Telugu Serial Actres: నేటి కాలంలో సోషల్ మీడియా ద్వారా మంచి పనుల కంటే చెడు పనులు చేసే వారి సంఖ్యనే ఎక్కువగా ఉంటున్నది. సోషల్ మీడియాను నియంత్రించే సామర్థ్యం ప్రభుత్వ వ్యవస్థలకు లేకపోవడంతో.. కొంతమంది దుర్మార్గులు సోషల్ మీడియాను వేదికగా చేసుకొని అడ్డగోలు పనులు చేపడుతున్నారు. అయితే ఈ దుర్మార్గుల వల్ల సామాన్యులే కాదు సెలబ్రిటీలు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. కొందరైతే తట్టుకోలేక తమ సామాజిక మాధ్యమాల ఖాతాలను కూడా రద్దు చేసుకుంటున్నారు. ఇలా సోషల్ మీడియా ద్వారా ఓ దుర్మార్గుడు చేసిన పని పెను సంచలనమైంది. ఒక సీరియల్ నటి జీవితాన్ని మొత్తం మార్చేసింది.
ఆమె ఓ తెలుగు యువతి. కన్నడ కూడా బాగా మాట్లాడుతుంది. తెలుగులో కొన్ని సీరియల్స్ లో నటించింది. విపరీతమైన పాపులారిటీ రావడంతో.. కన్నడ టీవీ పరిశ్రమలో కూడా అడుగుపెట్టింది. తెలుగులోనే కాకుండా కన్నడలో కూడా అనేక సీరియల్స్ లో నటించింది. నటిస్తూనే ఉంది. అయితే అటువంటి ఆ నటికి ఇటీవల సోషల్ మీడియాలో వేధింపులు పెరిగిపోయాయి. ముఖ్యంగా నవీన్ అనే ఒక వ్యక్తి నుంచి ఆమెకు ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. దానిని ఆమె రిజెక్ట్ చేసింది. దీంతో అతడు అనేక ఖాతాలను సృష్టించి ఆమెకు అసభ్యకరమైన సందేశాలను పంపడం మొదలుపెట్టాడు. అశ్లీలమైన ఫోటోలను పంపించేవాడు.
మొదట్లో ఈ విషయాన్ని ఆ నటి అంతగా పట్టించుకునేది కాదు. క్రమేపీ అతని వేధింపులు పెరగడం మొదలయ్యాయి. దీంతోపాటు అతడు రకరకాల వేదికల నుంచి ఆమెను ఇబ్బంది పెట్టేవాడు. తట్టుకోలేక ఆమె కర్ణాటకలోని అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీసులను ఆశ్రయించారు. అతడు తనను ఇబ్బంది పెడుతున్న విధానాన్ని పోలీసులకు ఆధారాలతో సహా వివరించారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ సాగిస్తున్నారు. వాస్తవానికి ఆ వ్యక్తి పేరు అది కాదని.. దొంగ పేర్లతో ఖాతాలను సృష్టించి సెలబ్రిటీలను వేధిస్తున్నాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ నటి అందించిన ఆధారాల ప్రకారం ఆ వ్యక్తికి అనేక ఖాతాలు ఉన్నట్టు తెలిసింది. అతడు పంపించిన ఫోటోలు.. లోకేషన్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు చెప్తున్నారు.