తెలుగు రాష్ట్రాల్లో బిగ్ బాస్ ఫీవర్ మొదలైంది. సోషల్ మీడియాలో ఈ షో గురించి తెగ డిస్కషన్ నడుస్తోంది. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో.. 5వ సీజన్ కు రెడీ అవుతోంది. కరోనా లేకపోతే ఇప్పటికే స్టార్ట్ కావాల్సిన ఈ షో.. వాయిదాలు పడుతూ వస్తోంది. దీంతో.. ఎప్పుడు మొదలు పెడతారు? కంటిస్టెంట్స్ ఎవరు? హోస్ట్ ఎవరు? వంటి విషయాలు తెలుసుకునేందుకు ఆడియన్స్ చాలా ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం.. సెప్టెంబర్ 5వ తేదీ నుంచే ఈ సీజన్ ప్రారంభించబోతున్నట్టు తెలుస్తోంది. కంటిస్టెంట్స్ లిస్ట్ కూడా దాదాపు ఫైనల్ దశకు చేరుకుంది.
తెలుగు బిగ్ బాస్ షో తొలి సీజన్ 2017లో మొదలైంది. జూలై 16న ప్రారంభమైన ఈ గేమ్ షోలో.. దాదాపుగా ప్రముఖులే పాల్గొన్నారు. మొత్తం 16 మంది కంటిస్టెంట్లతో మొదలైన ఈ షోకు ఎంతో రెస్పాన్స్ వచ్చింది. మొత్తం 70 రోజులపాటు ఈ షో సాగింది. అద్దిరిపోయే టీఆర్పీ రేటింగులతో దూసుకెళ్లడంతో.. ఇక బిగ్ బాస్ షోకు తిరుగులేదని నిర్వాహకులు డిసైడ్ అయ్యారు. సీన్ కట్ చేస్తే.. ఇప్పటి వరకు నాలుగు సీజన్లు ముగిశాయి. అన్నీ.. సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఐదో సీజన్ మొదలు కాబోతోంది.
ఇప్పటికే.. సెట్ నిర్మాణం పూర్తయింది. కంటిస్టెంట్ల సెలక్షన్ కూడా ఫైనల్ స్టేజ్ కు చేరుకుంది. అయితే.. చాలా మంది పేర్లు వినిపిస్తున్నాయి. కానీ.. ఎవ్వరినీ ఇంకా ఫైనల్ చేయలేదు. నాలుగో సీజన్ కంటిస్టెంట్ల ఎంపికపై విమర్శలు వచ్చాయి. ఒకరిద్దరు తప్ప.. మిగిలిన వారంతా ఎవరో తెలియదని, అలాంటి వారిని తీసుకొచ్చి పెట్టారనే అభిప్రాయం వ్యక్తమైంది. సెలబ్రిటీ గేమ్ షో మాదిరిగా లేదని కూడా అన్నారు. దీన్ని బట్టి ఈ సారి కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.
ఐదో సీజన్ లో.. సినిమా, టీవీ, న్యూస్, సోషల్ మీడియా.. ఇలా అన్ని కేటగిరీల్లో ఫేమస్ అయిన వారిని తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సారి హీరోయిన్ ఈషా చావ్లా, హీరో అశ్విన్ బాబు ( రాజుగారి గది-3), సినీ నటి సురేఖ వాణి, డ్యాన్స్ మాస్టర్ శేఖర్, సింగర్ మంగ్లీ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక, బుల్లితెర విషయానికి వస్తే.. యాంకర్లు రవి, వర్షిణి, విష్ణు ప్రియ, నటులు నవ్యస్వామి, సిద్ధార్థ్ వర్మ ఉన్నట్టు సమాచారం. న్యూస్ యాంకర్ విభాగంలో ప్రత్యూష, సోషల్ మీడియా నుంచి టిక్ టాక్ దుర్గారావు, శణ్ముఖ్ జస్వంత్ తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి.
అంతేకాదు.. ఈ సారి హోస్ట్ కూడా మారుతున్నట్టు ప్రచారం సాగుతోంది. నాగార్జున ప్లేస్ లో రానా దగ్గుబాటి రావొచ్చని కూడా అంటున్నారు. మరి, ఇందులో వాస్తవం ఏంటి అన్నది చూడాలి. ప్రారంభం మాత్రం సెప్టెంబర్ 5 కన్ఫామ్ అని చెబుతున్నారు. త్వరలోనే ప్రోమో రిలీజ్ అవుతుందని చెబుతున్నారు.