Rohit Sharma: దాదాపు 17 సంవత్సరాల తర్వాత టీమిండియా టి20 వరల్డ్ కప్ గెలిచింది.. 2007లో ధోని సారధ్యంలో టీమిండియా తొలి టి20 వరల్డ్ కప్ గెలిచింది. ఆ తర్వాత 2014లో ఫైనల్ వెళ్లినప్పటికీ.. శ్రీలంక చేతిలో ఓటమిపాలైంది. గత టి20 వరల్డ్ కప్ లో సెమీఫైనల్ లో ఇంగ్లాండ్ చేతిలో దారుణమైన పరాజయాన్ని మూటకట్టుకుంది. మరోవైపు 2023లో స్వదేశంలో జరిగిన వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో భంగపాటుకు గురైంది. ఇదే క్రమంలో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్స్ లోనూ ఆస్ట్రేలియా చేతిలో నగుబాటుకు గురైంది. ఈ క్రమంలో ఎన్నో అంచనాలతో టి20 వరల్డ్ కప్ టోర్నీ లోకి అడుగుపెట్టింది. ఐర్లాండ్ నుంచి మొదలుపెడితే దక్షిణాఫ్రికా వరకు అన్ని జట్లను ఓడించి టి20 వరల్డ్ కప్ అందుకుంది.
బార్బడోస్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్లో దక్షిణాఫ్రికాపై టీమిండియా నువ్వా నేనా అన్నట్టుగా పోరాడింది. అప్పటిదాకా అన్ని మ్యాచ్లలో (బంగ్లాదేశ్ మినహా) విఫలమైన విరాట్ కోహ్లీ ఫైనల్ మ్యాచ్లో 76 పరుగులు చేశాడు. అక్షర్ పటేల్ 47 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడాడు. శివం దూబే కూడా దూకుడుగా ఆడాడు. వీరిద్దరితో కలిసి విరాట్ కోహ్లీ కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. ఒకానొక దశలో 34 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న టీమ్ ఇండియాను విరాట్ ఆదుకున్నాడు.. విరాట్ వీరోచిత బ్యాటింగ్ వల్ల టీమిండియా 176 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా 169 రన్స్ మాత్రమే చేసింది. హార్దిక్ పాండ్యా కీలకమైన మూడు వికెట్లు పడగొట్టడంతో దక్షిణాఫ్రికా ఓటమిపాలైంది. ఈ గెలుపు నేపథ్యంలో టీమ్ ఇండియా 17 సంవత్సరాల సుదీర్ఘ నిరీక్షణకు తెర దించింది. దర్జాగా t20 వరల్డ్ ఒడిసి పట్టింది.
దక్షిణాఫ్రికా తో విజయం అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ మైదానంపై అలానే పడుకుని ఉండిపోయాడు. మైదానాన్ని తన చేతితో గట్టిగా కొట్టాడు. ప్రేమతో మైదానాన్ని ముద్దాడాడు. చివరికి అదే మైదానంపై ఉన్న గడ్డిని తిన్నాడు. ” ఈ మైదానంపై మేం ఫైనల్ మ్యాచ్ గెలిచాం. దర్జాగా ట్రోఫీని అందుకున్నాం.. ఈ మైదానం నాకు చాలా ప్రత్యేకం. దీనిని నా తుది శ్వాస వరకు గుర్తుంచుకుంటాను.. నా జీవితంలో ఒక భాగం చేసుకుంటున్నాను. అందువల్లే ఆ గడ్డి, ఆ మట్టి నోట్లో వేసుకున్నాను.. దీనిపై ఎవరూ ఎలాంటి కామెంట్స్ చేసినా నాకు పెద్దగా ఇబ్బంది లేదని” రోహిత్ వ్యాఖ్యానించాడు. శనివారం టీం ఇండియా టి20 వరల్డ్ కప్ గెలిచినప్పటికీ.. రోహిత్ గడ్డి తిన్న దృశ్యాలు ఇప్పటికీ సోషల్ మీడియాలో సందడి చేస్తూనే ఉన్నాయి.