Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ ఇండస్ట్రీపై హాట్ కామెంట్స్ చేశారు. సినిమాల అనుమతి కోసం తన వద్దకు రావొద్దని అన్నాడు. అలాగే డ్రగ్స్ నివారణ కోసం సామాజిక కార్యక్రమాలు చేయాలని అన్నాడు. సినీ పరిశ్రమ నుంచి డ్రగ్స్ వార్తలు వినిపించొద్దని, అలాంటి వార్తలు వస్తే సహించేది లేదన్నారు. సమాజంలో పెరిగిపోతున్న డ్రగ్స్ మాఫియాను అరికట్టేందుకు సినీ ఇండస్ట్రీ సహకారం అందించాలని అన్నారు. అలా చేస్తేనే సినీ పరిశ్రమకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు.
సమాజంలో జరిగే పరిస్థితులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి సినిమా ఇండస్ట్రీ ఎంతో తోడ్పడుతుంది. సాధారణ వ్యక్తుల కంటే సినిమా తారలు చెప్పిన విషయాలు కొందరు ఆసక్తిగా వింటారు. అయితే ఇటీవల కొందరు సినీ ఇండస్ట్రీకి చెందిన వారు డ్రగ్స్ తీసుకున్నారంటూ వార్తలు వచ్చాయి. అంతేకాకుండా ప్రతిరోజూ ఎక్కడో ఒక చోట డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడిన కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రగ్స్ ను నివారించేందుకు సినిమా సహకారం కూడా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి సినీ పరిశ్రమ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు. సినీ ఇండస్ట్రీకి చెందిన వారు వందల కోట్ల రూపాయలు తీసుకుంటున్నారు. ఇలాంటి వారు సమాజ సేవకు కలిసి రావాలని అన్నారు. ముఖ్యంగా సమాజంలో రోజురోజుకు పెట్రేగిపోతున్న డ్రగ్స్ నివారణకు సహకరించాలని అన్నారు. ఇందు కోసం సినిమా థియేటర్లలో ప్రత్యేక వీడియోలు తయారు చేయాలన్నారు. సినిమా ప్రారంభానికి ముందు డ్రగ్స్ పై అవగాహన వీడియోలు తయారు చేసి ప్రదర్శించాలని అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికే డ్రగ్స్ నివారణపై ఓ సందేశ వీడియోను పంపారని, వారిని అభినందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి తెలిపారు. మిగతా తారలు కూడా ఇలాంటి వీడియోలు తయారు చేసి ప్రచారం చేయాలన్నారు. సమాజం నుంచి సినిమా వాళ్లు ఎంతో తీసుకుంటున్నారని, వాళ్లు డ్రగ్స్ నివారణ కోసం సహకరించాలని కోరారు. త్వరలోనే తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ముందుకు రావాలని కోరారు.