Maha Shivaratri 2024: మహాశివరాత్రి పర్వదినానికి యావత్ దేశం సిద్ధమవుతోంది. అంతటా శివతత్వం నెలకొంది. మార్చి 8న మహాశివరాత్రి పర్వదిన. ఈ రోజు భక్తులు పరమ శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు మహాదేవుడైన ఈశ్వరుడు హిందూమతంలో అత్యంత పవర్‌ఫుల్ దేవుడు. త్రిమూర్తులు బ్రహ్మ, విష్ణు, శివుడు సృష్టి, స్థితి, లయ కారుడిగా పరిగణిస్తారు. ఇక పరమేశ్వరుడికి అనేక రూపాలు, పేర్లు ఉన్నాయి. శివుడిని లింగ రూపంలో ఎక్కువగా పూజిస్తారు. భారత దేశం అంతటా లింగ రూపంలో శివుడు కొలువుదీరిన దేవాలయాలు అనేకం ఉన్నాయి. ప్రతీది ప్రత్యేకమే. దేని ప్రాముఖ్యత దానిదే. వీటిలో ప్రపంచంలోనే ఎత్తయిన శివాలయం ఉంది. అది ఎక్కడ ఉంది. ఎవరు నిర్మించారు అనే వివరాలు తెలుసుకుందాం.
ఉత్తరాఖండ్‌లో..
ప్రపంచంలో ఎత్తయిన శివాలయంగా తుంగనాథ్ ఆలయం నిలిచింది. ఇది ఉత్తరాఖండ్‌లోని గర్హా్వల్ హిమాలయాలలో 3,680మీటర్లు(12,070 అడుగుల) ఎత్తులో ఉంది. తుంగనాథ్ అంటే శిఖరాలకు ప్రభువు అని అర్థం. ప్రకృతి ఒడిలో ఒదిగిపోయిన ఈ ఆలయం చుట్టూ ఆకాశాన్ని తాకే పర్వతాలు, లోయలు ఉన్నాయి. ఈ అందమైన పర్వతాల మధ్య పరమాత్ముడి దర్శనం చేసుకోవచ్చు. మహాభారతంలోని పాండవుల పురాణంతో ముడిపడి ఉన్న ఈ పంచ కేదార దేవాలయాలతో కూడిన తుంగనాథ్ ఆలయమే ఎత్తయినది.
జాతీయ స్మారక చిహ్నంగా..
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సర్వే తర్వాత కేంద్రం తుంగనాథ్ ఆలయాన్ని జాతీయ స్మారక చిహ్నంగా గుర్తింపు ఇచ్చింది. ఈ ఆలయాన్ని 8వ శతాబ్దానికి చెందిన గొప్ప తత్వవేత్త, సంస్కర్త ఆదిశంకరాచార్యులు నిర్మించారు. ఆయన హిందూ మతంలో నాలుగు మఠాలను కూడా స్థాపించారు. ఈ ఆలయాన్ని నగారా నిర్మాణ శైలిలో నిర్మించారు. ఇది దేశంలోని హిందూ దేవాలయ రూపకల్పనలో రెండు ప్రధాన శైలులలో ఒకటి.
ఆలయ చరిత్ర..
తుంగనాథ ఆలయ ప్రధాన దైవం శివలింగం నిత్యం భక్తుల పూజలు అందుకుంటుంది. ఆలయంలో పార్వతీదేవి, వినాయకుడు, ఇతర దేవుళ్లు, దేవతల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ పంచ కేదారాల వెనుక పురాణ గాధ కూడా ఉంది. పురాణాల ప్రకారం పాండవులు కురుక్షేత్ర యుద్ధంలో చాలా మందిని చంపేశాక తమకు పాపఫలం తగలకుండా శివుడిని వేడుకుందామని భావించారు. కానీ, వారు కాస్తో కూస్తో పాపం చేశారని శివుడు భావించాడు. అందుకే వారు దాక్కోవడానికి వృషభంగా రూపాంతరం చెందాడు. ఆ సమయంలో ప్రస్తుతం తుంగనాథ్ ఆలయం ఉన్న ప్రదేశంలో వృషభ బాహువులు(ముందుకాళ్లు ఉద్భవించాయి. పాండవులు వృషభం వివిధ బాగాలు కనిపించిన ప్రదేశాలలో ఐదు పంచ కేదారాలు నిర్మించారట.
ఎలా వెళ్లాలి..
ఇక తుంగనాథ్ ఆలయానికి ఎలా చేరుకోవాలంటే. సమీప రహదారి నుంచి 3.5 కిలోమీటర్ల ట్రెక్కింగ్ చేయాలి. పచ్చని పచ్చిక భూములు, దట్టమైన అడవులు, ఇరుకైన మార్గాలగుండా సాగే ఈ ట్రెక్ ఎంతోసుందరమైనది. సాహసోపేతమైనది. మంచుతో కప్పబడిన శిఖరాలు లోయల దృశ్యం అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడి ప్రశాంత వాతావరనం చూసి పరవశించాలి. ఈ ఆలమం ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు తెరిచి ఉంటుంది. శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా మార్గం ప్రమాదకరంగా మారుతుంది. అందుకే ఆలయాన్ని మూసివేస్తారు.