Mallemala Jabardasth: జబర్దస్త్ పడిపోతుంది నిజం. ఎక్స్ట్రా జబర్దస్త్ జనాలను అలరించడం లేదు ఇది కూడా నిజం. మరి ఇన్ని నిజాలు కనబడుతున్నప్పుడు.. టిఆర్పి రేటింగ్ పెరగాలంటే ఏం చేయాలి? షో లో నాణ్యత పెంచాలి. నేలబారు కామెడీ కాకుండా… ఇంటిల్లిపాది చూసే కామెడీ స్కిట్లను రూపొందించాలి. కానీ అలా చేస్తుందా? అలా చేస్తే అది మల్లెమాల ఎందుకు అవుతుంది? మొన్నటిదాకా ఆదితో బండి నెట్టుకొచ్చారు.. కానీ ఆ ఆది గురించి తెలుసు కదా ఓ నొటోరియస్ క్యారెక్టర్. ఇక అతని వల్ల కావట్లేదు అని తెలుసుకొని ఇప్పుడు సద్దాం బ్యాచ్ ను దింపింది.

నాసిరకంగా మారిపోతున్నాయి
నిజానికి ఈటీవీ రేటింగ్స్ ను ఇన్నాళ్ళ వరకు నిలబెట్టినవి జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్.. బూతుల షో లుగా ఎంత ప్రసిద్ధి పొందినా సరే… జనం వాటిని చూస్తూనే ఉన్నారు. ఈటీవీ కూడా అలా కొనసాగిస్తూనే ఉంది.. ఈ షో లోకి కమెడియన్లు, జడ్జీలు వస్తుంటారు, పోతుంటారు.. దాని బేసిక్ ఇదే.. కాకపోతే ఒకప్పుడు స్కిట్ ను స్కిట్ లాగా ప్రదర్శించేవాళ్లు.. ఇప్పుడు బాడీ షేమింగ్ లు, ర్యాగింగ్లు, బీ గ్రేడ్ డైలాగులు జోకులుగా చెలామణి అవుతున్నాయి.. అయితే ఇవి ఎంత నాసిరకంగా ఉన్నప్పటికీ సరే వేరే ఛానల్స్ లో కామెడీ షోలు పెద్దగా క్లిక్ కాకపోవడం, కొత్త ఫార్మాట్ ఆలోచించకపోవడంతో జబర్దస్త్ బచాయిస్తోంది. కానీ అదంతా గతం ఇప్పుడు జనం కూడా వాటిని పట్టించుకోవడం మానేస్తున్నారు. జబర్దస్త్ లో నూకరాజు, ఇమాన్యుయేల్, రాఘవ తప్ప కమెడియన్లు పెద్దగా రాణించడం లేదు.

పడిపోతున్నాయి
గతవారం జబర్దస్త్ రేటింగ్ 3.19, ఎక్స్ట్రా జబర్దస్త్ రేటింగ్ 2.86.. అక్టోబర్, నవంబర్ నుంచి డౌన్ ఫాల్ మరీ ఘోరంగా ఉంది.. కాస్తో కోస్తో బెటర్ రేటింగ్స్ ఉండే శ్రీదేవి డ్రామా కంపెనీ 3.82 కు పడిపోయింది.. గతంలో ఈటీవీ టాప్ 30 లిస్టులో జబర్దస్త్ కచ్చితంగా ఉండేది.. ఇప్పుడు అవి ఆ జాబితాలో లేకుండా పోయాయి.. ఇప్పుడు చేతులు కాలాయేమో మల్లెమాలకు తత్వం బోధపడుతున్నది. ఈగో వదిలేసి సీనియర్ కమెడియన్లను పిలుస్తున్నది.. కొత్త టీంలను ఫామ్ చేస్తోంది.. తాజాగా జబర్దస్త్ లోకి సద్దాం, యాదమ్మ రాజు, శాంతి కుమార్ వచ్చి చేరారు. చాలాకాలంగా శాంతి కుమార్ బుల్లితెరపై కనపడటం లేదు.. సద్దాం, యాదమ్మ రాజు ఓటీటీ లో వచ్చే కామెడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రాంలో నటిస్తున్నారు.. వీళ్లు మంచి టైమింగ్, ఎనర్జీ ఉన్న కమెడియన్లే.. పనిలో పనిగా అదే ఆహా షోలో పనిచేస్తున్న హరి ని కూడా తీసుకొస్తే సరిపోయేది.. వీరంతా కూడా ఆహా షో లో చేస్తున్నప్పటికీ ఈ టీవీ ఎంగేజ్ చేసుకుందంటే విశేషమే.. అదే సమయంలో అక్కడే చేస్తున్న వేణు, అవినాష్ లతో మల్లెమాల కు కొన్ని గొడవలు ఉన్నాయి.. ఇక సద్దాం బ్యాచ్ గతంలో ఈటీవీలో పనిచేసిన వారే.. ఈటీవీ ప్లస్ లో ప్రసారమయ్యే పటాస్ ప్రోగ్రాం లో కనిపించే వాళ్ళు.. అన్నట్టు రేటింగ్స్ డమాల్ అయితే ఆ కొత్త యాంకర్ సౌమ్యను తీసేస్తారా? లేక కొనసాగిస్తారా? ఏమిటో ఈ మల్లెమాల నిర్ణయాలు… ఒక పట్టాన అంతు పట్టవు.