దర్శక ధీరుడు రాజమౌళి మనసు మార్చుకున్నట్లు సమాచారం. తన ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను వచ్చే సంవత్సరం విడుదల చేయాలని అనుకున్నారు. కానీ ఇప్పుడు దానిపై పునరాలోచనలో పడిపోయినట్టు సమాచారం.
ఇప్పుడు భారతదేశంలో థియేట్రికల్ వ్యాపారం ఇంకా ప్రారంభం కాలేదు. కానీ సినిమా పరిశ్రమ మాత్రం ఆశాజనకంగా ఉంది. హాలీవుడ్ బిగ్గెస్ట్ సినిమా ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 9’ ఆగస్టు 5న భారతదేశంలో విడుదలవుతోంది.
ప్రస్తుతం ఉన్న కోవిడ్ 19 షరుతల కారణంగా ‘ఆర్ఆర్ఆర్’ను వచ్చే ఏడాది వాయిదా వేయాలని రాజమౌళి భావించాడు. అకస్మాత్తుగా ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి చేస్తున్నాడట.. ఈ చిత్రం అక్టోబర్ 13న అనుకున్న మునుపటి డేట్ కే విడుదల చేయాలని రాజమౌళి ఫిక్స్ అయినట్టు సమాచారం.
ఈ క్రమంలోనే ఈ వారం మేకింగ్ వీడియోను విడుదల చేస్తున్నారు. రాజమౌళి అన్ని వర్గాల నుంచి ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సినిమా ప్రేక్షకులతోపాటు హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ లు కూడా కొత్త సినిమా ప్రాజెక్టుల్లోకి వెళ్తామని.. త్వరగా ఆర్ఆర్ఆర్ నుంచి రిలీజ్ చేయాలని రాజమౌళిపై ఒత్తిడి తీసుకొస్తున్నారట..
ఇక విదేశీ పంపిణీదారులు సైతం ‘ఆర్ఆర్ఆర్’ విడుదల తేదీ గురించి అడుగుతున్నారట..ఇప్పటికే భారీ మొత్తాలను చెల్లించాయి విదేశీ పంపిణీ సంస్థలు.. 2019లోనే కంపెనీ ఈ ఒప్పందాన్ని ముగించింది.
రాజమౌళి తన తదుపరి చిత్రాన్ని మహేష్ బాబుతో 2022లో ప్రారంభించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ‘ఆర్ఆర్ఆర్’ ప్రాజెక్టును రిలీజ్ చేసి అందులోంచి బయటపడాల్సిన అవసరం ఉంది. 2021 అక్టోబర్ లోనే ‘ఆర్ఆర్ఆర్’ విడుదలకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది.
అయితే కోవిడ్ మళ్లీ థర్డ్ వేవ్ గా మారుతుందా? పరిస్థితులు అనుకూలిస్తాయా? సినిమా మార్కెట్ సాధారణ స్థితికి చేరుకుంటుందా? అనే దానిపై ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ ఆధారపడి ఉంది. కోవిడ్ 19 సంక్షోభం ఎప్పుడు విరుచుకుపడినా సినిమాలు ఆగిపోవడం ఖాయం. కేసులు ఎప్పుడైనా పెరగవచ్చు. అందువల్ల రాజమౌళి ప్రణాళికలు కూడా కరోనా పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి.