతవరకు వారి విషయంలో మోడీ సర్కారు స్పందించలేదు. పేదలకు, వలస కూలీలకు రేషన్ ఇస్తే సరిపోదు. ఉచిత నగదు కూడా చేతికి ఇచ్చినప్పుడే వారు తిరిగి నిలబడతారు.. ఆర్థిక వ్యవస్థను నిలబెడుతారు. పేదలు, మధ్యతరగతి , నిమ్న వర్గాల చేతుల్లో ఇప్పుడు డబ్బులు లేవు. చేసేందుకు పని లేదు. ఈ సమయంలో వారికి డబ్బులు డైరెక్టుగా అందినప్పుడు మాత్రమే భారత ఆర్థిక వ్యవస్థ లేస్తుంది. లేదంటే కుప్పకూలుతుందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి దీన్ని మోడీ సర్కార్ పాటిస్తుందా లేదా అన్నది వేచిచూడాలి.
-నరేశ్ ఎన్నం