Ram Gopal
Ram Gopal Varma : ప్రముఖ సినీ దర్శకుడు రాంగోపాల్ వర్మ కి వివాదాలు కొత్తేమి కాదు. ఎప్పుడూ ఎదో ఒక వార్తలో ట్రెండ్ అవుతూ ఉంటాడు. 2018 వ సంవత్సరంలో ఇతని పై చెక్ బౌన్స్ కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసు పై నేడు ముంబై లోని అంథేరీ కోర్టు రామ్ గోపాల్ వర్మ ని దోషిగా నిర్థారించి 3 నెలల జైలు శిక్ష విధించింది. మహేష్ చంద్ర అనే వ్యక్తి రామ్ గోపాల్ వర్మ పై 2018 వ సంవత్సరం లో తనని మోసం చేసారని, రామ్ గోపాల్ వర్మ తనకి ఇచ్చిన చెక్ బౌన్స్ అయ్యిందంటూ ఫిర్యాదు చేసాడు. అప్పటి నుండి ఈ కేసు విచారణపై రామ్ గోపాల్ వర్మ ని అనేకసార్లు విచారణకు హాజరు కావాలని కోర్టు ఆదేశించగా ఆయన హాజరు కాలేదు. దీంతో ఆగ్రహించిన కోర్టు, రామ్ గోపాల్ వర్మ కి నాన్ బెయిలబుల్ వారంటీ జారీ చేసింది.
ఫిర్యాదు చేసిన మహేష్ చంద్ర అనే వ్యక్తి కి 3 నెలల్లోపు 3 లక్షల 72 వేల రూపాయిలు చెల్లించాలని, లేని పక్షంలో మూడు నెలలు జైలు శిక్ష అనుభవించాలి అంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో రామ్ గోపాల్ వర్మ ఇప్పుడు చిక్కుల్లో పడ్డాడు. కోట్ల రూపాయిలు సంపాదించే రామ్ గోపాల్ వర్మ కి కేవలం మూడు లక్షల రూపాయిలు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. కానీ ఆయన కోర్టు లో తుది తీర్పు వచ్చే వరకు ఈ విషయాన్ని తెచ్చుకోవడం, ఒక్కసారి కూడా విచారణకు కోర్టుకి రాకపోవడం వంటివి చూస్తుంటే ఆయన యాటిట్యూడ్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. జీవితం లో రామ్ గోపాల్ వర్మ పోలీస్ స్టేషన్ మెట్లు కానీ, కోర్టు మెట్లు కానీ ఎక్కకూడదు అనే భీష్మించి కూర్చున్నాడా? అంటే ఆయన చర్యలు చూస్తుంటే అవుననే చెప్పాలి.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ వంటి ప్రముఖులపై గతంలో ఆయన తన సోషల్ మీడియా లో మార్ఫింగ్ చేస్తూ కొన్ని ఫోటోలను సోషల్ మీడియా లో అప్లోడ్ చేశాడు. ఇది సీరియస్ గా తీసుకుంటే చాలా పెద్ద కేసు అవుతుంది. ఎంత పెద్దవారైనా అరెస్ట్ అవ్వాల్సిందే. ఒంగోలు పోలీసులు దీనిని చాలా సీరియస్ గా తీసుకొని రామ్ గోపాల్ వర్మ ని అరెస్ట్ చేసేందుకు ఇంటికి వెళ్లారు. కానీ అరెస్ట్ చేయలేకపోయారు. దీనిని బట్టీ చూస్తే రామ్ గోపాల్ వర్మ కి ఉన్న నెట్వర్క్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం లో ఉన్నవారే ఆయన్ని లోపల వేయలేకపోయారు. అయితే ఇప్పుడు ఆయన అంథేరీ కోర్టు ఇచ్చిన తీర్పు ని అంగీకరించి ఫిర్యాదుదారునికి డబ్బులు ఇస్తాడా?, లేదా తన పంతం నెగ్గించుకోవడానికి సుప్రీమ్ కోర్టుకి వెళ్తాడా అనేది చూడాలి.