Pavitra Jayaram : త్రినయని ఫేమ్ పవిత్ర జయరాం అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. మే 12 తెల్లవారుజామున మహబూబ్ నగర్ జిల్లా సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె మరణించడం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. అభిమానులు, తోటి నటులు, కుటుంబ సభ్యులను ఆమె హఠాన్మరణం కలచివేస్తుంది. అయితే పవిత్ర జయరాం యాక్సిడెంట్ వల్ల చనిపోలేదట. ఆమె మరణం వెనకున్న అసలు కారణం బయటపెట్టాడు భర్త చంద్ర కాంత్.
పవిత్ర భర్త మాట్లాడుతూ .. బెంగళూరులో భారీ వర్షం కారణంగా ట్రాఫిక్ జామ్ కావడంతో మూడు గంటలు ఆలస్యంగా బయలుదేరామని చంద్రకాంత్ అన్నారు. మహబూబనగర్ చేరుకునే సరికి సోమవారం అర్ధరాత్రి అయింది. రోడ్డు ప్రమాదం జరిగిన సమయంలో కారులో తాను, పవిత్ర, ఆమె కూతురు, మరో అమ్మాయి ఉన్నాము. క అర్ధరాత్రి 12. 30 గంటల సమయంలో ఓ ఆర్టీసీ బస్సు తమ కారును ఓవర్ టేక్ చేసే ప్రయత్నం చేసింది.
ఈ క్రమంలో డ్రైవర్ కారును కుడివైపుకు తిప్పడంతో అది డివైడర్ ఢీకొట్టింది. దీంతో కారు ముందు వైపు ఉన్న అద్దం పగిలింది. తనకు తప్ప ఎవరికీ గాయాలు కాలేదని చంద్రకాంత్ అన్నారు. తనను గాయాలతో చూసిన పవిత్ర షాక్ కి గురైందని, దీంతో ఆమెకు స్ట్రోక్ వచ్చిందని ఆయన చెప్పారు. వెంటనే అంబులెన్స్ కి ఫోన్ చేశామని .. కానీ అంబులెన్స్ 20 నిమిషాలు లేట్ గా వచ్చిందని వేదన చెందాడు.
ఒకవేళ టైం కి వచ్చి ఉంటే తన భార్యను కాపాడుకునే వాడిని అని కన్నీరు మున్నీరు అయ్యాడు చంద్రకాంత్. గాయాల కారణంగా తాను స్పృహ కోల్పోయానని .. హాస్పిటల్ కి చేరుకునే సరికి ఒంటిగంట అయిందని అన్నారు. ఇక తెల్లవారుజామున నాలుగు గంటలకు స్పృహలోకి వచ్చానని అప్పుడే పవిత్ర చనిపోయిన విషయం తెలిసిందని చంద్రకాంత్ తీవ్ర భావోద్వేగానికి గురైయ్యాడు. రోడ్డు ప్రమాదంలో ఎలాంటి గాయాలు కానప్పటికీ .. గుండెపోటుతో పవిత్ర మరణించింది అని చెప్తూ ఎమోషనల్ అయ్యారు.