Hero Ajith: తన చావుకి కారణం అజితే అంటూ కేకలు వేసి ఆయన ఇంటి ఎదురే ఒంటిపై పెట్రోల్ పోసుకుంది ఓ మహిళ. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అజిత్ ఇంటికి చేరుకొని సదరు మహిళ ఒంటిపై నీళ్లుపోసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. తమిళం లో స్టార్ హీరోగా దూసుకుపోతున్న అజిత్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆయనకు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న ‘వాలిమై’ షూటింగ్ ను ఇటీవల హైదరాబాద్ లోనే షూట్ చేసారు.
వివాదాలకు దూరంగా ఉండే అజిత్ కు ఇంటా, బయటా శతృవులు లేరనే చెప్పాలి. ఖాళీ సమయాన్ని తన కుటుంబంతో గడపడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి అజిత్ వల్ల తను ఇబ్బంది పడ్డానని ఓ మహిళ ఏకంగా అజిత్ ఇంటి ముందే ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించటం తమిళనాట సంచలనంగా మారింది.
ఫర్జానా అనే మహిళ ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో నర్సుగా పని చేస్తుండేది. గతేడాది కరోనా సమయంలో అజిత్, షాలిని కలిసి అదే హాస్పిటల్ కు వెళ్లారు. దీంతో ఫర్జానా అజిత్ వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయింది. అజిత్ కరోనా బారిన పడ్డాడంటూ వార్తలు కూడా వచ్చాయి. అయితే హాస్పిటల్ రూల్స్ కి వ్యతిరేకంగా ఫర్జానా ప్రవర్తించిందని… ఆమెని ఉద్యోగంలో నుంచి తీసేశారు.
అయితే అజిత్ హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడితే తన ఉద్యోగం తిరిగి వస్తుందనే ఆశతో ఆమె పలుమార్లు అజిత్ ని కలవడానికి ఎన్నిసార్లు ప్రయత్నించినా కుదరలేదని.. తన చావుకి కారణం అజితే అంటూ కేకలు వేసి ఒంటిపై పెట్రోల్ వేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అజిత్ ఇంటికి చేరుకొని సదరు మహిళ ఒంటిపై నీళ్లుపోసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.