TRS Politics: ఎన్నికల సమయంలో తెలంగాణ సెంటిమెంట్ రాజేసి ఓట్లు దండుకోవడంలో విజయవంతమవుతున్న టీఆర్ఎస్ తాజాగా సెంటిమెంట్ పాలిటిక్స్‌కు మరోసారి తెరలేపినట్లే కనిపిస్తోంది. వరంగల్‌లో కేటీఆర్ స్పీచ్‌లో ఆంతర్యం కూడా అదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. తెలంగాణ సెంటింట్‌ను టీఆర్ఎస్ నేతలు వాడుకున్నంతగా రాష్ట్రంలో ఏ పార్టీ వాడుకోదు. తమకు అవసరమైనప్పుడు ఉద్యమ ఆకాంక్ష, పోరాటం, త్యాగాలను గుర్తుచేస్తారు. అవసరం తీరాక వాటి ఊసే ఎత్తరన్న విమర్శ ఉంది. ముఖ్యంగా ఆంధ్రా వారిని ఎన్నికల టైంలో తిడుతూ.. అధికారంలోకి వచ్చాక వారితో రాసుకుపూసుకు తిరిగిన వారిలో టీఆర్ఎస్ నేతలే ఎక్కువ. వరంగల్‌లో పర్యటనలో మంత్రి కేటీఆర్ బీజేపీ, కాంగ్రెస్‌లపై విరుచుకు పడిన తీరు, చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాష్ట్ర ప్రజలలో ఆసక్తికర చర్చకు కారణమవుతున్నాయి. ఓరుగల్లు ప్రజలకు చేసిన అభివృద్ధి చెప్పడానికి ఏమీ లేక అసహనంతో బిజెపి, కాంగ్రెస్‌పై మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారనే చర్చ స్థానికంగా పొంతపార్టీ నేతలనుంచే వినిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నం చేశారన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ముందస్తు ఎన్నికల వ్యూహంలో భాగంగానే కేటీఆర్ సెంటిమెంట్ వ్యాఖ్యలు చేశారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
-కేటీఆర్ స్పీచ్ పై ఆసక్తికర చర్చ..
మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలలో ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై విరుచుకుపడిన మంత్రి కేటీఆర్.. ‘ఎవడీ రేవంత్‌రెడ్డి? ఎవడీ బండి సంజయ్?’ అని పరుష పదజాలం వాడారు. ‘వాళ్లు నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు.. తెలంగాణ కోసం ప్రాణాలు ఫణంగా పెట్టిన నేతపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. మాకు బూతులు రావా?’ అంటూ మండిపడిన కేటీఆర్ ‘మోదీని బట్టేబాజ్ , లుచ్చాగాడు అని మేం తిట్టలేమా’ అంటూ దుర్బాషలాడారు. కేసీఆర్ లేకుంటే టీపీసీసీ, టీ బీజేపీ ఎక్కడివి అంటూ మండిపడ్డారు. ‘కేసీఆరే లేకపోతే నేడు మొరుగుతున్న కుక్కలు, గాడిదలు ఎక్కడివి’ అంటూ తీవ్ర పదజాలం ఉపయోగించారు. ‘నాలుక వాడటం మొదలు పెడితే మాకంటే బాగా ఎవడు మాట్లాడలేరు’ అంటూ నిప్పులు చెరిగారు. అంతేకాదు ఎట్టికైనా మట్టికైనా మనోడే కావాలని, ఇంటి పార్టీ శ్రీరామరక్ష అని’ సెంటిమెంటును జనాలకు మళ్లీ ఎక్కించే ప్రయత్నం చేశారు.
-అసహనానికి ఇదే కారణమా?
మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలలో ప్రతిపక్ష పార్టీలపై కేటీఆర్ అసహనం కొట్టొచ్చినట్టు కనిపించింది. ఒకప్పుడు ప్రతిపక్ష పార్టీలను పట్టించుకోని మంత్రి కేటీఆర్, ఇప్పుడు ప్రతిపక్ష పార్టీలను ప్రధానంగా ఫోకస్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందనే చర్చ జరుగుతోంది. బండి సంజయ్, రేవంత్‌రెడ్డి రాకతో రాష్ట్రంలో ఆ పార్టీలకు మైలేజ్ పెరుగుతోంది. దీనిని జీర్ణించుకోలేక కేటీఆర్ గతంలో లేని విధంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారని చర్చ జరుగుతుంది. మరోపక్క వరంగల్ నగరానికి అభివృద్ధి విషయంలో గతంలో ఎన్నో హామీలు ఇచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ హామీలను నెరవేర్చలేదు. ఇక వాటి విషయంలో చెప్పడానికి ఏమీ లేక ప్రతిపక్ష పార్టీలను టార్గెట్ చేశారని స్థానిక గులాబీ నేతలే చర్చించుకోవడం గమనార్హం. ఇక జాతీయ పార్టీలను ఎదుర్కోవటంలో కూడా తెలంగాణ లోకల్ స్ట్రాటజీని వాడారు కేటీఆర్.
Also Read: Acharya Sensor Review: ఆచార్య సెన్సార్ రివ్యూ
-లోకల్ సెంటిమెంట్ రగిల్చేందుకే..
తెలంగాణ సెంటిమెంటుతో రాష్ట్రాన్ని సాధించి, రెండు దఫాలుగా పరిపాలన సాగిస్తున్న టీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాన్ని కూడా మంత్రి కేటీఆర్ వరంగల్ సభలో రివీల్ చేశారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్ కడుపులో ఉండే బాధ జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ నాయకులకు ఉండదని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎట్టికైనా, మట్టికైనా మనోడే ఉండాలంటూ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మన పార్టీనే ఉండాలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మళ్లీ తెలంగాణ లోకల్ సెంటిమెంట్ ను రగల్చటంలో భాగమే అన్న చర్చ జరుగుతోంది.
-మన పార్టీనే మనకు శ్రీరామరక్ష…
ఏనాటికైనా మన ఇంటి పార్టీనే మనకు శ్రీరామరక్ష అని కేటీఆర్ కొత్త నినాదాన్ని ఎత్తుకోవటం అందుకు ఊతమిస్తుంది . బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు 29 రాష్ట్రాలలో తెలంగాణ ఒకటని, కానీ మనకున్నది ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ చెప్పడం, స్థానిక పార్టీ అని ఫీలింగ్ కలిగించడం కోసమే అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో తెలంగాణ రాష్ట్ర సాధన సెంటిమెంటుతో, ఆ తర్వాత బంగారు తెలంగాణ సాధిస్తామన్న హామీతో, ఇక ఇప్పుడు ఇంటి పార్టీ అయితేనే శ్రీరామరక్ష అంటూ తెలంగాణ ప్రజలలో లోకల్ సెంటిమెంట్‌ను రగిల్చి, జాతీయ పార్టీలకు చెక్ పెట్టాలని కేటీఆర్ భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
-జాతీయ పార్టీలకు చెక్ పెట్టే ప్లాన్..
లోకల్ సెంటిమెంట్‌తో స్థానికంగా టీఆర్ఎస్ తెలంగాణ వాసుల పార్టీ అని, జాతీయ పార్టీలు మనవి కావనే భావన ప్రజల్లో కలిగించే ప్రయత్నం కేటీఆర్ షురూ చేశారు. అందులో భాగంగానే జాతీయ పార్టీలపై విరుచుకు పడి.. ‘ఆ రెండు పార్టీలను ఆదరించ వద్దంటూ, మన తెలంగాణ పార్టీ, సొంత పార్టీ.. టీఆర్ఎస్ను ఆదరించాలి’ అని కేటీఆర్ మళ్లీ తెలంగాణ సెంటిమెంటుతో జనాల్లోకి వెళుతున్నారు. ఒకపక్క ప్రతిపక్ష కాంగ్రెస్, బీజేపీలు అధికార టీఆర్ఎస్పై తమ దాడిని పెంచుతుంటే కేటీఆర్ జనాల్లో సెంటిమెంట్ రగల్చడం ద్వారా జాతీయ పార్టీలను నిలువరించాలనే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.
Also Read: Badri:పవన్ కళ్యాణ్ ‘బద్రి’ సినిమాను రిజెక్ట్ చేసిన ఈ స్టార్ హీరో!
Recommended Videos:
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Fight with bjp will telangana sentiment work for trs again
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com