AP Politics : గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో ఈసారి హింస చెలరేగింది. పోలింగ్ రోజున హింసాత్మక ఘటనలు జరిగాయి.పోలింగ్ ముగిసిన రెండు రోజులు వరకు అలానే కొనసాగాయి. పోలీస్ బలగాలు మొహరించినా దాడులను మాత్రం ఆపలేకపోయారు. ముఖ్యంగా పల్నాడు జిల్లాలోని మాచర్ల, గురజాల, నరసరావుపేటలో చెలరేగిన హింసతో చివరకు ఎమ్మెల్యేలను గృహనిర్బంధం చేయాల్సి వచ్చింది. రాయలసీమలోని తిరుపతి తో పాటు అనంతపురంలో కూడా అదే పరిస్థితి.
ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేకుండా చేయాలన్నది ఎలక్షన్ కమిషన్ ప్రథమ లక్ష్యం. కానీ గతంలో ఎన్నడూ లేనివిధంగా ఏపీలో హింస రేగడాన్ని ఈసీ సీరియస్ గా తీసుకుంది. ఎన్నికల తరువాత విత్తల విడిగా దాడులు జరుగుతుంటే ఏం చేస్తున్నారంటూ.. ఏకంగా సిఎస్, డీజీపీ లను ఈసీ ప్రశ్నించింది. దాడులను అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని వారికి సమన్లు ఇచ్చింది. దీంతో సిఎస్ జవహర్ రెడ్డి తో పాటు డిజిపి హరీష్ కుమార్ గుప్తా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. సిఇసి రాజీవ్ కుమార్ ముందు హాజరై ఏపీలో పరిస్థితిని వివరించనున్నారు.
కాగా ఏపీలో పరిస్థితులపై ఆ ఇద్దరు ఏం నివేదిక ఇస్తారన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇందులో సి ఎస్ జవహర్ రెడ్డి వైసీపీకి అనుకూలమైన అధికారిగా పేరుంది. ఆయనను మార్చాలని టిడిపి నుంచి ఫిర్యాదులు ఈసీకి వెళ్లాయి. కానీ ఎలక్షన్ కమిషన్ మాత్రం కొనసాగించింది. టిడిపి నుంచి వచ్చిన ఫిర్యాదులతో డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి పై వేటు వేసింది. హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ఒకవైపు సిఎస్ జవహర్ రెడ్డి వైసీపీ అనుకూల అధికారి కావడం, మరోవైపు హరీష్ కుమార్ గుప్తా ఇటీవలే నియమితులు కావడం, ఆయనకు ఏపీ ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం దక్కలేదన్న ఆరోపణలు ఉండడంతో.. ఎలక్షన్ కమిషన్ ఎదుట ఏ అంశాలను వీరిద్దరూ ప్రస్తావిస్తారో ఆసక్తికరంగా మారింది. మొత్తానికైతే అటు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, ఇటు డిజిపి లు వేర్వేరు నివేదికలు ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఎలక్షన్ కమిషన్ సీరియస్ యాక్షన్కు దిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.