Indra re-release : టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ ని స్టార్ హీరోల అభిమానులు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఒకప్పుడు కొత్త సినిమాల రికార్డ్స్ కోసం కొట్టుకునే అభిమానులు ఇప్పుడు రీ రిలీజ్ రికార్డ్స్ కోసం కొట్టుకుంటున్నారు. సోషల్ మీడియా లో ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. అయితే రీ రిలీజ్ రికార్డ్స్ సృష్టించడం, దాన్ని బద్దలు కొట్టడం పవన్ కళ్యాణ్ , మహేష్ బాబు అభిమానులకు అలవాటుగా మారిపోయింది. మిగిలిన హీరోలెవ్వరూ కూడా కనీసం వీళ్లిద్దరికీ పోటీ ఇవ్వలేకపోతున్నారు. కెరీర్ ప్రారంభంలో ఈ ఇద్దరు హీరోలకు పడిన ఆల్ టైం క్లాసిక్స్ అలాంటివి మరి. అయితే మెగాస్టార్ చిరంజీవి కూడా రీసెంట్ గా ఇంద్ర సినిమాతో రికార్డ్స్ సృష్టించి, నేటి తరం హీరోలకు తాను పోటీ ఇవ్వగలను అని మరోసారి నిరూపించుకున్నాడు.
రీ ఎంట్రీ తర్వాత మూడు సార్లు వంద కోట్ల రూపాయిల షేర్ ని అవలీలగా కొల్లగొట్టిన ఆయన, ఇప్పుడు రీ రిలీజ్ చిత్రంతో కూడా పలు ప్రాంతాలలో ఆల్ టైం రికార్డ్స్ ని నెలకొల్పాడు. ప్రపంచవ్యాప్తంగా మూడు కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓవర్సీస్ లో మాత్రం కోటి రూపాయలకు పైగా గ్రాస్ ని రాబట్టి ఆల్ టైం రికార్డు నెలకొల్పింది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి కేవలం నార్త్ అమెరికా నుండి 61 వేల డాలర్లు వచ్చాయి. ఈ సినిమా తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మురారి చిత్రం 60,144 డాలర్ల గ్రాస్ తో రెండవ స్థానంలో కొనసాగుతుండగా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి చిత్రం 59,843 డాలర్ల గ్రాస్ తో మూడవ స్థానంలో ఉంది. అలాగే సీనియర్ హీరో అయిన బాలయ్య బాబు కూడా నేటి తరం హీరోలతో రీ రిలీజ్ రికార్డ్స్ లో కూడా పోటీ పడగలను అని నిరూపించుకున్నాడు. ఆయన నటించిన చెన్నకేశవ రెడ్డి చిత్రం నార్త్ అమెరికాలో 51,129 డాలర్ల గ్రాస్ తో నాల్గవ స్థానంలో కొనసాగుతుంది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘జల్సా’ చిత్రం రీ రిలీజ్ ట్రెండ్ ప్రారంభమైన కొత్తల్లో వచ్చింది. అప్పట్లో ఈ చిత్రం 37,973 డాలర్ల గ్రాస్ తో ఆల్ టైం రికార్డు నెలకొల్పగా, ప్రస్తుతానికి 5 వ స్థానంలో కొనసాగుతుంది. అలాగే మహేష్ బాబు బిజినెస్ మెన్ చిత్రం 27,390 డాలర్ల గ్రాస్ వసూళ్లతో ఆరవ స్థానంలో కొనసాగుతుండగా, పవన్ కళ్యాణ్ ఖుషి చిత్రం 24,296 డాలర్లతో ఏడవ స్థానంలో కొనసాగుతుంది.
వాస్తవానికి ఖుషి చిత్రం రెగ్యులర్ గా రీ రిలీజ్ చిత్రాలు విడుదలయ్యే సినీ మార్క్, రెగల్ థియేటర్స్ లో విడుదల అవ్వలేదు. అమెరికాలో ఉండే సింగల్ స్క్రీన్స్ లో విడుదలైంది. ఇలాంటి థియేటర్స్ లో అక్కడి ఆడియన్స్ కొత్త సినిమాలను చూసేందుకు కూడా ఇష్టపడరు, అయిన కూడా ఖుషి ఆస్థాయిలో వసూళ్లను రాబట్టడం చిన్న విషయం కాదు. ఇక 8 వ స్థానంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి చిత్రం 15,846 డాలర్ల గ్రాస్ వసూళ్లు రాబట్టగా, ప్రభాస్ బిల్లా చిత్రం 13,581 గ్రాస్ వసూళ్లతో 9 వ స్థానంలో కొనసాగుతుంది. మరి సెప్టెంబర్ 2 వ తారీఖున విడుదల అవ్వబోయే గబ్బర్ సింగ్ రీ రిలీజ్ తో పవన్ కళ్యాణ్ అభిమానులు ఆల్ టైం రికార్డుని నెలకొల్పుతారో లేదో చూడాలి.