https://oktelugu.com/

AP liquor policy : ఏపీలో చంద్రబాబు ఎంచుకున్న కొత్త మద్యం పాలసీ ఏంటి? ఏ బ్రాండ్ మద్యం అమ్ముతారంటే?

ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం కొత్త ఎక్సైజ్‌ పాలసీ అమలు చేయాలని నిర్ణయించింది. ఈమేరకు కొత్త పాలసీ రూపకల్పనకు కేబినెట్‌ సబ్‌ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటి వివిధ రాష్ట్రాల్లో అమలులో ఉన్న మద్యం పాలసీలను అధ‍్యయనం చేసింది. చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది.

Written By:
  • NARESH
  • , Updated On : September 18, 2024 / 10:30 AM IST

    AP Liquor Policy

    Follow us on

    AP liquor policy : ఆంధ్రప్రదేశ్‌లో నాలుగు నెలల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2019 నుంచి అధికారంలో ఉన్న వైసీపీ కేవలం 11 సీట్లకే పరిమితమై ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. 2019 నుంచి 2024 వరకు అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన ఎక్సైజ్‌ పాలసీని రద్దు చేయాలని కొత్త ప్రభుత్వం నిర్ణయించింది. దీనిస్థానంలో కొత్త పాలసీ తీసుకురావాలని నిర్ణయించింది. ఈమేరకు నూతన పాలసీ రూపొందించేందుకు ఎక్సైజ్‌ శాఖ మంత్రి నేతృత్వంలో సబ్‌ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటకలో అమలవుతున్న ఎక్సైజ్‌ పాలసీలను అధ్యయనం చేసింది. చివరకు ఓ నిర్ణయానికి వచ్చింది.

    తెలంగాణ పాలసీకే మొగ్గు..
    తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అమలు చేసిన మద్యం పాలసీనే ప్రస్తుతం అమలులో ఉంది. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌ ప్రభుత్వం కూడా దానినే అమలు చేస్తోంది. ఇప్పుడు ఇదే పాలసీని ఏపీలో యథావిధిగా అమలు చేయాలని ఏపీ మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది. సబ్‌ కమిటీ నిర్ణయాలు ఇలా ఉన్నాయి.

    – తెలంగాణ తరహాలోనే కలెక్టర్ల ద్వారా కొత్త మద్యం దుకాణాలకు లాటరీ పద్ధతిన కేటాయిస్తారు. ప్రైవేటు వ్యక్తులకే మద్యం షాపులు కేటాయిస్తారు. ప్రభుత్వం మద్యం షాపులు ఉండవు.

    – తెలంగాణలో దరఖాస్తులకు ఫీజు వసూలు చేస్తున్నట్లుగానే ఆంధ్రప్రదేశ్‌లో కూడా లాటరీలో పాల్గొనేందుకు దరఖాస్తు చేసుకునేవారి నుంచి ఫీజు వసూలు చేస్తారు. ఇది తిరిగి చెల్లించరు.

    – ప్రభుత్వమే మద్యం ధరలను నిర్ణయిస్తుంది. దాని ప్రకారమే మద్యం షాపుల్లో అమ్మకాలు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ కార్పొరేషన్‌ ద్వారానే మద్యం.. షాపులకు సరఫరా చేస్తారు.

    – కొత్త పాలసీ ప్రకారం నాణ్యమైన, బ్రాండెడ్‌ మద్యం అందుబాటులోకి తెస్తారు. గత ప్రభుత్వం నిర్ణయించిన ధర కన్నా తక్కువ ధరకే మద్యం అమ్మాలని కేబినెట్‌ సబ్‌కమిటీ నిర్ణయిచింది.

    – మద్యం షాపుల్లో తెలంగాణలో అమలు చేస్తున్నట్లుగానే ఏపీలోనూ గీత కార్మికులకు 10 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తారు.

    – మద‍్య నిషేధం క్రమంగా అమలు చేస్తామని చెప్పిన ప్రభుత్వం అధిక ధరలకు మద్యం అమ్మడంతో చాలా మంది గంజాయి, డ్రగ్స్‌కు అలవాటు పడ్డారని మంత్రివర్గ ఉప సంఘం అభిప్రాయపడింది. దీంతో నేరాలు పెరిగాయని పేర్కొంది. మద్యం అమ్మకాలను నియంత్రించడం, ధరలు పెంచడమే ఇందుకు కారణమని తెలిపింది.

    – మత్తుకు బానిసైన వారికోసం డీ అడిక్షన్‌ కేంద్రాలు ప్రతీ జిల్లాలో ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయించింది.

    – బుధ‌వారం నిర్వహించే ఏపీ మంత్రివర్గ సమావేశంలో కొత్త ఎక్సైజ్‌ పాలనీసై చర్చించి ఆమోదించే అవకాశం ఉంది. అక్టోబర్‌ 1 నుంచి కొత్త పాలసీ అమలు చేసే అవకాశాలు ఉన్నాయి.