Gayathri Gupta: మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలపై జరుగుతున్న అన్యాయాలపై అధ్యయనం చేసేందుకు, అక్కడి ప్రభుత్వం జస్టిస్ హేమ కమిటీని ఏర్పాటు చేసింది. సుదీర్ఘ కాలం పలువురు నటులను సంప్రదించిన హేమ కమిటీ ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. మాలీవుడ్ లో మహిళలకు రక్షణ లేదు. లైంగిక వేధింపులు, దాడులకు పాల్పడుతున్నారు. క్యాస్టింగ్ కౌచ్ తీవ్ర స్థాయిలో ఉంది.
అవకాశాలు పోతాయని, కెరీర్ ఉండదని భయపడుతున్న నటీమణులు తమపై జరిగిన లైంగిక దాడులను బయటపెట్టడం లేదు. అవకాశాల విషయంలో మహిళలకు అన్యాయం జరుగుతుందని హేమ కమిటీ షాకింగ్ ఫ్యాక్ట్స్ వెలుగులో తెచ్చింది. హేమ కమిటీ నివేదిక అనంతరం కొందరు నటీమణులు బయటకు వచ్చారు. తమను లైంగికంగా వేధించిన ప్రముఖుల పేర్లు వెల్లడించారు.
తాజాగా టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. తన అసిస్టెంట్ పై అతడు చాలా కాలంగా లైంగిక దాడులకు పాల్పడినట్లు సమాచారం. అవుట్ డోర్ షూటింగ్స్ కి వెళ్ళినప్పుడు, అలాగే తన నివాసంలో పలుమార్లు జానీ మాస్టర్ తనపై లైంగిక దాడి చేశాడని యువతి ఫిర్యాదులో పేర్కొంది. జానీ మాస్టర్ పై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
ఫిల్మ్ ఛాంబర్ సైతం 90 రోజుల్లో జానీ మాస్టర్ ఉదంతం పై విచారణ చేపట్టి, ఒక నిర్ణయానికి వస్తామని వెల్లడించడమైంది. క్యాస్టింగ్ కౌచ్ పై మొదటి నుండి పోరాటం చేస్తున్న తెలుగు అమ్మాయిల్లో గాయత్రి గుప్తా ఒకరు. గతంలో ఆమె పలు ఇంటర్వ్యూలలో టాలీవుడ్ లో క్యాస్టింగ్ కౌచ్ ఉంది. ఆఫర్ కావాలంటే కమిట్మెంట్ ఇవ్వాల్సిందే అని వాపోయారు.
తాజాగా ఆమె టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా క్యాస్టింగ్ కౌచ్ ఉందని తెలియజేసింది. నాకు ఓ బాలీవుడ్ మూవీలో ఆఫర్ రాగా.. వాళ్ళను కలిసేందుకు వెళ్ళాను. 12 రోజులు మాతో గడిపితే ఒక ఫ్లాట్, కారు, రూ. 10 లక్షలు నీకు ఇస్తామని అన్నారు. నేను అక్కడి నుండి వచ్చేశాను, అని గాయత్రీ గుప్తా తనకు ఎదురైన చేదు అనుభవాన్ని గుర్తు చేసుకుంది.
పూనమ్ కౌర్ దర్శకుడు త్రివిక్రమ్ పై నేరుగా ఆరోపణలు చేయడం కూడా సంచలనం రేపుతోంది. గతంలో త్రివిక్రమ్ పై పూనమ్ కౌర్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేస్తే స్వీకరించలేదని ఆమె అన్నారు. పైగా తనకు వేధింపులు ఎదురయ్యాయని అన్నారు. అప్పట్లో మా స్పందించి ఉంటే ఇప్పుడు జానీ మాస్టర్ లాంటి వాళ్ళు తప్పు చేసేవాళ్ళు కాదని, ఆమె వాపోయింది. పూనమ్ ఇప్పుడు ఫిర్యాదు చేసినా విచారణ చేపడతామని తమన్నా రెడ్డి భరద్వాజ్ చెప్పడం విశేషం.