Team India T20 : రోహిత్ శర్మ టీ 20 లకు గుడ్ బై చెప్పిన నేపథ్యంలో.. టీ 20 జట్టుకు సూర్యకుమార్ యాదవ్ నాయకత్వం వహించనున్నాడు. ఇతడి ఆధ్వర్యంలో ఇటీవల శ్రీలంకలో భారత జట్టు టి20 సిరీస్ ను వైట్ వాష్ చేసింది. దీంతో బంగ్లాదేశ్ తో జరిగే మూడు టి20లో సిరీస్ లోనూ అదే ఫలితం రిపీట్ అవుతుందని అభిమానులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ సిరీస్ కోసం భారత జట్టును ఎంపిక చేసిన సెలక్షన్ కమిటీ కాస్త వైవిధ్యాన్ని ప్రదర్శించింది. వాస్తవానికి టి20 సిరీస్ కు 2+1 విధానంలో ముగ్గురు ఓపెనర్లను సెలక్షన్ కమిటీ ఎంపిక చేస్తుంది. అయితే ఈసారి గతానికంటే భిన్నంగా ఒక్క ఓపెనర్ ను మాత్రమే ఎంపిక చేసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా టెస్ట్ సిరీస్లను పురస్కరించుకొని గిల్, యశస్వి జైస్వాల్ కు సెలక్షన్ కమిటీ విశ్రాంతి ఇచ్చింది. ఒకవేళ గనుక వారు తుది జట్టులో ఉండే ఉంటే వారిలో ఒకరు అభిషేక్ శర్మతో టీమ్ ఇండియాకు ఓపెనింగ్ జోడిగా వచ్చేవారు. అయితే వారిద్దరికీ విశ్రాంతి ఇవ్వడంతో అభిషేక్ శర్మకు జోడిగా ఎవరిని ఓపెనర్ గా దింపుతారనేది ఆసక్తికరంగా మారింది. ఇదే క్రమంలో మరో అవుతారనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ఇక ఇప్పుడు ఉన్న జట్టులో ఆటగాళ్లను ఒకసారి పరిశీలిస్తే సంజు శాంసన్ కు టి20 లలో ఓపెనర్ గా ఆడిన అనుభవం ఉంది. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ కూడా గతంలో ఒకసారి ఓపెనర్ గా వచ్చాడు. ఇక తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి కూడా డొమెస్టిక్ క్రికెట్లో ఓపెనర్ గా ఆడాడు. అయితే అభిషేక్ శర్మకు ఎవర్ని జోడిగా పంపించాలనే విషయంపై ఇంతవరకు టీమిండియా సెలక్షన్ కమిటీ ఒక క్లారిటీ ఇవ్వలేదు. మిగతా ఫార్మాట్లతో పోలిస్తే టి20లలో ఓపెనింగ్ జోడి బలంగా ఉండాలి. ఓపెనర్లు ఆడిన తీరు ఆధారంగానే జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉంటాయి.
ఎవరిని పంపుతారో?
ఇక జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం సంజు శాంసన్ ను అభిషేక్ శర్మకు జోడిగా దింపాలని టీమిండియా సెలక్షన్ కమిటీ భావిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే ఇటీవలి ఐపీఎల్లో సంజు శాంసన్ పెద్దగా ఆకట్టుకోలేదు.. ఇక తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి హైదరాబాద్ జట్టు తరఫున అద్భుతంగా ఆడాడు. పైగా అభిషేక్ శర్మతో అతడికి మంచి బాండింగ్ ఉంది. ఒకవేళ నితీష్ కుమార్ రెడ్డిని ఓపెనింగ్ జోడీగా పంపిస్తే బాగుంటుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సంజు సాంసన్ కు అనుభవం ఉన్న నేపథ్యంలో అతడిని ఆడించే అవకాశం కూడా లేకపోలేదని క్రీడా విశ్లేషకులు అంటున్నారు. వీరిద్దరినీ కాకుండా సూర్య కుమార్ యాదవ్ ను ఓపెనింగ్ జోడీగా పంపిస్తే.. ఒకవేళ వికెట్ పడితే.. అది మిడిల్ ఆర్డర్ పై ప్రభావం చూపించే అవకాశం ఉందని తెలుస్తోంది. అందువల్లే నితీష్ కుమార్ రెడ్డి లేదా సంజు సాంసన్ లలో ఎవరో ఒకరిని అభిషేక్ శర్మ కు జోడిగా పంపించే అవకాశం ఉంది. నితీష్ కుమార్ రెడ్డి కి గత జింబాబ్వే పర్యటనలోనే టీ20లోకి అవకాశం వచ్చింది. తీరా టోర్నీ ప్రారంభమవుతుందనగా అతడు గాయపడ్డాడు. శ్రీలంక టోర్నీ నాటికి అతడు పూర్తిస్థాయిలో ఫిట్ నెస్ సాధించలేకపోయాడు. దీంతో ఈసారి ఎలాగైనా ప్రతిభ చాటాలని భావిస్తున్నాడు. ఒకవేళ ఓపెనింగ్ అవకాశం వస్తే సత్తా చాటాలని యోచిస్తున్నాడు. జాతీయ మీడియాలో రకరకాల కథనాలు వినిపిస్తున్నప్పటికీ.. అంతిమంగా సెలక్షన్ కమిటీ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది ఉత్కంఠ గా మారింది.