https://oktelugu.com/

విషం తాగి పర్వాలేదు అన్న మహా నటుడు !

తెలుగు సినిమా చరిత్రలో లిఖించబడే అరుదైన మహా నటులలో నవరస నటనా సార్వభౌమ ‘కైకాల సత్యనారాయణ’ పేరు కూడా తప్పక ఉంటుంది. నవరసాల నటచక్రవర్తిగా కైకాల, తానూ నటించిన ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, అందరి మన్ననలు పొందిన మేటి నటుడు. అది 1950 నాటి కాలం, ఎన్టీఆర్ లా ఉన్నావ్ అని అందరూ అంటుంటే.. కైకాల ఎలాగైనా తాను నటుడు అవ్వాలని మద్రాసు పయనం అయిన రోజులు అవి. మద్రాసు వచ్చిన తరువాత తినడానికి […]

Written By:
  • admin
  • , Updated On : May 16, 2021 / 06:48 PM IST
    Follow us on

    తెలుగు సినిమా చరిత్రలో లిఖించబడే అరుదైన మహా నటులలో నవరస నటనా సార్వభౌమ ‘కైకాల సత్యనారాయణ’ పేరు కూడా తప్పక ఉంటుంది. నవరసాల నటచక్రవర్తిగా కైకాల, తానూ నటించిన ప్రతి పాత్రలో పరకాయ ప్రవేశం చేసి, అందరి మన్ననలు పొందిన మేటి నటుడు. అది 1950 నాటి కాలం, ఎన్టీఆర్ లా ఉన్నావ్ అని అందరూ అంటుంటే..

    కైకాల ఎలాగైనా తాను నటుడు అవ్వాలని మద్రాసు పయనం అయిన రోజులు అవి. మద్రాసు వచ్చిన తరువాత తినడానికి కూడా తిండి లేక, మరోపక్క సినిమాల్లో అవకాశాలు దొరక్క, కైకాల చాలా ఇబ్బందలు పడ్డారు. గుడివాడ నుంచి మద్రాసు వచ్చినప్పుడు ఆయనలో ఉన్న నమ్మకం రోజులు గడిచేకొద్దీ సడలిపోతూ ఉంది. వేషాల కోసం ఎంత ప్రయత్నించిన సత్యనారాయణకు నిరాశే ఎదురవుతూ వచ్చింది.

    చివరకు కె.వి.రెడ్డి లాంటి మహామహులు కూడా నువ్వు పనికి వస్తావు అని అభయం ఇచ్చారే గానీ, వేషాలు మాత్రం ఇవ్వలేకపోయారు. దాదాపు సంవత్సరం పాటు అవకాశాల కోసం తిరిగి తిరిగి సత్యనారాయణ విసిగిపోయారు. ఒక్కరు కూడా ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు అంటేనే, నిజంగా ఆశ్చర్యం కలుగుతుంది. అంత గొప్ప నటుడికి చిన్న వేషం దక్కలేదంటే.. ఒక్కోసారి కాలం ఎంత కఠినంగా ఉంటుందో కదా అనిపిస్తోంది.

    తనకు అవకాశాలు రావట్లేదు అనే బాధలో ఉన్న సత్యనారాయణ, ఓ రోజు ఆ నిరాశలో హోటల్‌‌కు వెళ్లి ఎదో ఆలోచిస్తూ సరిగ్గా చూసుకోకుండానే కాఫీ తాగారు. అయితే, ఆ కాఫీ కప్పు అడుగున చచ్చిన సాలీడు కనిపించడంతో అక్కడున్న ‘సత్యనారాయణ స్నేహితులంతా’ కంగారు పడటం మొదలుపెట్టారు. సాలీడు అంటే కచ్చితంగా విషం ఉంటుంది, ప్రాణాలకే ప్రమాదం, డాక్టర్‌ దగ్గరకు వెళ్లమని అందరూ ఒత్తిడి చేశారు.

    ‘చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇక డాక్టర్ దగ్గరకు ఏమి వెళ్తాం అనుకున్నారు మనసులో సత్యనారాయణ. అందుకే, ఆయన ఎలాంటి కంగారు పడకుండా ‘పర్వాలేదు, తెల్లారాక కూడా నేను బతికి ఉంటే, నాకు ఈ సినిమా ఇండస్ట్రీలో భవిష్యత్తు ఉన్నట్లు, ఒకవేళ చస్తే ఇక ఏ గొడవ లేదు’ అని చెప్పి రూమ్‌‌కు వెళ్లి పడుకున్నారు. కట్ చేస్తే తెల్లారింది. కొంతకాలానికి సత్యనారాయణకి అవకాశాలు వచ్చాయి, తెలుగు వెండితెరకు మరో నిండైన నటుడు దొరికాడు అని పొగడ్తలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దట్ ఈజ్ కైకాల.