TGSRTC: ఆర్టీసీలో కొలువులు.. నిరుద్యోగులు త్వరపడండి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి నోటిఫికేషన్‌కు అనుమతి ఇచ్చింది.

Written By: Raj Shekar, Updated On : July 2, 2024 4:47 pm

TGSRTC

Follow us on

TGSRTC: నిరుద్యోగులు ఎదురు చూస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్‌ ఆర్టీసీ)లో ఖాళీగా ఉన్న 3,035 ఉద్యోగాల భర్తీకి లైన్‌ క్లియర్‌ అయింది. పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ 3,035 పోస్టుల్లో 2 వేల డ్రైవర్, 743 శ్రామిక్, 114 డిప్యూటీ సూపరింటెండెంట్‌(మెకానిక్‌), 84 డిప్యూటీ సూపరింటెండెంట్‌(ట్రాఫిక్‌), 25 డిపో మేనేజర్‌/అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్, 23 అసిస్టెంట్‌ ఇంజనీర్‌(సివిల్‌), 15 అసిస్టెంట్‌ మెకానికల్‌ ఇంజనీర్, 11 సెక్షన్‌ ఆఫీసర్‌(సివిల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(జనరల్‌), 7 మెడికల్‌ ఆఫీసర్‌(స్పెషాలిస్ట్‌) కొలువులు ఉన్నాయి.

తెలంగాణలో తొలిసారి…
తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఆర్టీసీలో ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌ కూడా ఇవ్వలేదు. ఒక్క పోస్టు కూడా భర్తీ చేయలేదు. ఈ క్రమంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలి నోటిఫికేషన్‌కు అనుమతి ఇచ్చింది. 3,035 పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ కృతజ్ఞతలు తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థకు పెద్దపీట వేస్తూ తమ ప్రభుత్వం ఉద్యోగాలను భర్తీ చేస్తోందని తెలిపారు.

త్వరలో నోటిఫికేషన్‌..
ఆర్టీసీలో 3,035 పోస్టుల భర్తీకి అనుమతి లభించడంతో త్వరలోనే నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు ఆర్టీసీ యాజమాన్యం కసరత్తు చేస్తోంది. అయితే గత ప్రభుత్వం ఆర్టీసీలో ఉద్యోగాల భర్తీ బాధ్యతను పోలీస్‌ శాఖకు అప్పగించింది. ప్రస్తుతం ప్రభుత్వం మారిన నేపథ్యంలో కొత్తగా వెలువడే నోటిషికేషన్‌ను ఆర్టీసీ జారీ చేస్తుందా లేక పోలీస్‌ శాఖకే అప్పగిస్తుందా అనేది తెలియాల్సి ఉంది. నోటిఫికేషన్‌లోనే అర్హతలు, సిలబస్, ఎంపిక విధానం, వేతనాలు తదితర అంశాలు వెల్లడించే అవకాశం ఉంది.