Vyuham Pre Release Event: రామ్ గోపాల్ వర్మ ‘ వ్యూహం’ సినిమాకు అడుగడుగునా అడ్డంకులు ఏర్పడుతున్నాయి. ఆయన వినోదాత్మక కోణంలో కాకుండా పొలిటికల్ సెటైరికల్ సినిమాగా చిత్రీకరించడమే అందుకు కారణం. ఇప్పటికే ఆ సినిమా విడుదలకు న్యాయ అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. అంతకుముందు కొద్దిరోజుల పాటు సెన్సార్ బోర్డు అనుమతులు నిలిపివేసింది. తెలంగాణ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత, రివైజ్డ్ కమిటీ పరిశీలించిన తర్వాత అనుమతి లభించింది. అయితే తాజాగా లోకేష్ దాఖలు చేసిన పిటిషన్ తో స్పందించిన న్యాయస్థానం తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సినిమా విడుదల చేయకూడదని స్పష్టం చేసింది.
అయితే ఇంతలో ఫ్రీ రిలీజ్ వేడుకను అట్టహాసంగా చేయాలని రామ్ గోపాల్ వర్మ భావించారు. వైసిపి ప్రభుత్వం సహకరించడంతో విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అతిరథ మహారధులందరికీ ఆహ్వానాలు పంపారు. చివరకు చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ కు ఆహ్వానించినట్లు చెప్పుకొచ్చారు. ఎంత చేసినా జనాలను సమీకరించడంలో ఫెయిల్ అయ్యారు. వేడుకలకు మంత్రులు జోగి రమేష్, అంబటి రాంబాబు హాజరైనా జనాలు రాకపోవడంతో రాంగోపాల్ వర్మ కు చుక్కెదురు అయ్యింది.
ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో వేలాది కుర్చీలను వేశారు. ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీ సెట్ వేశారు. సాయంత్రం నాలుగు గంటలకు ఈవెంట్ ప్రారంభమవుతుందని ప్రకటించారు. కానీ జనాలు వందల్లో కూడా లేకపోవడంతో రాత్రి 8 గంటల వరకు మొదలుపెట్టలేకపోయారు. జనాలను తరలించాలని వైసీపీ నాయకులు చేయని ప్రయత్నం లేదు. అయితే ఇలా వచ్చిన వారు అలా వెళ్ళిపోవడం కనిపించింది. ఆటోలు, కార్లను పెట్టి జనాలను తరలించాలని ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. చివరికి కాళీ కుర్చీలు కనిపించకుండా ఉండేందుకు స్టేడియంలోనే లైట్లను ఆపేశారు. చీకటిలోనే కార్యక్రమాన్ని పూర్తిచేసి మామ అనిపించేశారు. ఈ సినిమాలో చంద్రబాబును విలన్ గా చూపించే ప్రయత్నం జరిగింది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ లోకేష్ కోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలోనే కోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే అడుగడుగునా వ్యూహం సినిమాకు అడ్డుకట్టపడుతుండడం విశేషం.