AP CM Jagan: తెలుగు చిత్రపరిశ్రమకు కరోనా మహమ్మారి వల్ల ఎదురైన ఇబ్బందులు కొన్ని కాగా.. ఏపీ సర్కారు వల్ల వచ్చిపడ్డ తిప్పలు మరికొన్ని. ఇలాంటి పరిస్థితుల్లో.. చర్చలకు రావాలంటూ ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడంతో.. ఇండస్ట్రీలో ఆశలు చిగురించాయి. మంత్రి పేర్ని నాని స్వయంగా చిరంజీవికి ఫోన్ చేసి.. ముఖ్యమంత్రితో సమావేశమై సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. దీంతో.. మెగాస్టార్ చిరంజీవి వెంటనే సినీ పెద్దలతో సమావేశమయ్యారు. చిరు నివాసంలో జరిగిన భేటీలో నాగార్జున, సురేష్ బాబు, అల్లు అరవింద్, దిల్ రాజు, సి.కల్యాణ్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రితో ఏయే అంశాలపై చర్చించాలనే విషయమై వీరు మాట్లాడుకున్నారు.
ప్రధానంగా.. థియేటర్ల విద్యుత్ బిల్లుల నుంచి మినహాయింపులు పొందే అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయించారు. అదేవిధంగా.. బీ, సీ సెంటర్లలో టిక్కెట్ రేట్ల పెంపు అంశంపైనా ప్రభుత్వంతో చర్చించాలని డిసైడ్ చేశారు. అదేవిధంగా.. సినీ కార్మికుల సమస్యలను సైతం సీఎం దృష్టికి తీసుకెళ్లి.. వారికి మేలు చేకూర్చే నిర్ణయాలు తీసుకునేలా చూడాలని నిర్ణయించారు. ఈ భేటీ తర్వాత మంత్రి పేర్ని నాని హైదరాబాద్ వెళ్లి చిరంజీవిని కలిశారు. దీంతో.. ఇక మీటింగే తరువాయి అనుకున్నారు. ఆగస్టు 19లోపు సమావేశం నిర్వహించాలని చిరు కోరినట్టు కూడా ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పటి వరకూ మీటింగ్ ఊసు లేకపోవడంతో అసలు మీటింగ్ ఉందా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
పేర్నినాని వచ్చిపోయిన తర్వాత.. ముఖ్యమంత్రి జగన్ తో మీటింగ్ అంశం ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడంతో.. తెర వెనుక ఏదో జరిగిందన్న అనుమానాలు మొదలయ్యాయి. ఈ మేరకు పలు గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి. మంత్రికి-ఇండస్ట్రీ పెద్దలకు మధ్య ఏదైనా డీల్ విషయమై తేడా వచ్చి ఉండొచ్చని ఫిల్మ్ నగర్లో చర్చించుకుంటున్నారు. ఇంతకీ అది ఏమై ఉంటుంది? అనే డిస్కషన్ కూడా నడుస్తోంది.
ఈ నేపథ్యంలో అసలు జగన్ తో మీటింగ్ ఉంటుందా? ఉండదా? అనే విషయంలో స్పష్టత కొరవడింది. ఏపీలో ప్రధాన సమస్య టికెట్ రేట్ల తగ్గింపు అన్నది తెలిసిందే. వకీల్ సాబ్ సినిమాకు ముందు హడావిడిగా జీవో తెచ్చిన ప్రభుత్వం.. పదేళ్ల కిందటి ధరల దుమ్ము దులిపి, అవే వసూలు చేయాలని ఆదేశించింది. ఈ ధరలు ఏ మాత్రం గిట్టుబాటు కాకుండా ఉండడంతో.. అటు థియేటర్లు తెరుచుకోవట్లేదు. ఇటు పెద్ద సినిమాలు రిలీజ్ కావట్లేదు. మరి, ఈ సమస్య ఎప్పుడు, ఎలా పరిష్కారం అవుతుందో చూడాలి.