Johnny Master : ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు విషయంలో రోజు ఎదో ఒక కొత్త విషయం బయటపడుతూనే ఉంది. శ్రేష్టి వర్మ అనే అమ్మాయి జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి జరిపి 5 ఏళ్ళ నుండి టార్చర్ చేస్తున్నాడని, తన టీం నుండి వెళ్ళిపోయి, తాను సెపెరేట్ గా కొరియోగ్రాఫర్ అయ్యినప్పటి నుండి ఈ వేధింపులు మరింత పెరిగాయని, తనని పెళ్లి చేసుకోకపోతే సినిమాల్లో అవకాశాలు రానివ్వకుండా చేస్తానని బెదిరించాడని, అందులో భాగంగానే విశ్వక్ సేన్ సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ, జానీ మాస్టర్ ప్రమేయం వల్ల తప్పించారని, ఇలా ఎన్నో రకాల సంచలన ఆరోపణలు చేస్తూ జానీ మాస్టర్ పై నార్సింగి పోలీస్ స్టేషన్ కేసు వేసింది. ఈ ఘటన ఇండస్ట్రీ ని ఒక కుదుపు కుదిపేసిన సంగతి తెలిసిందే.
జానీ మాస్టర్ ని పోలీసులు గోవా లో అరెస్ట్ చేసి, కోర్టు ఆదేశాల ప్రకారం చంచల్ గూడా జైలుకి రిమాండ్ కోసం తరలించారు. ఆ తర్వాత రంగ రెడ్డి కోర్టు ప్రత్యేక అనుమతితో గత నాలుగు రోజుల నుండి జానీ మాస్టర్ ని కస్టడీ సెల్ కి తరలించి విచారణ చేపట్టారు. ఈ విచారణలో సంచలన నిజాలు బయట పడ్డాయి. అందులో ప్రముఖ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రస్తావన కూడా తీసుకొచ్చాడు జానీ మాస్టర్.
ఆయన పోలీసులకు ఇచ్చిన స్టేట్మెంట్స్ లో ఏమేమి ఉన్నాయంటే ‘నేను శ్రేష్టి వర్మ మైనర్ గా ఉన్నప్పుడు వేధించాను అంటూ చేసిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. ఢీ డ్యాన్స్ షో లో అప్పుడప్పుడు నేను న్యాయ నిర్ణేతగా వ్యవహరించేవాడిని. ఆ అమ్మాయి డ్యాన్స్ టాలెంట్ ని చూసి నేను చాలా మెచ్చుకున్నాను. తనకు తానుగా ఆ అమ్మాయి పరిచయం చేసుకుంది. ఆమెలోని టాలెంట్ ని గమనించి నా అసిస్టెంట్ డ్యాన్సర్ గా పెట్టుకున్నాను. ఆమెకి ఇండస్ట్రీ డ్యాన్స్ కార్డు కూడా ఇప్పించాను . కానీ ఆ అమ్మాయి నన్ను పెళ్లి చేసుకోమంటూ చాలా టార్చర్ చేసింది. డైరెక్టర్ సుకుమార్ కి మా వ్యవహారం గురించి బాగా తెలుసు. శ్రేష్టి బలవంతం చేసినప్పుడల్లా నేను సుకుమార్ దగ్గరకు వెళ్లి నా బాధను చెప్పుకునే వాడిని. నేను ఎంతకూ లొంగకపోవడంతో శ్రేష్టి వర్మ ఇంతటి కుట్రకు తెర లేపింది. ఆమెకు నా శత్రువులందరు తోడు అయ్యారు. నా ఎదుగుదల ని చూసి ఓర్వలేక కొంతమంది కొరియోగ్రాఫర్స్ గతం లో కూడా నాపై ఎన్నో కుట్రలు చేసారు. తోటి కొరియోగ్రాఫర్ కదా అనే జాలితో వాళ్ళ మీద నేను ఎలాంటి న్యాయపరమైన చర్యల కోసం ప్రయత్నం చేయలేదు. ఈరోజు వాళ్ళే నా పతనం కోసం తెగ ప్రయత్నం చేసారు. దీని వెనుక ఒక టాప్ డైరెక్టర్ హస్తం కూడా ఉంది’ అంటూ జానీ మాస్టర్ విచారణలో తెలిపాడట. మరి ఆ డైరెక్టర్ సుకుమారా?, లేదా వేరే డైరెక్టరా అనే విషయం తెలియాల్సి ఉంది.