Extramarital Affairs: హైడ్రా.. భూమిపైన చావులేని జీవి. ఇప్పుడు దీని ప్రస్తావన ఎందుకొచ్చిందంటే.. భార్యాభర్తల మధ్య అనుమానం, సందేహం వంటివి కూడా హైడ్రా లాంటివే. ఒక్కసారి పుడితే వీటికి కూడా చావు ఉండదు. ఈ అనుమానాల వల్లే చాలా సంసారాలు కూలి పోతున్నాయి. ప్రస్తుత హైటెక్ యుగంలో చాలామంది దంపతులు తమ అనుమానాలను నివృతి చేసుకునేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నారు. తనకు తెలియకుండా భర్త ఏం చేస్తున్నాడో.. తనను కాదని భార్య ఎవరితో మాట్లాడుతుందో.. ఇలాంటి వాటిని తెలుసుకునేందుకు రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ ఫ్యామిలీ కోర్టులో ప్రస్తుతం రోజు నాలుగు నుంచి ఐదు విడాకుల దరఖాస్తులు దాఖలవుతున్నాయి. ఒక జైపూర్ లోనే కాకుండా దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో రోజు ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అనుమానం మొదలైన వెంటనే యాప్ ద్వారా ఒకరిపై ఒకరు నిఘా పెట్టుకుంటున్నారు. వాట్సాప్, ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ యాప్ లకు సంబంధించి అనేక క్లోనర్ యాప్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని ఇతరుల మొబైల్లో ఇన్స్టాల్ చేయడం ద్వారా చాటింగ్ వివరాలను తెలుసుకుంటున్నారు. కొన్ని యాప్ లు మొబైల్ లో ఉన్నా గ్యాలరీలో కనిపించవు. మనకు తెలియకుండానే ఫోటోలు, వాయిస్, వీడియో కాల్స్ అన్నింటినీ రికార్డు చేస్తుంటాయి. ఎప్పటికప్పుడు ఫోన్ చెక్ చేసుకుంటూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. యాంటీ స్టాకర్ వేర్ లేదా స్పైవేర్ యాప్ ను ఇన్స్టాల్ చేయడం ద్వారా స్టాకర్ వేర్ యాప్ ను గుర్తించవచ్చని చెబుతున్నారు.
..
అనుమానం పెనుభూతం
..
రాజస్థాన్ రాష్ట్రం జైపూర్ కు చెందిన ఓ యువతి యువకుడికి ఇటీవల వివాహమైంది. వివాహ అనంతరం ఇద్దరు హనీమూన్ కి వెళ్లారు. ఆ తర్వాత తన భార్య పుట్టిన రోజుకు సదరు యువకుడు ఖరీదైన ఫోన్ బహుమతిగా ఇచ్చాడు. కొద్దిరోజుల తర్వాత ఆ యువతికి ఆ యువకుడు కొన్ని స్క్రీన్ షాట్లను వాట్సప్ లో పంపాడు. తన కాలేజీ ఫ్రెండ్ తో చేసిన చాటింగ్ స్క్రీన్షాట్లను చూసిన తర్వాత ఆమెకు మతిపోయింది. మొబైల్లో ఫేస్ లాక్ తదితర సెక్యూరిటీ సౌకర్యాలు ఉన్నప్పటికీ.. చాట్ వివరాలు తన భర్తకు ఎలా చేరాయా అని ఆశ్చర్యపోయింది. ఈ విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. చివరకు కోర్ట్ వరకు వెళ్లారు. పెళ్లి అయినప్పటి నుంచి తన భార్య ఫోన్లో బిజీగా ఉండడంతో అనుమానం వచ్చిన సదరు యువకుడు ఆమెపై నిఘా పెట్టాడు. ఆమెకు బహుమతిగా ఇచ్చిన ఫోన్ లో స్పై యాప్ ఇన్స్టాల్ చేశాడు. తద్వారా ఆమె చాటింగ్ వివరాలన్నీ అతడి మొబైల్ కి చేరిపోయాయి. ప్రస్తుతం ఆ దంపతుల విడాకుల కేసు కోర్టు విచారణలో ఉంది.
…
స్మార్ట్ వాచ్ భర్త బండారం బయటపెట్టింది
..
జైపూర్ లోని సివిల్ లైన్ ప్రాంతంలో నివాసం ఉంటున్న యువతి మార్కెటింగ్ కంపెనీలో పనిచేస్తోంది. ఆమె భర్త ఓ ప్రైవేట్ కంపెనీలో సేల్స్ మేనేజర్ గా పని చేస్తున్నాడు. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. సదరు యువతీ భర్తకు ఉద్యోగరీత్యా ఎక్కువగా బయట ప్రదేశాలకు వెళ్తుంటాడు. ఒక్కోసారి అర్ధరాత్రి అయితే గాని ఇంటికి రాడు. అప్పుడు కూడా ఫోన్లో మాట్లాడుతూనే ఉంటాడు. చివరికి బాత్రూంను కూడా వదిలిపెట్టడు. మొదట ఆఫీసు పనులేమో అనుకుని సదరు యువతి పట్టించుకోలేదు. చివరకు అనుమానం వచ్చి భర్త గురించి తెలుసుకోవాలని అనుకుంది. ఒకరోజు అతడికి స్మార్ట్ వాచ్ ను గిఫ్ట్ గా ఇచ్చింది. ఆఫీస్ టూర్ అని చెప్పి ప్రియురాలితో తిరుగుతున్నట్లు గుర్తించింది. మొదట బుకాయించిన భర్త.. చివరకు తన తప్పును ఒప్పుకున్నాడు. ప్రస్తుతం వీరు కూడా తమ విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కారు. అయితే తల్లిదండ్రులు ఇద్దరు పరస్పరం వాదులాటకు దిగుతుండటంతో ఆ నాలుగేళ్ల పిల్లాడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు.
..
ముల్లును ముల్లతోనే తీసింది
..
జైపూర్ కు చెందిన ఓ యువతికి ఇటీవల వివాహం అయింది. బహుళ జాతి సంస్థలో పని చేస్తున్న ఆమెకు రెండు అంకెలకు పైగానే జీతం వచ్చేది. కానీ భర్త కోరిక మేరకు ఉద్యోగ మానేసింది. ఆమెకు సంబంధించిన ప్రతి విషయంలో అతడు జోక్యం చేసుకునేవాడు. ఆమెను అనుమానించడం నిత్య కృత్యంగా మార్చుకున్నాడు. చివరకు ఆమెను తన తల్లిదండ్రులతో కూడా మాట్లాడనిచ్చేవాడు కాదు. ఒకవేళ ఆమె ఎవరితో నైనా మాట్లాడినా వెంటనే భర్తకు తెలిసిపోయేది. దీంతో ఒకరోజు ఆమె ఈ విషయాన్ని తన స్నేహితురాలికి చెప్పింది. దీంతో రంగంలోకి దిగిన ఆమె బాధితురాలి ఫోన్ పరిశీలించింది. అందులో స్పై యాప్ ఉండడాన్ని గమనించింది.. దీని ద్వారానే తన భార్య కదలికలను భర్త తెలుసుకునేవాడు. దీన్ని పసిగట్టిన సదరు యువతి భర్తకు తెలియకుండా అతడి ఫోన్ లో అదే యాప్ ను ఇన్స్టాల్ చేసింది. కొద్ది రోజుల తర్వాత భర్త బండారం బయటపడింది. అతడు వేరే అమ్మాయితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని రూఢీ అయింది. ఈ విషయంలో జరిగిన గొడవల కారణంగా ప్రస్తుతం వారు విడివిడిగా జీవిస్తున్నారు.
..
జైపూర్ లోని వైశాలి నగర్ కు చెందిన ఓ యువతీ యువకుడికి 2010లో వివాహం అయింది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సదరు భర్త, భార్య పిల్లలతో కలిసి.. మానస సరోవరంలో తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నాడు. అయితే అత్త భార్య మధ్య విభేదాలు తలెత్తడంతో ప్రస్తుతం తల్లిదండ్రులకు దూరంగా భార్య, పిల్లలతో కలిసి ఉంటున్నాడు. కొద్ది కాలానికి భార్య ప్రవర్తనలో మార్పు గమనించాడు. ఓ రోజు అర్ధరాత్రి వేళ ఆ ఫోన్ కు మెసేజ్ వచ్చింది. దానినే గమనిస్తున్న భర్త.. వెంటనే భార్య డిలీట్ చేయడం చూశాడు. దీంతో ఆమెపై అతడికి అనుమానం మరింత బలపడింది. అసలు భార్య వ్యవహారం కనుక్కోవాలనే ఉద్దేశంతో ₹15 వేలు ఇచ్చి ఒక డిటెక్టివ్ ను నియమించుకున్నాడు. వారం పాటు ఆమెను అనుసరించిన డిటెక్టివ్… వరకు తన కళాశాల స్నేహితుడితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోందని గుర్తించాడు. ఇక ఇద్దరి మధ్య పొసగదని కోర్టు మెట్లు ఎక్కారు. ప్రస్తుతం ఆ విడాకుల కేసు విచారణలో ఉంది.
..
తలతిక్క భార్య ఎంత పని చేసిందంటే
..
జైపూర్ ప్రాంతంలోని వైశాలి నగర్ లో నివాసం ఉంటున్న ఒక యువతి యువకుడికి 2015లో వివాహం అయింది. సదరు యువతికి ట్రావెల్ అంటే ఇష్టం ఉండడంతో హనీమూన్ కు మాల్దీవులకు వెళ్లి వచ్చారు. కరోనా లాక్ డౌన్ సమయంలో ఆ యువకుడు తల్లిదండ్రుల వద్ద ఉంటూ వర్క్ ఫ్రం హోమ్ చేసేవాడు. అత్తగారింట్లో ఉండటం ఆమెకు అస్సలు నచ్చలేదు. ప్రత్యేకంగా ఉందామంటూ రోజూ అతగాడితో గొడవపడేది. లాక్ డౌన్ సడలింపు తర్వాత పుట్టింటికి వెళ్ళిపోయింది. అయినా భర్త తన మాట వినలేదని చివరకు ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ సహాయంతో భర్త పేరుమీద నకిలీ ఇంస్టాగ్రామ్ క్రియేట్ చేసింది. భర్త ఆఫీసులోని సహచర ఉద్యోగుల ఫోటోలను మార్ఫింగ్ చేసి అసభ్యకరంగా పోస్ట్ చేసింది. దీంతో అతడికి ఆఫీసులో సమస్యలు తలెత్తాయి. చివరకు విషయం తెలుసుకున్న భర్త.. భార్యపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ప్రస్తుతం వీరు కూడా విడాకులు తీసుకునేందుకు సిద్ధపడుతుండగా.. పెద్దలు నచ్చ చెబుతున్నారు.
..
నమ్మకం సడలిపోతే ఎలా
…
పెళ్లి అంటేనే తప్పు ఒప్పులతో నిమిత్తం లేకుండా ఎదుటి మనిషిని యధాతధంగా అంగీకరించడం. కానీ నేటి హైటెక్ తరంలో ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండటం లేదు. పైగా సంసారాల్లోకి స్మార్ట్ ఫోన్ చొచ్చుకు రావడంతో బంధాలు నిలబడటం లేదు. ఒకరిపై ఒకరికి అనుమానం మొదలై అది పెనుభూతంగా పరిణమిస్తున్నది. ఒక్క రాజస్థాన్ కోర్టులోనే రోజుకు నాలుగు నుంచి ఐదు ఫ్యామిలీ కేసులు వస్తున్నాయంటే పరిస్థితి ఎంతకు దిగజారుతోందో అర్థం చేసుకోవచ్చు. వెనుకటి రోజుల్లో పెళ్లి చేసుకున్న వారు నేటికీ అన్యోన్యంగా ఉంటున్నారంటే కారణం ఒకరిపై ఒకరికి నమ్మకం. కానీ నేటి తరంలో అదే లోపిస్తోంది. ఫలితంగా అనుమానం మొదలై విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతోంది.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Extramarital affairs that break the gates
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com