CM Chandrababu(10)
CM Chandrababu: ఏపీ సీఎం చంద్రబాబు( Chandrababu) జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారా? మోడీ క్యాబినెట్లో చేరుతారా?.. ఓ విదేశీ ప్రతినిధి నుంచి వచ్చిన ప్రశ్న ఇది. ప్రస్తుతం సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనలో ఉన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగు రోజుల కిందట మంత్రులు నారా లోకేష్, భరత్ తదితరుల తో కూడిన బృందం దావోస్ వెళ్ళింది. అక్కడ సీఎం చంద్రబాబు వరుసగా పారిశ్రామిక దిగ్గజాలతో భేటీలు జరుపుతున్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అనుకూల మార్గాలను, అంశాలను వారికి వివరించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ ప్రవాస ఆంధ్రులతో సైతం ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. గ్లోబల్ లీడర్లుగా ఎదగాలని.. కానీ అదే సమయంలో మాతృ రాష్ట్రానికి కూడా సహాయపడాలని చంద్రబాబు ఆకాంక్షించారు. అయితే బ్లూమ్బెర్గ్ ప్రతినిధి ఒక్కరు విచిత్రమైన ప్రశ్న వేశారు చంద్రబాబుకు. మోడీ క్యాబినెట్లో చేరుతారా? అంటూ ప్రశ్న వేశారు. అయితే ప్రస్తుతం ఏపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలతో ఈ ప్రశ్న సింక్ అయ్యింది. లోకేష్ కు రాష్ట్ర పాలనాపగ్గాలు అప్పగించి.. చంద్రబాబు జాతీయ రాజకీయాల్లోకి వెళ్తారన్నది కొత్త చర్చకు దారితీసింది. అయితే దీనిని ముందే గ్రహించిన చంద్రబాబు తనదైన రీతిలో సమాధానం చెప్పారు.
* ఏపీ అభివృద్ధి తన ధ్యేయం
విదేశీ కంపెనీల ప్రతినిధులతో చంద్రబాబు( Chandrababu) సుదీర్ఘంగా భేటీ అవుతూ వచ్చారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని దేశం ఎంతగానో అభివృద్ధి చెందుతుందని.. ఏపీలో పెట్టుబడులు పెడితే ప్రభుత్వపరంగా అన్ని విధాలుగా చేయూతనందిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. కేంద్రంలో మోదీ.. ఏపీలో కూటమి ప్రభుత్వం సుదీర్ఘకాలం కొనసాగుతుందని చెప్పుకొచ్చారు. అయితే తన ధ్యాసంతా ఏపీ అభివృద్ధి పైనేనని.. ఇప్పటికే మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో తమ పార్టీ ఎంపీలు భాగస్వామ్యం అయ్యారని.. వారి పని వారు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. తద్వారా తాను కేంద్ర రాజకీయాల్లోకి వెళ్లడం లేదని సంకేతాలు ఇచ్చారు.
* చంద్రబాబు పూర్తి స్పష్టత
చంద్రబాబు అప్పటికప్పుడు స్పష్టత ఇవ్వకుంటే మాత్రం దీనిపై మరింత దుమారం రేగే అవకాశం ఉండేది. ఈ దేశానికి మూడోసారి ప్రధాని అయ్యారు నరేంద్ర మోడీ( Narendra Modi). ఆయన చంద్రబాబు కంటే జూనియర్. అయితే చంద్రబాబు కేంద్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ నేత. ఏపీకి ముఖ్యమంత్రిగా ఉంటూ కేంద్రంలోని సంకీర్ణ ప్రభుత్వాల సారధిగా కూడా ఉండేవారు. అయితే గుజ్రాల్ తో పాటు హెచ్డి దేవ గౌడ ప్రధానిగా పదవి బాధ్యతలు స్వీకరించడం వెనుక చంద్రబాబు కృషి ఉంది. 1995లో చంద్రబాబు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. కానీ ఆ సమయంలో ప్రధాని మోదీ బిజెపిలో సాధారణ నేత. అటు తరువాత గుజరాత్ లో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభం అయింది. ఆ రాష్ట్రానికి సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా వ్యవహరించారు.
* ఆదిలోనే వివాదానికి తెర
మోడీ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్లో చంద్రబాబు చేరడం అనేది ఊహాజనిత ప్రశ్న. అది లేవనెత్తింది ఒక విదేశీ ప్రతినిధి. అయితే చంద్రబాబు తనయుడు లోకేష్ కు( Nara Lokesh) ఏపీ డిప్యూటీ సీఎం పోస్టు ఇవ్వాలన్న డిమాండ్ వివాదానికి దారితీసింది. అయితే అంతర్జాతీయ సదస్సు సమయంలో ఉండగా ఇదే తరహా అంశాన్ని తెరపైకి తెచ్చారు మంత్రి టీజీ భరత్. లోకేష్ ను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేయాలన్నది ఆయన వ్యక్తిగత అభిప్రాయం. అది ఇంకా దుమారానికి దారితీసింది. సరిగ్గా ఇదే సమయంలో ఒక విదేశీ ప్రతినిధి.. కేంద్ర క్యాబినెట్ లోకి వెళ్ళవచ్చు కదా అని చంద్రబాబును అడగడం ద్వారా.. ఇంకా అనేక రకాల అనుమానాలు వచ్చేలా చిన్నపాటి ప్రశ్న వేశారు. అయితే దానికి ఆదిలోనే చెప్పారు చంద్రబాబు. తన అదృష్టంతా ఏపీపైనేనని తేల్చి చెప్పారు. తనకు ఇంకా రాజకీయ ఆశలు లేవని కూడా చెప్పుకొచ్చారు. మొత్తానికి అయితే చంద్రబాబు ఆదిలోనే ఒక వివాదాన్ని తుంచేశారు.